కౌన్సెలింగ్‌లో ‘స్పౌజ్‌’ రగడ!

5 Aug, 2017 21:56 IST|Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా శనివారం స్థానిక సైన్స్‌ సెంటర్‌లో జరిగిన పండిట్ల బదిలీల కౌన్సెలింగ్‌లో ‘స్పౌజ్‌’పై రగడ జరిగింది. నిబంధనలు విరుద్ధంగా స్పౌజ్‌ కేటగిరీ ఉపాధ్యాయులకు బదిలీస్థానాలు కేటాయిస్తున్నారంటూ పలువురు టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కౌన్సెలింగ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏవైనా అభ్యంతరాలుంటే రాతపూర్వకంగా రాసిస్తే విచారించి చర్యలు తీసుకుంటామని, అంతేతప్ప ఇలా కౌన్సెలింగ్‌ను అడ్డుకుంటే మాత్రం కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని డీఈఓ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. చెన్నేకొత్తపల్లి మండలంలో స్పౌజ్‌ పని చేస్తుంటే గార్లదిన్నె మండలానికి బదిలీ చేశారని, అలాగే కూడేరు మండలంలో స్పౌజ్‌ పని చేస్తుంటే ఆ మండలంలో ఖాళీలున్నా కూడా గార్లదిన్నె మండలం ఎటా కేటాయిస్తారని పలువురు టీచర్లు ప్రశ్నించారు.

అలాగే కదిరి చుట్టుపక్కల మండలాల్లో పని చేస్తూ స్పౌజ్‌ కేటగిరిలో దరఖాస్తు చేసుకున్న పలువురు ఉపాధ్యాయులు ఆయా మండలాల్లో ఖాళీలున్నా కదిరి మండలానికి వచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై టీచర్ల మధ్య వాగ్వాదం జరిగింది. అందరికీ సర్దిచెప్పిన డీఈఓ చివరకు కౌన్సెలింగ్‌ జరిగేలా చర్యలు తీసుకున్నారు. మొత్తానికి రాత్రి 9 గంటల సమయానికి కౌన్సెలింగ్‌ పూర్తయింది. పండిట్లతో పాటు, ఎస్జీటీల బదిలీ ఉత్తర్వులు ఆదివారం జనరేట్‌ అయ్యే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

డీఈఓ పూల్‌లో ఉన్న టీచర్ల సంగతేంటి ?
ఇదిలా ఉండగా రేషనలైజేషన్‌ ప్రభావంతో పోస్టులు లేక పలువురు టీచర్లు డీఈఓ ఫూల్‌లో ఉన్నారు. నిబంధనల ప్రకారం ఏదో ఒక చోట పని చేస్తుంటేనే జీతాలు చేయడానికి వీలుంటుంది. మొత్తం 61 మంది టీచర్లు డీఈఓ పూల్‌లో ఉన్నారు. తెలుగు పండిట్లు 18 మంది, హిందీ పండిట్లు 11 మంది, పీఈటీలు 32 మంది ఉన్నారు. వీరిపై వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే బదిలీ అయిన వారంతా వారివారి స్కూళ్లలో చేరిపోతే మిగులు టీచర్లను ఎక్కడ చూపించాలనేది విద్యాశాఖకు అంతుచిక్కడం లేదు. వాస్తవానికి వీరందరిని ఎస్జీటీ అగైనెస్ట్‌ పోస్టులకు సర్దుబాటు చేసి జీతాలకు ఇబ్బంది లేకుండా చూడాలని భావించారు. అయితే రాష్ట్ర అధికారులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. డీఈఓ పూల్‌లో ఉన్న టీచర్లు ఆందోళనలో ఉన్నారు. వీరి విషయంలో ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని డీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. 

మరిన్ని వార్తలు