శ్రీగిరి.. ఉత్సవభేరి

17 Feb, 2017 22:32 IST|Sakshi
శ్రీగిరి.. ఉత్సవభేరి
- శాస్త్రోక్తంగా ప్రారంభమైన శివరాత్రి వేడుకలు 
- సకల దేవతలను ఆహ్వానిస్తూ
   ధ్వజపటావిష్కరణ 
- చండీశ్వరునికి విశేష పూజలు 
  
శ్రీశైలం: శివ భక్తులకు భూకైలాసమైన శ్రీశైల మహాక్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆరంభ పూజలను అత్యంత శాస్త్రోక్తంగా ఈఓ నారాయణ భరత్‌ గుప్త, అర్చకులు, వేదపండితులు నిర్వహించారు.  ప్రత్యేక పూజల్లో భాగంగా బ్రహ్మోత్సవాల నిర్వాహకుడైన చండీశ్వరుని ఆవాహన చేసి దీక్షా వస్త్రాలను సమర్పించి కంకణధారణ చేయించారు. ఆ తరువాత ఉత్సవంలో పాల్గొనే అర్చకులు, వేదపండితులు, భజంత్రీలు, సంబంధిత సిబ్బందికి దీక్షా వస్త్రాలను అందజేశారు. అనంతరం పుణ్యహవాచనం, శివసంకల్పం, చండీశ్వర పూజ, రుత్విగ్వరణం, అఖండస్థాపన, వాస్తు పూజ, వాస్తు హోమం, పంచావరణార్చన, మండపారాధన, కలశ స్థాపన తదితర ప్రత్యేకపూజలను నిర్వహించారు. క్షేత్ర పాలకుడైన వీరభద్రుని ఆధ్వర్యంలో ముక్కంటి బ్రహ్మోత్సవాలను చండీశ్వరుడే నిర్వహిస్తారని వేదపండితులు తెలిపారు. అందుకే చండీశ్వరునికి ముందుగా కంకణధారణ చేస్తామన్నారు. ఉత్సవ సమయంలో ప్రతి రోజూ ఉభయ దేవాలయ పూజల వేళల్లో ఈ చండీశ్వరుని పల్లకి ఊరేగింపు ఉంటుందన్నారు. 
 
సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఉదయం యాగశాలలో గణపతి పూజతో ప్రారంభం కాగా,  రాత్రి 8 గంటలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటావిష్కరణ చేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేదమంత్రోచ్ఛారణలతో నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠాపన  పూజలు జరిగాయి. అనంతరం పల్లకిలో చండీశ్వరుడిని ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజ స్తంభం వద్దకు తీసుకు వచ్చారు. వేదమంత్రోచ్ఛారణలతో మంత్రపూర్వకంగా సకల దేవతలను ఆహ్వానిస్తూ  శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలి రావాల్సిందిగా ముక్కోటి దేవతలకు పిలుపునిచ్చారు.
 
క్షేత్ర పాలకుడైన వీరభద్రుని పర్యవేక్షణలో చండీశ్వరుని ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాలకు మహాశివరాత్రి రోజున శ్రీ  భ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల కల్యాణ మహోత్సవానికి ముక్కోటి దేవతలు వస్తారని, మహావిష్ణువు కన్యాదానం చేయగా,  బ్రహ్మ రుత్వికత్వం నిర్వహిస్తారని శైవాగమం చెబుతోందని వేదపండితులు పేర్కొన్నారు.  
 
ధ్వజారోహణకు ఈఓ దూరం:
ప్రతి ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో ఆలయ కార్యనిర్వహణాధికారి కంకణధారణ చేసుకుని ధ్వజపటావిష్కరణ, ధ్వజారోహణ కార్యక్రమ క్రతువులను నిర్వహించడం ఆగమ సంప్రదాయం. అయితే అత్యున్నత అధికారి లేనప్పుడు, ఆలయ అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. శుక్రవారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆరంభ క్రతువులలో కీలకమైన ధ్వజపటావిష్కరణ, ధ్వజారోహణ కార్యక్రమాలకు ఈఓ హాజరు కాకపోవడంతో అర్చకులు, వేదపండితులే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విమర్శలకు తావిచ్చినట్లయింది.    
మరిన్ని వార్తలు