24 నుంచి రాష్ట్రస్థాయి నాటక పోటీలు

16 Sep, 2016 22:10 IST|Sakshi
కాకినాడ కల్చరల్‌ : 
స్థానిక సూర్య కళామందిర్‌లో ఈ నెల 24 నుంచి 27 వరకూ పంతం పద్మనాభం మెమోరియల్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన 17వ రాష్ట్రస్థాయి నాటక పోటీలు నిర్వహించనున్నారు. పంతం పద్మనాభం స్మారక నాటక పరిషత్‌ వేదికపై ఈ పోటీలు జరుగుతాయి. ప్రతి రోజూ సాయంత్రం 5 గంటలకు ఈ పోటీలు ప్రారంభమవుతాయి. 24వ తేదీన శుభారంభ సభతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం కళాంజలి (హైదరాబాద్‌) ఆధ్వర్యాన కొల్లా రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జగమే మాయ’ నాటకం ప్రదర్శిస్తారు. 25వ తేదీన మహేశ్వరి ప్రసాద్‌ యంగ్‌ థియేటర్‌ ఆధ్వర్యాన ఆర్‌.వాసుదేవరావు దర్శకత్వంలో ‘అశ్శరభ శరభ’ నాటకం ప్రదర్శిస్తారు. అనంతరం ఒంగోలు భానూదయ ఆధ్వర్యాన వెంకట్‌ కందుల దర్శకత్వంలో ‘జగమంతా కుటుంబం’ నాటకం ప్రదర్శిస్తారు. 26వ తేదీన మారుతీ క్రియేషన్స్‌ (హైదరాబాద్‌) ఆధ్వర్యాన సుబ్బరాయవర్మ దర్శకత్వంలో ‘మిస్టరీ’ నాటకం ప్రదర్శిస్తారు. అనంతరం కేవీ మెమోరియల్‌ ఆర్ట్స్‌ (విశాఖపట్నం) ఆధ్వర్యాన పి.శివప్రసాద్‌ దర్శకత్వంలో ‘మీ వెంటే మేం ఉంటాం’ నాటకం ప్రదర్శిస్తారు. 27వ తేదీన అమరావతి ఆర్ట్స్‌ (గుంటూరు) ఆధ్వర్యాన కావూరి సత్యనారాయణ దర్శకత్వంలో ‘జీవితార్థం’ నాటకం ప్రదర్శిస్తారు. తరువాత శ్రీఅరవింద్‌ ఆర్ట్స్‌(తాడేపల్లి) ఆధ్వర్యాన ‘రంకె’ నాటిక ప్రదర్శిస్తారు. ఈ నాటిక 2015 నంది నాటకోత్సవంలో అవార్డు పొందినదని నిర్వాహకులు తెలిపారు.
 
 
మరిన్ని వార్తలు