దక్షిణ భారత యాత్రకు ప్రత్యేక రైలు

12 Dec, 2016 15:25 IST|Sakshi
వాల్‌ పోస్టర్‌ను విడుదల చేస్తున్న రైల్వే అధికారులు
– ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో డిసెంబరు 29న ప్రారంభం
– శబరిమలై, గురువాయర్, కన్యాకుమారి, మధురై, శ్రీరంగం, తంజావూరుల సందర్శనం
– 7రోజుల యాత్ర టికెట్‌ ధర రూ.5,855, ఏసీలో రూ.8,050
– ఇందులోనే రవాణ, భోజన చార్జీలు : డీజీఎం సంజీవయ్య
కర్నూలు(రాజ్‌విహార్‌): దక్షిణ భారత యాత్రకు వెళ్లాలనుకునే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైలును నడపనున్నట్లు ఇండియన్‌ రైల్వే క్యాటర్నింగ్, టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) డీజీఎం ఎన్‌. సంజీవయ్య తెలిపారు. సోమవారం స్థానిక కర్నూలు సిటీ రైల్వే స్టేషన్‌లోని వీఐపీ లాంజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈరైలు ద్వారా దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడులో ఉన్న శబరిమలై, గురువాయర్, కన్యాకుమారి, మధురై, శ్రీరంగం, తంజావూరులను సందర్శించవచ్చని చెప్పారు. 7రోజుల పాటు సాగే ఈయాత్రలో ఉదయం టిఫిక్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు, టీ ఉచితంగా అందిస్తామన్నారు. రైలు చార్జీలతోపాటు స్థానిక ప్రదేశాలు చూసేందుకు బస్సు సౌకర్యం, రాత్రి బసకు ధర్మశాలలు లేదా డార్మిటరీ హాలు ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. వీటన్నింటికి కలిపి సాధారణ స్లీపర్‌ బోగీలో బెర్త్‌కు రూ.5,855, ఏసీ త్రీ టైర్‌ బోగీలో బెర్త్‌కు రూ. 8,050 చార్జీ ఉంటుందని, ఐదేళ్ల వయస్సు పైబడిన వారందరికీ పూర్తి టికెట్లు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కర్నూలు మీదుగా వెళ్లే ఈ ప్రత్యేక టూరిస్టు రైలును రాయితీ చార్జీలతో నడుపుతున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో స్టేషన్‌ మేనేజరు మక్బూల్‌ హుసేన్, ఐఆర్‌సీటీసీ మేనేజరు ఎ.ప్రసన్న పాల్గొన్నారు.
= యాత్ర ఇలా..
– డిసెంబరు 29వ తేదిన అర్థరాత్రి 12 గంటలకు రేణిగుంటలో బయలుదేరి కర్నూలుకు తెల్లవారుజామున 4:30గంటలకు చేరుకుంటుంది. ఇక్కడ ఐదు నిమిషాలు ఆగి బయలుదేరి గుత్తి, కడప, రేణిగుంట మీదుగా 30న అర్థరాత్రి 2గంటలకు గురువాయర్‌ చేరుకుంటుంది. కేవలం యాత్రికుల కోసమే కావడంతో ఇతరులు ఎక్కడం, దిగడం ఉండదు. ఉదయం గురువాయరప్ప (శ్రీకృష్ణ) ఆలయ దర్శనం అనంతరం బయలుదేరి సాయంత్రం 4గంటలకు చెంగనూరు చేరుకుంటుంది. అక్కడి నుంచి నీలకల్‌ వరకు బస్సులో, పంబ నుంచి కాలినడక లేదా డోలీల్లో సన్నిదానంకి 31న చేరుకొని అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. అదే రోజు తిరిగి బయలుదేరి సాయంత్రం నీలకల్, రాత్రికి చెంగనూరు, 1న కన్యాకుమారికి చేరుకుంటారు. అక్కడ కన్యాకుమారి, వివేకానంద రాక్‌ మెమోరీయల్‌ చూసి అక్కడే బస చేస్తారు. 2న ఉదయం బయలుదేరి మధ్యాహ్నం 2గంటలకు మధురై చేరుకొని అక్కడ మధుర మీనాక్షి ఆలయంతోపాటు ఇతర దర్శనీయ స్థలాలు చూపిస్తారు. రాత్రి బయలుదేరి 3న తిరుచనాపల్లి శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయం, తంజావూరుకు రోడ్డు మార్గాన వెళ్లి బృహదీశ్వర ఆలయం దర్శించుకుంటారు. తిరుచనూరుకు వచ్చి రాత్రి బయలుదేని 4న రాత్రి 11గంటలకు కర్నూలుకు చేరుకుంటారు. శబరిమలైకి వెళ్లలేని వాళ్లను అలకిలో రాత్రి బస చేయించి స్థానిక దర్శనీయ స్థలాలు, బోటింగ్‌ షికారు వంటివి చూపిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు లీవ్‌ ట్రావెలింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఎల్‌టీసీ)ని వాడుకునే సౌకర్యం ఉంది.
= వసతులు:
– ఈరైలులో 72బెర్త్‌లతో కూడిన 12 స్లీపర్‌ బోగీలు, 64బెర్త్‌లతో కూడిన 3బోగీలు ఉంటాయి. టూర్‌ ఎస్కార్ట్‌ ఉండడంతోపాటు యాత్రికులకు ఇన్సూరెన్స్‌ సౌకర్యం ఉంటుంది. సమయానికి టిఫిన్, మధ్యాహ్న, రాత్రి భోజనాలు, టీ ఇస్తారు. స్థానిక ప్రదేశాలు చూసేందుకు బస్‌ సౌకర్యం, ఉండేందుకు వసతి, భధ్రత (సెక్యూరిటీ) ఉంటుంది. కర్నూలు రైలు ఎక్కితే యాత్ర అనంతరం కర్నూలు దించుతారు.
– టికెట్లు ఇలా పొందాలి:
యాత్ర టికెట్లును ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌  నుంచి లేదా సికింద్రాబాదులోని ఎస్‌డీ రోడ్డులో ఉన్న ఆక్స్‌ఫర్డ్‌ ప్లాజాలోని కార్యాలయం నుంచి పొందవచ్చు. యాత్రికుల సంఖ్య పది మందికి పైగా ఉంటే సంస్థ ప్రతినిధి ఇక్కడికి వచ్చి టికెట్లు ఇస్తారు. వివరాలకు 040 27702407, 97013 60701/682  నంబర్లకు సంప్రదింవచ్చు.
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా