-

సత్కారాలు రాజకీయాలు కాకూడదు

11 Feb, 2017 23:08 IST|Sakshi
సత్కారాలు రాజకీయాలు కాకూడదు
సినీ గేయ రచయిత అదృష్టదీపక్‌
రాష్ట్రస్థాయి నాటికల పోటీలు ప్రారంభం
రామచంద్రపురం : కళాకారులను సత్కరించటంలో రాజకీయాలకు తావులేకుండా ఉండాలని ప్రముఖ సినీగేయ రచయిత, విమర్శకులు అదృష్టదీపక్‌ సూచించారు. కృత్తివెంటి పేర్రాజు పంతులు జాతీయోన్నత పాఠశాలలోని బుద్దవరపు మహాదేవుడు కళావేదికలో మూడు రోజులు పాటు మయూర కళాపరిషత్‌ ఆధ్వర్వంలో నిర్వహించే 14వ రాష్ట్ర స్థాయి నాటికల పోటీలు శనివారం రాత్రి ప్రారంభమయ్యాయి. పరిషత్‌ అధ్యక్షుడు సత్తి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రముఖ రంగస్థల నటుడు, వై.ఎస్‌.కృష్ణేశ్వరరావును కళాపరిషత్‌ ఆధ్వర్యంలో సత్కరించడం అభినందనీయమన్నారు. నాటికల రచన, దర్శకత్వం, నటనలో కృష్ణేశ్వరరావు తనదైన శైలిలో ప్రేక్షకులను రంజిపజేస్తారని కొనియాడారు. నాటిక పోటీల ద్వారా ప్రజలకు సందేశాలను అందించటమే కళాకారుల విధి అని, అటువంటి నాటిక పోటీలను నిర్వహిచండంలో మయూర కళా పరిషత్‌ ముందున్నదన్నారు. పరిషత్‌ వ్యవస్థాపక కార్యదర్శి శృంగారం అప్పలాచార్యర్‌ పరిషత్‌ ముందుమాటను వివరించారు. అధ్యక్షుడు సత్తి వెంకటరెడ్డి నాటిక పోటీల విశిష్టతను వివరించారు. సినీ రంగస్థల నటుడు కృష్ణేశ్వరరావును ఘనంగా సత్కరించారు. అనంతరం నాటిక పోటీలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ‘చాలు... ఇక చాలు’, ‘మాకంటూ ఓ రోజు’ నాటికలను ప్రదర్శించారు. మున్సిపల్‌ చైర్మన్‌ మేడిశెట్టి సూర్యనారాయణ, ఏఎంసీ చైర్మన్‌ జి.సూర్యనారాయణ, కమిషనర్‌ సిహెచ్‌.శ్రీరామశర్మ, పట్టణ టీడీపీ అధ్యక్షుడు నందుల రాజు, మోడరన్‌ విద్యా సంస్థల అధినేత జీవీ రావు, చిలుకూరి సేవా సమితి అధ్యక్షుడు చిలుకూరి వీరవెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేత అదృష్టదీపక్‌ వ్యవహరిస్తున్నారు.
 
మరిన్ని వార్తలు