వైఎస్‌ఆర్‌సీపీ పత్తికొండ ఇన్‌చార్జిగా శ్రీదేవి

20 Jun, 2017 23:52 IST|Sakshi
వైఎస్‌ఆర్‌సీపీ పత్తికొండ ఇన్‌చార్జిగా శ్రీదేవి
– వైఎస్‌ జగన్‌ను కలిసిన నారాయణరెడ్డి కుటుంబీకులు
– శ్రీదేవిని ఇన్‌చార్జీగా ప్రకటించిన అధినేత
  
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జిగా దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి సతీమణి కంగాటి శ్రీదేవిని ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు కంగాటి శ్రీదేవి, కుమారుడు రామ్మోహన్‌రెడ్డి, అన్న ప్రదీప్‌కుమార్‌రెడ్డి, కుటుంబ సభ్యులు, అనుచరులు మోహన్, చెక్క నాగన్న హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. పత్తికొండ నియోజవకవర్గంలోని నారాయణరెడ్డి అనుచరులకు అండగా ఉంటామని తెలపడంతో అక్కడికక్కడే ఆయన శ్రీదేవిని నియోజవకర్గ ఇన్‌చార్జిగా ప్రకటించారు. దీంతో వారంతా వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
 
నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్న నారాయణరెడ్డిని ప్రత్యర్థులు మే 21న దారుణంగా  చంపేశారు. ఆయన బతికి ఉంటే తమకు రాజకీయ భవిష్యత్‌ ఉండదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు భావించి హత్య చేశారనే ఆరోపణలున్నాయి. ఇందులో నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు ఏకంగా కేఈ శ్యాంబాబుపై కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి, కృష్ణగిరి, పత్తికొండ, మద్దికెర, తుగ్గలి మండలాల్లో నారాయణరెడ్డి అనుచరులు తమకు అండగా నిలవాలని శ్రీదేవిని కోరారు. అందుకు ఆమె అంగీకరించి మంగళవారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విన్నవించగా ఆయన ఇన్‌చార్జిగా ప్రకటించారు. గతంలో కంగాటి శ్రీదేవి కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌గా పనిచేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను బలవంతంగా రాజీనామా చేయించి పదవి నుంచి దింపడం తెలిసిందే. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా చూడడమే లక్ష్యంగా నారాయణరెడ్డి పనిచేశారని, అదే లక్ష్యంతో తాము కూడా పనిచేస్తామని ‘సాక్షి’తో శ్రీదేవి పేర్కొన్నారు.
 
మరిన్ని వార్తలు