శ్రీశైలం ప్రధాన రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

2 Nov, 2016 23:06 IST|Sakshi
శ్రీశైలం ప్రధాన రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం
శ్రీశైలం: మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా బుధవారం.. శ్రీశైలం ప్రధాన రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. టోల్‌గేట్‌ నందిసర్కిల్‌  నుంచి కంభం సత్రం కాంపౌండ్‌ వరకు ప్రధాన రోడ్డుమార్గం 70 అడుగుల మేర విస్తరించనున్నారు.  ఇందులో భాగంగా శివసదనం కాంపౌండ్‌ వాల్‌ను, అక్కడ ఉన్న కొన్ని చెట్లను తొలగించారు. దేవస్థానం ఈఓ నారాయణభరత్‌ గుప్త ప్రత్యక్షంగా ఉండి కొలతలు వేయించారు. కంభం సత్రంతో రోడ్డు డెడెండ్‌ కావడంతో అక్కడ ఉన్న కొన్ని షాపులకు నష్టం వాటిల్లకుండా 60 అడుగుల మేర మాత్రమే విస్తరణ చేయాలని సూచించారు. ఇదే విధంగా శివసదనం సర్కిల్‌ నుంచి గంగా, గౌరి సదన్, నంది సర్కిల్‌ వరకు ఇప్పటికే విస్తరణ కోసం మార్కింగ్‌ వేశారు. ఈ విస్తరణలో భాగంగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, దేవస్థానానికి చెందిన 5కు పైగా కాటేజీలు తొలగించాల్సి వస్తోంది. ఇప్పటికే గ్రామీణ బ్యాంకు వారికి షాపింగ్‌ కాంప్లెక్స్‌లో స్థలాన్ని ఎంపిక చేసుకోవాల్సిందిగా ఈఓ ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే. రోడ్డు విస్తరణ జరిగితే మధ్యలో డివైడర్‌లు ఏర్పాటు చేసి కరెంట్‌ పోల్స్‌ను కూడా మార్పు చేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియకు సంబంధించి ట్రాన్స్‌కో ఎస్‌ఈని సంప్రదించి విస్తరణలో అడ్డంకిగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంట్‌పోల్స్‌ను మార్పు చేయాల్సిందిగా ఈఈ రామిరెడ్డికి ఈఓ ఆదేశాలు జారీ చేశారు. 
హరిహరరాయగోపుర మాడా వీధిలో విస్తరణ..
శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆలయ ప్రాకారానికి దక్షిణ మాడా వీధిగా ఉన్న హరిహరరాయగోపురం వద్ద 80 అడుగుల మేర రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా రోడ్డు పక్కనే ఉన్న దత్తాత్రేయ వనంలో ఉన్న రుద్రాక్ష చెట్లను సంరక్షించేందుకు వీలుగా వాటికి విలువైన ఇంజెక్షన్లను వేసి వేర్లతో సహా పెకిలించి ఆ వనంలోనే మరోవైపు నాటారు. అలాగే అమ్మవారి ఆలయం వెనుక వైపు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాడానికి సిద్ధమవుతున్నారు. 
 
మరిన్ని వార్తలు