ప్రణాలతో గేమ్స్ చెలాగటం

7 Sep, 2017 09:03 IST|Sakshi
ప్రణాలతో గేమ్స్ చెలాగటం

తారాస్థాయికి చేరుతున్న మొబైల్‌ గేమ్స్‌  
జిల్లాకు పాకుతున్న ‘బ్లూవేల్‌’  
శ్రుతి మించుతున్న విష సంస్కృతి  
తల్లిదండ్రులూ తస్మాత్‌ జాగ్రత్త..!


తణుకు :  
వీడియో గేమ్స్‌ అంటే వినోదాన్ని పంచడం.. గతంలో స్కూలు నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు కాసేపు టీవీ చూసేవారు.. మరి ఇప్పుడు వచ్చీరాగానే సెల్‌ఫోన్‌ చేత్తో పట్టుకుని గేమ్స్‌ ఆడుతున్నారు. మామూలు గేమ్స్‌ అయితే పర్వాలేదు కానీ ఇటీవలి కాలంలో ప్రాణాలు తీసే గేమ్స్‌ అందుబాటులోకి వచ్చేశాయి. మొదట్లో చిన్నచిన్న టాస్క్‌లతో మొదలయ్యే గేమ్స్‌ చివరికి ప్రాణాలు తోడేసే వరకు వెంటాడుతున్నాయి. తాజాగా ప్రపంచాన్నే వణికిస్తున్న ఆన్‌లైన్‌ మృత్యు క్రీడ బ్లూవేల్‌ ఛాలెంజ్‌. ఇది చిన్నారులు ఆత్మహత్యలకు పాల్పడేలా ఉసిగొల్పుతూ మృత్యువల విసురుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో వందల మందిని పొట్టన పెట్టుకున్న ఈ గేమ్‌ ఇప్పుడు మన దేశంలోనూ హల్‌చల్‌ చేస్తోంది. ప్రస్తుతం జిల్లాలోనూ చాలామంది ఈ గేమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఆడుతున్నట్టు తెలుస్తోంది. అసలు ఏంటో తెలుసుకుందామని కొందరు డౌన్‌లోడ్‌ చేసుకుంటుంటే మరికొందరు కొన్ని టాస్క్‌లు పూర్తి చేశాక విషయం తెలుసుకుని విడిచిపెడుతున్నారు.

 భావోద్వేగాలతో ఆటలు
సోషల్‌ వీడియో గేమ్‌గా ప్రాచుర్యంలోకి వచ్చిన బ్లూవేల్‌ గేమ్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు. చిన్నచిన్న సవాళ్లను విసిరే ఈగేమ్‌ చివరకు ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోంది. 10 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ గేమ్‌ వారి భావోద్వేగాలతో ఆడుకుంటూ వారిని చంపేస్తోంది. రష్యాలో ఇప్పటికే 150 మందికిపైగా టీనేజర్లు బలైనట్టు తెలుస్తోంది. తాజాగా ముంబయిలోనూ ఒక విద్యార్థి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోగా రాజస్థాన్‌లో మరో విద్యార్థి చెరువులోకి దూకింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు పాకిన ఈ గేమ్‌పై ఇప్పుడు పాఠశాలలు, తల్లిదండ్రులు, మానసిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ గేమ్‌లో లీనమైతే మాత్రం బ్లేడ్‌తో శరీర భాగాలు కోసుకోవడంతో పైత్యం ప్రారంభమై.. బలవన్మరణానికి పాల్పడే వరకు ఎన్నో ఘోరాలు చేయిస్తుంది.

‘ఆ భవనం పై నుంచిదూకు..’, ‘ఈ నీళ్లలో మునుగు...’, ‘ ఆ వంతెన చివరి భాగంలో నుంచుని సెల్ఫీ పంపు’ అంటూ పిల్లలకు క్యూరేటర్లు లక్ష్యాలు నిర్దేశిస్తుంటారు. చివరకు ‘నీవు ఆత్మహత్య చేసుకునే సమయం ఆసన్నమైందంటూ’ చివరి టాస్క్‌ను నిర్దేశిస్తారు. అయితే ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలతో ప్రస్తుతం దీనికి అడ్డుకట్ట పడిందనే చెప్పవచ్చు. అయితే సాధారణ సెల్‌ఫోన్లలో సైతం ప్లేస్టోర్‌ ద్వారా ఈ గేమ్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే సౌలభ్యం ఉండటంతో కొందరు విద్యార్థులు సరదాగా డౌన్‌లోడ్‌ చేసుకుని ఆడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇదేస్థాయిలో చిన్నారులను కలుషితం చేస్తున్న మిగిలిన గేమ్స్‌ మాటేమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

పిల్లలపై తీవ్ర ప్రభావం
జిల్లాలోని ఆన్‌లైన్‌ గేమ్స్‌ విచ్చలవిడిగా డౌన్లోడ్‌ చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్లూవేల్‌ వంటి ప్రాణాంతక గేమ్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఆడుతున్నట్టు తెలుస్తోంది. పాఠశాలల్లో, ఇంటి పరిసరాల్లో కొందరు విద్యార్థుల మధ్య బ్లూవేల్‌ గేమ్‌కు సంబంధించి చర్చలు సాగుతున్నట్టు చెబుతున్నారు. ఇలా స్నేహితుల మధ్య ఒకరికొకరు తెలుసుకుని ఈ జాడ్యానికి అలవాటు పడుతున్నారు. కొన్ని ఆన్‌లైన్‌ గేమ్స్‌ పిల్లలను ఆకట్టుకునేలా డిజైన్‌ చేయడం.. గ్రాఫిక్స్‌తో కట్టిపడేసేలా ఒక లెవెల్‌ ఆడగానే మరో లెవెల్‌పై ఉత్సాహం పెరిగేలా చేయడం వంటివి చేస్తున్నారు. పెద్దల కోసం ఉన్న రమ్మీలాంటి ఆటలను ఇప్పుడు పాఠశాల విద్యార్థులు సైతం ఆడుతున్నట్టు  నిపుణులు చెబుతున్నారు.

మొబైల్‌లో ఏ ఆట ఆడారో దాన్ని ఎక్కువగా ఊహించుకోవడం, నిద్ర సమయంలో బాగా కలవరించడం వంటి చర్యల ద్వారా పిల్లల ధ్యాస చదువు నుంచి పక్కదారి పడుతోంది. ఈ తరహా గేమ్స్‌పై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అయితే సాధారణ గేమ్స్‌లతో మానసిక వ్యాధుల బారిన పడుతున్న పిల్లల సంఖ్య 2 శాతంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. మొబైల్‌ గేమ్స్‌తో 15 నుంచి 20 నిమిషాలపాటు నిర్విరామంగా లీనమైతే కచ్చితంగా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు