వేగపరిమితి తప్పనిసరి

29 Apr, 2017 23:28 IST|Sakshi
వేగపరిమితి తప్పనిసరి
– స్పీడ్‌ గవర్నర్స్‌ లేని రవాణా వాహనాలకు ఫిట్‌నెస్‌ ‘నో’
– టాంపరింగ్‌ చేసినవారిపై కఠిన చర్యలు 
– ఏర్పేడు ఘటన నేపథ్యంలో ప్రమాద నివారణపై స్పెషల్‌ డ్రైవ్‌ 
 
కర్నూలు: గరిష్ట వేగ పరిమితిని పాటించేందుకు దోహదపడే స్పీడ్‌ గవర్నర్స్‌ లేని రవాణా వాహనాలకు సోమవారం నుంచి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లను జారీ చేయకూడదని జిల్లా రవాణా శాఖ నిర్ణయించింది. మితిమీరిన వేగం వల్ల రోడ్డు ప్రమాదాలు భారీ సంఖ్యలో జరగడం, అపార ప్రాణనష్టం సంభవించడంతో ఈ మేరకు రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేస్తే ఆ వాహనం ఇక బయట తిరిగే అవకాశం ఉండదు. ఒకవేళ తిరిగితే సీజ్‌ చేస్తారు. భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది.
 
చట్టం ఏమి చెబుతోంది...
మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం రవాణా వాహనాలు 20 కిలోమీటర్ల వేగానికి మించి వెళ్లడానికి వీలు లేదు. రవాణా వాహనాలకు 2015 అక్టోబర్‌ 1 ముందు వరకు స్పీడ్‌ గవర్నర్స్‌ విధానం ఉండేది కాదు. కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అక్టోబర్‌ 2015 నుంచి తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో వాహన తయారీదారులు కొత్తగా ఉత్పత్తి చేసే వాహనాల్లో వేగ పరిమితి అమర్చుతున్నారు. దీనివల్ల ఆ వాహనం గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్లగలదు. అక్టోబర్‌ 2015 ముందు వాహనాలకు ఈ విధానం లేకపోవడంతో 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ఉదంతాలు ఉన్నాయి. 
 
ఉల్లంఘనలు ఇలా..
కేంద్ర ప్రభుత్వం స్పీడ్‌ గవర్నర్స్‌ను తప్పనిసరి చేసినా ఉల్లంఘనలు జరుగుతున్నాయి. వాహన కంపెనీలు అంతర్గతంగా వేగపరిమితిని బిగించి వాటికి సీల్‌ చేసినా యజమానులు టాంపరింగ్‌ చేస్తున్నారు. జిల్లాలో స్టేజ్‌ కారియర్లుగా తిరిగే రవాణా వాహనాల్లో చాలావరకు టాంపరింగ్‌ జరిగాయని రవాణా శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఇటీవలే కొన్ని బస్సులకు తనిఖీలు నిర్వహించినప్పుడు ఈ విషయం వెలుగు చూసింది. స్పీడ్‌ గవర్నర్స్‌ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతుండటం రవాణా శాఖ అధికారుల దృష్టికి వచ్చింది. రవాణా వాహనాలు ఫిట్‌నెస్‌ కోసం కార్యాలయానికి రాగానే ముందుగా వేగపరిమితి ఉందో లేదో చెక్‌ చేస్తారు. పరిశీలనలో టాంపరింగ్‌కు గురైందని తేలితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారు. కోర్టుకు కూడా నివేదిస్తారు. స్పీడ్‌ గవర్నర్లు లేనివారు వాటిని బిగించుకుని ఫిట్‌నెస్‌కు రావాల్సిందిగా రవాణా శాఖ జిల్లా ఉపకమిషనర్‌ ప్రమీల తెలిపారు. 
 
జిల్లాలో స్పెషల్‌ డ్రైవ్‌... 
చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన నేపథ్యంలో జిల్లాలో ‘ఉల్లంఘనుల’పై స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగిస్తున్నట్లు డీటీసీ ప్రమీల తెలిపారు. మోటర్‌ వాహన తనిఖీ అధికారులు కె.వి.ఎల్‌.ఎన్‌.ప్రసాద్, స్వాతి, రమణా నాయక్‌ నేతృత్వంలో రోడ్డు సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్నవారిపై రెండు రోజుల్లో 97 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఓవర్‌లోడ్, ఓవర్‌ క్రోడింగ్, రెండవ డ్రైవర్‌ లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న వారిపై స్పెషల్‌ డ్రైవ్‌ నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు. 
 
>
మరిన్ని వార్తలు