శ్రీకాళహస్తి టీడీపీ నేతల రాజీనామా

3 Apr, 2017 03:53 IST|Sakshi
శ్రీకాళహస్తి టీడీపీ నేతల రాజీనామా

శ్రీకాళహస్తిలో దేశం కనుమరుగే అంటున్న నేతలు
ప్రస్తుతం 300 మంది..రేపటికల్లా     100 శాతం మంది రాజీనామాలు
ఆలయ కమిటీ చైర్మన్‌ గురవయ్యనాయుడు, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పార్థసారథి వెల్లడి


శ్రీకాళహస్తి: రాష్ట్ర అటవీశాఖ మంత్రి పదవి నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని చంద్రబాబు తొలగించడంతో ఆదివారం శ్రీకాళహస్తి టీడీపీ నాయకులు, నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు చంద్రబాబునాయుడు గొప్ప నాయకుడు అని పొగిడిన వాళ్లే ఆదివారం వెన్నుపోటుదారుడు అంటూ అరిచి గగ్గోలు పెడుతున్నారు. మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని అలాంటి వ్యక్తికి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేసిన సేవలు గుర్తుకు రావంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుతో ప్రయాణం చేస్తు అలిపిరి ఘాట్‌ వద్ద బాంబు ప్రమాదంలో బొజ్జల తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. నాడు ఎన్టీఆర్‌ను కాదని చంద్రబాబు నడిచిన విషయం ఆయన గుర్తుంచుకోకపోవడం దారుణమని పలువురు నాయకులు బహిరంగంగానే సీఎంను దుమ్మెత్తి పోస్తున్నారు. తిరిగి బొజ్జలను మంత్రివర్గంలో తీసుకోకపోతే శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీకి నామరూపాలు ఉండవంటూ నేతలు హెచ్చరించారు.

5 సార్లు ఎమ్మెల్యే.. 3 సార్లు మంత్రి..అయినా పక్కన పెట్టేశారు..
1989లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన బొజ్జల 2004లో మినహా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మూడుసార్లు మంత్రిగా పనిచేశారు. ఇంత సీనియర్‌ నేతను మంత్రి పదవి నుంచి తొలగించడం పార్టీకే చేటుగా టీడీపీ సీనియర్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

బొజ్జలతోనే తామంతా..
నియోజకవర్గంలో కేవలం బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కృషితో వచ్చిన పదవులే తప్ప.. అధిష్ఠానం గుర్తించి ఇచ్చినవి కాదని దేవస్థానం చైర్మన్‌ పోతుగుంట గురవయ్యనాయుడు అన్నారు. శనివారం రాత్రి ఆరోసారి టీడీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో పార్టీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోతుగుంట గురవయ్యనాయుడు మాట్లాడుతూ పార్టీ ప్రారంభం నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొనసాగుతున్నారని చెప్పారు. దాంతోనే వరుసగా నియోజకవర్గంలో అందరు రాజీనామాలు చేస్తున్నారని.. ఇప్పటికే 300 మందికి పైగా ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేశారని తెలిపారు.

మరోసారి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో చర్చించి అవసరమైతే తానూ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తొట్టంబేడు మండలంలో జెడ్పీటీసీ అనçసూయమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు గాలి అనసూయమ్మ, ఎంపీపీ పోలమ్మ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రామాంజులు నాయుడు, సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులు గాలి మురళీనాయుడు తదితరులు రాజీనామా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ముత్యాల పార్థసారథి మాట్లాడుతూ దశాద్దాలుగా పార్టీని నమ్ముకున్న వారి పదవులు తొలగించి.. వైఎస్సార్‌సీపీలో గెలుపొంది పార్టీ ఫిరాయించి వచ్చిన నలుగురుకి మంత్రి పదవులు కట్టబెట్టడం సిగ్గు చేటన్నారు.

నియోజకవర్గంలో ఇప్పటికే పదవుల్లో ఉన్న 80 శాతం మంది రాజీనామా చేశారని.. రేపటికల్లా 100 శాతం రాజీనామాలు చేస్తారని ఆయన వెల్లడించారు. సింగల్‌విండో చైర్మన్‌ తాటిపర్తి రవీంద్రనాథ్‌ రెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెంచయ్యనాయుడు, టౌన్‌బ్యాంక్, పాలసోసైటీ తదితర అన్ని కమిటీల వారు మూకుమ్మడిగా రాజీనామా చేశారని తెలిపారు. సమావేశంలో ముఖ్యమైన పార్టీ నేతలు కొండుగారి శ్రీరామమూర్తి, తాటిపర్తి ఈశ్వర్‌రెడ్డి, దందోలు భక్తవత్సలరెడ్డి, ఆలయ సభ్యులు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు