రన్‌వేపైకి స్పైస్‌జెట్‌ విమానం

19 Sep, 2016 00:25 IST|Sakshi
రేణిగుంట విమానాశ్రయంలో ఆగిపోయి ఉన్న స్పైస్‌జెట్‌ విమానం

– నేటినుంచి యథావిధిగా విమాన రాకపోకలు
రేణిగుంటః
రేణిగుంటలో బురదలో కూరుకుపోయిన విమానాన్ని ఆదివారం రాత్రి రన్‌వేపైకి తీసుకొచ్చారు. రేణిగుంట విమానాశ్రయంలో శనివారం రాత్రి స్పైస్‌జెట్‌ విమానం  ల్యాండింగ్‌ సమయంలో అదుపు తప్పి రన్‌వేను దాటి బురదలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. విమాన ప్రమాద విషయం తెలుసుకున్న విమానయానశాఖ అధికారులు ఢిల్లీ నుంచి విమానాశ్రయానికి చేరుకున్నారు.  స్పైస్‌జెట్‌ ఉన్నతాధికారులు కూడా ఇక్కడకు చేరుకున్నారు. సుమారు 20టన్నులకు పైగా బరువుతో బురద మట్టిలో దిగబడిన విమానాన్ని రన్‌వే పైకి లాక్కొచ్చేందుకు ఆదివారం ఉదయం నుంచి మూడు భారీ క్రేన్ల సాయంతో సిబ్బంది ప్రయత్నించారు. చివరకు రాత్రి 7.30 గంటలకు రన్‌వే మీద పార్కింగ్‌ ప్రాంతంలోకి తీసుకొచ్చారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ పుల్లా, రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప, శ్రీకాళహస్తి డీఎస్పీ వెంకటకిషోర్‌ సహాయక చర్యలను పర్యవేక్షించారు. దీంతో సోమవారం నుంచి ఇక్కడి నుంచి విమాన రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ పుల్లా తెలిపారు.
ప్రయాణికుల అవస్థలు
రేణిగుంట విమానాశ్రయం నుంచి ఆదివారం పూర్తిగా విమాన సర్వీసులు నిలిపివేస్తూ కేంద్ర విమానయాన శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాగా శనివారం రాత్రి టేకాఫ్‌ కాకుండా ఇక్కడే నిలిచిపోయిన ట్రూజెట్‌ విమానాన్ని వూత్రం ఆదివారం మధ్యాహ్నం 3.30గంటలకు ఇక్కడ నుంచి హైదరాబాద్‌కు పంపారు. దీనిని మినహాయిస్తే మిగిలిన విమాన రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మరిన్ని వార్తలు