పెరగనున్న భద్రాద్రి ప్రత్యేక దర్శనం టికెట్ ధర

26 Jan, 2016 22:16 IST|Sakshi

భద్రాచలం : ఖమ్మం జిల్లాలోని భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ప్రత్యేక దర్శనం టికెట్ ధర పెంచేందుకు దేవస్థానం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రూ.20 ఉన్న ప్రత్యేక దర్శనం టికెట్ ధరను రూ.50 వరకు పెంచేందుకు నిర్ణయించారు. దీనిపై భక్తులు తమ అభిప్రాయూలు తెలపాలంటూ దేవస్థానం అధికారులు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. దీనిపై భక్తుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నారుు. ఇప్పటి వరకూ రూ.20 టికెట్ తీసుకున్న వారు సుదర్శన ద్వారం నుంచి నేరుగా స్వామివారిని దర్శించుకుని గర్భగుడి నుంచి బయటకు వస్తున్నారు. రూ.150 అర్చన టికెట్ తీసుకున్న భక్తులను మాత్రం గర్భగుడిలోని స్వామి వారి మూలవరుల వరకూ పంపిస్తున్నారు.

శని, ఆదివారాల్లోనూ, అదే విధంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో ప్రత్యేక దర్శనం పేరుతో రూ.20 కు బదులుగా రూ.100 టికెట్‌ను విక్రరుుస్తున్నారు. ఒక దర్శనం కోసం ఇలా వేర్వేరు టికెట్‌ల పేరుతో ఎక్కువ వసూలు చేయడంపై కూడా భక్తులు మండిపడుతున్నారు. దీంతో ప్రత్యేక దర్శనం టికెట్‌ను ఇక నుంచి రూ.50కు పెంచి, రద్దీ రోజుల్లో కూడా దీనినే విక్రయించేలా దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 20న జారీచేసిన ప్రకటనపై 15 రోజులలోపు భక్తులు తమ అభ్యంతరాలు, సూచనలు, సలహాలు అందజేయాలని పేర్కొన్నారు. కానీ ఈ విషయంపై దేవస్థానం అధికారులు తగిన రీతిలో ప్రచారం చేయకపోవడం సరైంది కాదని భక్తులు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు