ఎంసెట్-2 లీకేజీపై విచారణ ముమ్మరం

23 Jul, 2016 20:34 IST|Sakshi

పరకాల(వరంగల్): పరీక్షకు ముందే పేపర్ లీకైనట్లు బాధిత తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎంసెట్-2పై సీఐడీ విచారణను ముమ్మరం చేసింది. ఇందులో వరంగల్ జిల్లా పరకాల, భూపాలపల్లి ప్రాంతాల నుంచి కొందరి మార్కులు, ర్యాంకులపై అనుమానాలు రావడంతో అధికారుల దృష్టి అంతా ఇటు వైపే ఉంది. ఎంసెట్-2 అక్రమాలపై పోలీసు, ఇంటెల్‌జెన్స్ అధికారులు వివరాలను ఇది వరకే సేకరించగా శనివారం సీఐడీ అధికారులు బాధితుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం తీసుకుంటున్నట్లు తెలిసింది.

సీఐడీ డీఎస్పీ స్థాయి అధికారి ఒకరు స్వయంగా ఫోన్‌లో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరకాల, భూపాలపల్లి ప్రాంతాల్లో ఎంతమందికి అక్రమంగా ర్యాంకులు వచ్చాయో తెలుసుకున్నారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటీ అనే కోణంలో ఆరా తీశారు. ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్-1, టీఎస్ ఎంసెట్-2లో వచ్చిన మార్కులు, ర్యాంకులను ప్రస్తావిస్తూ బాధితులు క్షుణ్ణంగా వివరించినట్లు తెలిసింది. కేవలం 40 రోజుల వ్యవధిలోనే జరిగిన పరీక్షల్లో వేలల్లో ఉన్న ర్యాంకులు వందల్లోకి వచ్చాయని వివరించారు. కోచింగ్ సెంటర్‌లో అంతగా ప్రతిభ కనబర్చనప్పటికీ మొదటిసారి పరీక్షకు హాజరైన విద్యార్థుల ర్యాంకులు అనుమానాలకు తావిస్తోందని చెప్పినట్లు తెలిసింది. ఒకే సెంటర్‌లో శిక్షణ పొంది సరిగ్గా వారం కిందటనే రహస్య ప్రాంతానికి తరలివెళ్లారని చెప్పినట్టు సమాచారం.
 

>
మరిన్ని వార్తలు