ఆర్టీసీలో తొలి ఎన్నికల కోలాహలం

3 Jan, 2016 17:23 IST|Sakshi
ఆర్టీసీలో తొలి ఎన్నికల కోలాహలం

సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర విభజన అనంతరం ఏపీఎస్ఆర్టీసీలో తొలి ఎన్నికల కోలాహలం మొదలుకానుంది. ఇప్పటికే ఏడాది ఆలస్యమవుతున్న ఎన్నికల కసరత్తులో అటు యూనియన్లు, ఇటు యాజమాన్యం తలమునకలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 7న అన్ని యూనియన్ల ప్రతినిధులతో రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్ డి.వరప్రసాద్ సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. యాజమాన్యం, యూనియన్ ప్రతినిధుల నుంచి ఓటర్లు, ఎన్నికల ఏర్పాట్లు తదితర వివరాలను సేకరించనున్నారు. అనంతరం ఈ నెల 20న మరోమారు సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు.

ఈ నెలాఖరున లేకుంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికల ఏర్పాట్లకు ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమవుతుండగా యూనియన్లు ఇప్పటి నుంచే ఆ దిశగా వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ప్రస్తుతం గుర్తింపు సంఘంగా ఉన్న ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ)తోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్,  నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ), స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్డబ్ల్యూఎఫ్), ఐఎన్టీయూసీ(పులి గుర్తు), ఐఎన్టీయూసీ(త్రాచు గుర్తు), భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్), కార్మిక పరిషత్(టీఎన్టీయూసీ), యునెటైడ్ వర్కర్స్ యూనియన్లు ఈ సారి పోటీకి సిద్ధమవుతున్నాయి.
 
ఏడాది ఆలస్యంగా ఎన్నికలు
ఉమ్మడి రాష్ట్రంలో 2012 డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి. 2013 జనవరి నుంచి ఈయూ గుర్తింపు సంఘంగా కొనసాగుతోంది. ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అనేక కారణాలతో కాలయాపన జరిగింది. మొత్తం 57,700 మంది ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఓటు హక్కును విని యోగించుకోనున్నారు. 2015 డిసెంబర్ 31 నాటికి ఆర్టీసీలో ఉద్యోగం చేపట్టి ఆరు నెలలు నిండిన ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు కల్పించనున్నారు.
 
ఎన్నికలకు పలు అడ్డంకులు...
ఆర్టీసీలో అంతర్గత సమస్యలు ప్రభావం చూపకుంటే గుర్తింపు సంఘం ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం ఉందని పలు యూనియన్ నేతలు స్పష్టం చేస్తున్నారు. యూనియన్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ అద్దె బస్సుల టెండర్లను ఈ నెల 5న యాజమాన్యం ఆమోదించనుంది. ఒప్పందం ప్రకారం కార్మికులకు గత ఏడాది డిసెంబర్ 23న ఇవ్వాల్సిన బకాయిలును యాజమాన్యం ఇంత వరకు చెల్లించలేదు.

మరోవైపు సంక్రాంతికి ముందు జనవరి 8న పండుగ అడ్వాన్సులు ఇవ్వాల్సి ఉంది. అద్దె బస్సులు, పలు సమస్యలపై ఈ నెల 4న ఈయూ అన్ని డిపోల వద్ద ధర్నాలు నిర్వహించనుంది. ఎస్డబ్ల్యూఎఫ్, ఎన్ఎంయూలు కూడా ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి ఎన్నో సమస్యలు ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలతో ముడిపడి ఉండటం గమనార్హం.

>
మరిన్ని వార్తలు