చకచక ఏర్పాట్లు..

7 Sep, 2016 21:21 IST|Sakshi
చకచక ఏర్పాట్లు..
కామారెడ్డి : కామారెడ్డి నూతన జిల్లాగా ఏర్పాటు కానుండడంతో ఆయా ప్రభుత్వ విభాగాలకు అవసరమైన భవనాల ఎంపిక ప్రక్రియ ముమ్మరమైంది. జిల్లా పోలీసు శాఖ భవనంతో పాటు ఎస్పీ నివాస గృహాలను ఎంపిక చేసిన అధికారులు కావలసిన ఏర్పాట్లను మొదలుపెట్టారు. పట్టణంలోని అడ్లూర్‌ రోడ్డులో గల ఎస్టీ హాస్టల్‌ భవనాన్ని ఎస్పీ కార్యాలయం కోసం ఎంపిక చేశారు. ఆ భవనాన్ని ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అలాగే భవానీనగర్‌లో ఎస్పీ నివాస గృహం కోసం ఓ ఇంటిని పరిశీలించి, దానిని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసు శాఖ కార్యాలయాలు, నివాస గృహాలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై నిఘా వర్గాలు ముందస్తుగా పరిశీలన చేపట్టాయి. ఎస్పీ కార్యాలయానికి ఎంపిక చేసిన భవనానికి వెళ్లే దారిని ట్రాక్టర్లతో చదును చేశారు. అంతేగాక భవనం వద్ద పోలీసు కాపలా ఉంచారు. ఎస్పీ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఎటు వైపు నుంచి వస్తారు, ఎటువైపు వెళతారు, రక్షణ ఏర్పాట్ల తదితర అంశాలపై అధికారులు దృష్టి సారించారు. ఈ నెల 20 లోపు జిల్లా కార్యాలయాలకు సంబంధించి అధికారులు, సిబ్బంది చేరుకుని ఏర్పాట్లు చేసుకోవలసి ఉంటుంది. దసరా రోజున కచ్చితంగా జిల్లా పాలన మొదలుకానున్న నేపథ్యంలో అన్ని విభాగాల్లో వేగం పెరిగింది.
కొనసాగుతున్న ‘కలెక్టరేట్‌’ పనులు..
జిల్లా కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ కోసం ఎంపిక చేసిన మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాల భవనాల్లో పనులు ముమ్మరమయ్యాయి. ప్రధాన గేటు వద్ద కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణ పనులు సాగుతున్నాయి. అలాగే కలరింగ్‌ తుది దశలో ఉంది. అయితే, కార్యాలయానికి అనుకూలంగా చేపట్టాల్సిన పనులు ఒకటి రెండు రోజుల్లో మొదలవుతాయని భావిస్తున్నారు. జిల్లా కార్యాలయాల నిర్వహణకు భవనం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండడంతో పెద్దగా మార్పులు, చేర్పులు ఉండకపోవచ్చని పేర్కొంటున్నారు. కాగా, కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లడానికి ఉన్న రోడ్డును అభివృద్ధి చేయాల్సి ఉంది. అలాగే కాంప్లెక్స్‌ కాంపౌండ్‌లో నల్లమట్టితో ఉన్న నేల కావడం వల్ల ఇబ్బందికరంగా ఉంది. కాంప్లెక్స్‌ ఆవరణలో మొరం నింపడమో, సీసీ పనులు చేపట్టడమో చేస్తే రాకపోకలకు అనువుగా ఉంటుంది. మరోవైపు, కలెక్టర్‌ నివాసానికి సంబంధించి ఇంకా ఏ భవనాన్ని ఖరారు చేయలేదని తెలుస్తోంది. కాంప్లెక్స్‌ ఆవరణలో ప్రిన్సిపల్‌ క్వార్టర్‌ ఉన్నప్పటికీ కలెక్టర్‌ క్యాంపు కార్యాలయానికి అంత అనుకూలంగా లేదు. దీంతో కలెక్టర్‌ నివాసం ఎక్కడా అనేది ఇంకా నిర్ణయించలేదు. మొత్తమ్మీద కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. 
 
మరిన్ని వార్తలు