మత్తుతో చిత్తవుతారు..

6 Feb, 2017 23:28 IST|Sakshi
మత్తుతో చిత్తవుతారు..
యువతలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల వాడకం
కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : జిల్లా ఏజెన్సీ ప్రాంతాల నుంచి అక్రమ రవాణా మార్గాల ద్వారా కాకినాడ, రాజమండ్రి, అమలాపురం తదితర ప్రాంతాలకు గంజాయి, మత్తు పదార్ధాల తరలింపు.. యువతపై తీవ్ర ప్రభావం పడుతోంది. మాదక ద్రవ్యాల్లో దేశీయ ఉత్పత్తులైన గంజాయి, నల్లమందును అటవీ ప్రాంతం నుంచి అక్రమ మార్గంలో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. విదేశీ మాదక ద్రవ్యాలు హెరాయిన్, ఓపీయం, బ్రౌన్‌ ఘగర్, కొకైన్, చర్రస్‌ తదితర ప్రమాదకరమైన పదార్ధాలు స్మగ్లింగ్‌ ద్వారా దిగుమతి అవుతున్నాయి. గంజాయి అందుబాటులో లేకపోతే మత్తును కలిగించే ఔషధాలను సైతం వాడుతోన్న యువత అనారోగ్యాల పాలవుతున్నారు. దగ్గు నియంత్రణకు వినియోగించే కొడెన్‌ పాస్పేట్‌న్‌ మందును యువత విచ్చలవిడిగా వాడుతున్నట్టు విదితమవుతోంది. ఈ మందును ప్రభుత్వం నిషేధించినా మార్కెట్‌లో అనధికారికంగా లభిస్తోంది. వీటితో పాటూ వైట్‌నర్, సర్జికల్‌ స్పిరిట్‌, పోర్ట్‌విన్‌ యాంపిల్స్‌ (దీన్ని ఆపరేషన్‌ థియేటర్లో ఉపయోగిస్తారు)ను మత్తును కలిగించే ఉత్పేరకాలుగా వినియోగిస్తున్నారు. 
జిల్లాలో 25 లక్షల మంది యువతే.. 
జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 25 లక్షల దాకా యువత ఉన్నట్టుఅంచనా.  సుమారు 50 వేల వరకూ  ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులు డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్‌ కళాశాలల్లో చదువుకుంటున్నారు. విదేశాల నుంచి  సుమారు 200 మంది దాకా విద్యార్థులు వచ్చి ఇంజనీరింగ్‌ తదితర కోర్సుల్లో జిల్లాలో చదువుకుంటున్నారు. మద్యం, మాదకద్రవ్యాల వంటి ప్రమాదకర దురలవాట్లకు వీరిలో కొంతమంది బానిసలుగా మారుతున్నారు. పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోవడంతో వీరిపై మాదక ద్రవ్యాల ప్రభావం పడుతోంది. 
 
నాడీ వ్యవస్థను దెబ్బతిస్తుంది.
గంజాయి, మాదకద్రవ్యాలు, ఉత్ప్రేరకాలను తీసుకుంటే మనిషి నాడీ వ్యవస్థ, మెదడు రివార్డు సిస్టమ్‌ను దెబ్బతీస్తుంది. గంజాయిలో కెన్నావినాయిడ్స్‌ అనే మత్తు పదార్థం ఉంటుంది. అతిగా సేవిస్తే స్క్రిజోఫోనియాకు గురవుతారు. మత్తుకు బానిసలుగా మారి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతారు. కుటుంబ సభ్యుల  దురలవాట్లు వారసత్వంగా సంక్రమించే ఆస్కారం ఉంది. యవ్వన, కౌమార దశలోని వారి ప్రవర్తన,   పరిసరాల ప్రభావంపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి. పదో తరగతి పాసైన తర్వాత నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. ఈ స్వేచ్ఛతో అక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావంతో చెడు, దురలవాట్లకు బానిసలయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎనిమిదో తరగతి నుంచే విద్యార్థులకు లైఫ్‌ స్కిల్స్‌ ఇంప్రూమెంట్స్, జనరల్‌ బిహేవియర్‌ వంటి వాటిపై కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. 
- డాక్టర్‌ ఈ.రామచంద్రరావు, మానసిక వైద్య విభాగాధిపతి, కాకినాడ జీజీహెచ్‌ 
మరిన్ని వార్తలు