ఉత్తర భారత యాత్రకు ప్రత్యేక రైలు

26 Oct, 2016 21:40 IST|Sakshi
ఉత్తర భారత యాత్రకు ప్రత్యేక రైలు
– ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో నవంబరు 8న ప్రారంభం
– మాత వైష్ణోదేవి, అమృత్‌సర్, హరిద్వార్, న్యూ ఢిల్లీ, మధుర, ఆగ్రాల సందర్శనం
– 11రోజుల యాత్ర టికెట్‌ ధర రూ.9,625, ఏసీలో రూ.13,075
– ఇందులోనే రవాణా, భోజన చార్జీలు
– కర్నూలు మీదుగా తొలి ప్రత్యేక రైలు : డీజీఎం సంజీవయ్య
కర్నూలు(రాజ్‌విహార్‌): ఉత్తర భారత యాత్రకు వెళ్లాలనుకునే వారికి శుభవార్త.  అలాంటి వారి కోసం కర్నూలు మీదుగా ప్రత్యేక రైలు నడపనున్నట్లు ఇండియన్‌ రైల్వే క్యాటర్నింగ్, టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) డీజీఎం ఎన్‌. సంజీవయ్య వెల్లడించారు. బుధవారం స్థానిక కర్నూలు సిటీ రైల్వే స్టేషన్‌లోని మేనేజరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  ఆయన మాట్లాడారు. ఈ రైలు ద్వారా ఉత్తర భారతదేశంలోని మాత వైష్ణో దేవి ఆలయంతోపాటు అమృత్‌సర్, హరిద్వార్, న్యూ ఢిల్లీ, మథుర, ఆగ్రాలను సందర్శించవచ్చని చెప్పారు. 11 రోజుల పాటు సాగే ఈ యాత్రలో ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు, టీ ఉచితంగా అందిస్తామన్నారు. రైలు చార్జీలతోపాటు స్థానిక ప్రదేశాలు చూసేందుకు నాన్‌ ఏసీ బస్సు సౌకర్యం, రాత్రి బసకు ధర్మశాలలు లేదా డార్మెటరీ హాలు ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. వీటన్నింటికి కలిపి సాధారణ స్లీపర్‌ బోగీలో బెర్త్‌కు రూ.9,625, ఏసీ త్రీ టైర్‌ బోగీలో బెర్త్‌కు రూ. 13,075 చార్జీ ఉంటుందని చెప్పారు. ఐదేళ్ల వయస్సు పైబడిన వారందరికీ పూర్తి టికెట్లు తీసుకోవాల్సి ఉంటుందనా​‍్నరు. కర్నూలు మీదుగా తొలిసారి ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక టూరిస్టు రైలును రాయితీ చార్జీలతో నడుపుతున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో స్టేషన్‌ మేనేజరు మక్బూల్‌ హుసేన్, ఐఆర్‌సీటీసీ మేనేజరు ఎ.ప్రసన్న, ఎగ్జిక్యూటీవ్‌ పవన్‌ తదితరులు పాల్గొన్నారు.
 
- యాత్ర ఇలా..
  •  నవంబరు 8వ తేదీన మధ్యాహ్నం 12:20గంటలకు రేణిగుంటలో బయలుదేరి కడపలో 14:20కి, ఎర్రగుంట్ల 15:00, తాడిపత్రి 16:05, కర్నూలు సిటీ 17:10 (సాయంత్రం 5:10గంటలు), మహబూబ్‌ నగర్‌ 21:15, కాచిగూడ 23:30, కాజీపేట 9న 01:35 గంటలకు చేరుతుంది. ఈ స్టేషన్లలో ఐదు నిమిషాలు ఆగి కదులుతుంది. కేవలం యాత్రికుల కోసమే కావడంతో ఇతరులు ఎక్కడం, దిగడం ఉండదు. కాజిపేట నుంచి నేరుగా 10న సాయంత్రం జమ్మును చేరుకుంటుంది. అక్కడి నుంచి 40కిలో మీటర్లు బస్సులో కాట్రా వరకు తీసుకెళ్తారు. ఇక్కడి నుంచి 14కిలో మీటర్లు కాలి నడక లేదా గుర్రాలు, డోలీల ద్వారా వెళ్లవచ్చు. 11న మాత వైష్ణో దేవి దర్శనం అనంతరం 12 ఉదయం అమృత్‌సర్‌కు బయలుదేరుతారు. రాత్రి హరిద్వార్‌కు బయలుదేరి 13న చేరుకుంటారు. అక్కడ గంగా స్నానం, మానసాదేవి ఆలయం దర్శించుకుని రాత్రి ఢిలీకి బయలుదేరి 14న చేరుకుంటారు. అక్కడ 15వరకు స్థానిక ప్రదేశాల సందర్శన, షాపింగ్‌కు సమయం ఉంటుంది. 16న మధురలో శ్రీకృష్ణ జన్మస్థలం, ఆగ్రాలో తాజ్‌మహాల్‌ చూపిస్తారు. అదే రోజు రాత్రి బయలుదేరి 17న రాత్రి 21:10లకు కాజీపేట, కాచిగూడకి 23:10గంటలకు చేరుకుంటారు. 18వ తేదీన తెల్లవారు జామున 03:25గంటలకు కర్నూలుకు చేరుకుంటారు.
- వసతులు:
  • ఈరైలులో 72బెర్త్‌లతో కూడిన 13బోగీలు, 64బెర్త్‌లతో కూడిన 2బోగీలు ఉంటాయి. పక్కా బెర్త్‌ రిజర్వేషన్, రైలులో, ఉండే చోట సూపర్‌వైజర్లు, గైడు ఉంటారు. యాత్రికులకు ఇన్సూరెన్స్‌ సౌకర్యం ఉంటుంది. సమయానికి టిఫిన్, మధ్యాహ్న, రాత్రి భోజనాలు, టీ ఇస్తారు. స్థానిక ప్రదేశాలు చూసేందుకు నాన్‌ ఏసీ బస్‌ సౌకర్యం, ఉండేందుకు వసతి, భద్రత (సెక్యూరిటీ) ఉంటుంది. కర్నూలులో రైలు ఎక్కితే యాత్ర అనంతరం తిరిగి ఇక్కడ దించుతారు.
 టికెట్లు ఇలా పొందాలి:
యాత్ర టికెట్లును ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ www.irctctourism.com  నుంచి లేదా సికింద్రాబాదులోని ఎస్‌డీ రోడ్డులో ఉన్న ఆక్స్‌ఫర్డ్‌ ప్లాజాలోని కార్యాలయం నుంచి పొందవచ్చు. యాత్రికుల సంఖ్య పది మందికి పైగా ఉంటే సంస్థ ప్రతినిధి ఇక్కడికి వచ్చి టికెట్లు ఇస్తారు. వివరాలకు 040- 27702407, 97013 60701 నంబర్లకు సంప్రదింవచ్చు.
 
మరిన్ని వార్తలు