క్షీర సమరం

10 Apr, 2017 12:34 IST|Sakshi
క్షీర సమరం
మండపేటలో రాష్ట్రస్థాయి పాలపోటీలు 
డిసెంబరు 15వ తేదీ నుంచి 17 వరకు నిర్వహణ 
పలు విభాగాల్లో పశువుల అందాల పోటీలు 
 
క్షీర సమరానికి మరోమారు ఆంధ్రా హర్యానా వేదికవుతోంది. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మూడు రోజులు పాటు మండపేటలో జరిగే పోటీల కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఐదు విభాగాల్లో పాల పోటీలు, మూడు విభాగాల్లో పశు ప్రదర్శన పోటీలు జరుగనున్నాయి. జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పాడిరైతులు తమ పాడిపశువులను పోటీలకు తీసుకువస్తారని అధికారులు భావిస్తున్నారు.
- మండపేట
మేలుజాతి పశు పోషణ ద్వారా ఇప్పటికే మండపేట ప్రాంతం (మండపేట, ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాలు) ఆంధ్రా హర్యానాగా పేరుగాంచింది. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరిగిన పలు పాలపోటీల్లో ఇక్కడి రైతులు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. మేలుజాతి పశుపోషణపై వీరికున్న మక్కువ, అవగాహన ఈ ప్రాంతానికి ఆ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. 2007 నుంచి ఇప్పటి వరకు మండపేటలో ఐదు పర్యాయాలు రాష్ట్ర స్థాయి పాల పోటీలు నిర్వహించగా ప్రస్తుతం ఆరో సారి పోటీలు జరుగుతున్నాయి. ఇందుకు మండపేటలోని మారేడుబాక రోడ్డులో గల సూర్యచంద్ర పేపర్‌మిల్స్‌ సమీపం స్థలం వేదిక కానుంది. 
పాల పోటీల నిర్వహణ ఇలా..
ముర్రా, జాఫర్‌బాది జాతి గేదెలు, ఒంగోలు, గిర్, పుంగనూరు ఆవుల విభాగాల్లో పాలపోటీలు నిర్వహిస్తున్నారు. రోజుకు 15 లీటర్లకు పైబడి పాలిచ్చే ముర్రా, జాఫర్‌బాది జాతి గేదెలు, 8 లీటర్లకు పైబడి పాలిచ్చే ఒంగోలు, గిర్, ఐదు లీటర్లకు పైబడి పాలిచ్చే పుంగనూరు ఆవులు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. తొలిరోజు సాయంత్రం తీసిన పాలను నమూనాగా పరిగణిస్తారు. రెండో రోజు ఉదయం, సాయంత్రం, మూడో రోజు ఉదయం పాలు తీసి ఏప్పటికప్పుడు ఎలక్ట్రానిక్‌ కాటాపై తూకం వేస్తారు. 20 నిముషాల వ్యవధిలోనే పాలు తీయాల్సి ఉంటుంది. తొలి రోజు నమూనా పాలదిగుబడికి తదుపరి పాలదిగుబడికి రెండు కేజీలకు పైబడి వ్యత్యాసం ఉంటే ఆ పశువును పోటీ నుంచి తొలగించనున్నట్టు పశువైద్యాధికారులు తెలిపారు.
ప్రోత్సాహక బహుమతులు 
పాలపోటీలకు సంబంధించి ఒంగోలు ఆవులు, ముర్రా, జాఫర్‌ జాతుల గేదెల విభాగాల్లో ప్రధమ బహుమతి రూ.50 వేలు చొప్పున కాగా, ద్వితీయ రూ. 40 వేలు తృతీయ బహుమతిగా రూ.30 వేలు చొప్పున అందించనున్నారు. గిర్, పుంగనూరు జాతుల ఆవుల విభాగాల్లో ప్రధమ రూ. 40 వేలు చొప్పున, ద్వితీయ రూ. 30 వేలు చొప్పున, తృతీయ రూ. 20 వేల చొప్పున పాడిరైతులకు బహుమతులుగా అందజేయనున్నారు. 
పశు ప్రదర్శన 
ఒంగోలు, పుంగనూరు, గిర్‌ జాతుల ఆడ, మగ విభాగాల్లో ముర్రా జాతికి చెందిన ఆడ, మగ విభాగాల్లో పశుప్రదర్శన పోటీలు జరుగుతాయి. పాలపళ్లు, రెండు నుంచి నాలుగు పళ్లు వరకు, ఆరు పళ్లు, ఆపైన విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు. మూడు విభాగాల్లో మొదటి బహుమతిగా రూ. 10 వేలు చొప్పున, ద్వితీయ రూ. 7,500లు చొప్పున, తృతీయ రూ. 5 వేలు చొప్పున పాడిరైతులకు నగదు బహుమతులు అందజేస్తారు. 
మరిన్ని వార్తలు