హృదయాలను హత్తుకున్న ‘సరికొత్త మనుషులు’

6 Jul, 2017 22:51 IST|Sakshi
హృదయాలను హత్తుకున్న ‘సరికొత్త మనుషులు’
అలరించిన బాలల నృత్య ప్రదర్శన
కాకినాడ కల్చరల్‌ : స్థానిక సూర్యకళామందిర్‌లో అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి నాటిక పోటీలను గురువారం శుభోదయ ఫౌండేషన్‌ చైర్మన్‌ వాసా సత్యనారాయణమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి  ప్రారంభించారు. పరిషత్‌ అధ్యక్షులు గ్రంధి బాబ్జి మాట్లాడుతూ నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పరిషత్‌ ఎంతగానో కృషి చేస్తోందన్నారు. ముందుగా ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సేవకులు బుద్దరాజు సత్యనారాయణకు సేవారత్న అవార్డును ప్రదానం చేసి సన్మానించారు. బుద్ధరాజు చేస్తున్న సేవలను పరిషత్‌ కార్యదర్శి పంపన దయానందబాబు కొనియాడారు. తదుపరి అభినయ ఆర్ట్స్‌(గుంటూరు) సారథ్యంలో శిష్టా చంద్రశేఖర్‌ రచించిన ‘సరికొత్త మనుషులు’ నాటికను ఎన్‌.రవీంద్రారెడ్డి దర్శకత్వంలో ప్రదర్శించారు. భారత దేశంలో అనాథశరణాలయాల ఆవశ్యతను చక్కగా చిత్రీకరించారు. మగవాడి పశువాంఛకు బలై గర్భం దాల్చిన కన్యలు పడుతున్న  మనోబాధలను చక్కగా చిత్రీకరించారు. చేసిన తప్పుకు ఫలితంగా జన్మించిన పిల్లలను సమాజంలో గౌరవంగా సాకలేక, అలా అని వదిలిపెట్టలేక మనస్సు చంపుకొని అనాథ శరణాలయాలకు దొంగచాటుగా అప్పగిస్తున్న యధార్థ సంఘటనలను ఈ నాటికలో చిత్రీకరించారు. అనంతరం శ్రీనటరాజ కళామందిర్‌ కూచిపూడి, ఆంధ్రనాట్య పాఠశాల నాట్యాచార్య ఆనెం ప్రసాద్‌ శిష్యులు ప్రదర్శించిన వినాయక శబ్ధం, శివ పంచాక్షరి నృత్యాలు అకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరావు, శిరీష, బాజిబోయిన వెంకటేష్‌ నాయుడు, తురగా సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. 
ఉత్తమ ప్రదర్శనగా ‘చాలు ఇక చాలు’
స్ధానిక సూర్యకళామందిర్‌లో అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్‌  ఆధ్వర్యంలో రెండు రోజల నుంచి నిర్వహిస్తున్న నాటిక పోటీలు గురువారంతో ముగిసాయి. ఉత్తమ ప్రదర్శనగా చాలు ఇక చాలు నాటికను ఎంపిక చేసారు. ద్వితీయ ప్రదర్శనగా గోవు మాలచ్చిమి, తృతీయ ప్రదర్శనగా తేనేటీగలూ పగబడతాయి నాటికలు ఎంపిక చేసారు.అలాగే  ఉత్తమ దర్శకులుగా చాలు ఇక చాలు నాటికకు దర్శకత్వ చేసిన గోపారాజు విజయ్, ఉత్తమ నటుడుగా చాలు ఇక చాలు కథానాయకుడు రమణ ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ నటిగా గోవు మాలచ్చిమి నాటికలో వెంకట లక్ష్మి పాత్రదారిణి అమృతవర్షిణి, ద్వితీయ  ఉత్తమ నటిగా సరికొత్త మనుషులు లో నటించిన టి.లక్ష్మి ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ రచనకు గాను గోవుమాచ్చిమి నాటిక రచించిన చెరుకూరి సాంబశివరావు ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ విలన్‌ గా తేనేటీగలూ పగబడతాయి నాటికలో దొర పాత్రదారి అమరేంద్ర ఎంపికయ్యారు. ఉత్తమ సహాయ నటులుగా తేటేటీగలూ పగబడతాయి నాటికలో పాముల ఆదియ్య పాత్ర దారి బి.మోహాన్‌ ఎంపికయ్యారు. వీరికి అల్లూరి సీతారామరాజు నాటక కళాపరిషత్‌ అవార్డులను ప్రధానం చేసి ఘనంగా సత్కరించింది. ఈకార్యక్రమంలో పరిషత్‌ అధ్యక్షులు గ్రంధి బాబ్జి, కార్యదర్శి పంపన దయానందబాబు, సభ్యులు తదితరలు పాల్గొన్నారు.
 

 

మరిన్ని వార్తలు