డీఈవో కార్యాలయంలో స్టేషనరీ మాయం

5 Jul, 2017 04:19 IST|Sakshi
డీఈవో కార్యాలయంలో స్టేషనరీ మాయం

జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి చెందిన ముగ్గురు ఉద్యోగులు గుట్టు చప్పుడు కాకుండా స్టేషనరీని అమ్ముకోగా, మరో అటెండర్‌ ఏకంగా ఎస్సెస్సీ ఆన్సర్‌ షీట్‌లనే చిత్తుకాగితాల కింద అమ్మేశాడు. పంపకాల విషయంలో తేడాలు రావడంతో ముగ్గురి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో దాచిన ఆన్సర్‌ షీట్‌లను అమ్ముకున్న ఉద్యోగిని సంబంధిత ఉపాధ్యాయుడు ఫొటోలు తీసి పట్టించారు.
♦  రద్దీకి అమ్ముకున్న సిబ్బంది
♦  అందులో మూడు సర్వీసు రికార్డులు
♦  ఎస్సెస్సీ ఆన్సర్‌ షీట్‌లనే అమ్మేసిన మరో అటెండర్‌
♦  మొత్తం విలువ రూ.3 లక్షలు  
♦  నెల తర్వాత వెలుగులోకి
మెమోలు జారీ

నిజామాబాద్‌ అర్బన్‌ :  జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పాత పేపర్లు, ఇతర విభాగాలకు చెందిన స్టేషనరీ మూడు సంవత్సరాలుగా పేరుకుపోయింది. దీనిని జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో టెండర్‌ నిర్వహించి విక్రయించవల్సి ఉంది. అయితే రాత్రివేళ విధులు నిర్వర్తించే ఇద్దరు అటెండర్లు, మరో అటెండర్‌ కలిసి ఎవరికీ తెలియకుండా రాత్రివేళ అమ్ముకున్నట్లు తెలిసింది. రూ. లక్ష 50 వేల విలువ చేసే స్టేషనరీని సంచుల్లో నింపి విక్రయించారు.


వచ్చిన డబ్బులను పంచుకున్నారు. ఈ పంపకాల్లో తేడాలు రావడంతో విక్రయించిన నెలరోజులకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్టేషనరీ విక్రయించారని డీఈవో దృష్టికి వెళ్లడంతో ఆయన ముగ్గురికి చార్జి మెమోలు జారీ చేశారు. ఈ స్టేషనరీలో రిటైర్డు ఉద్యోగులకు సంబంధించి ముగ్గురి సర్వీస్‌ రికార్డులు ఉన్నాయి.  రిటైర్డు అయిన ఓ ప్రధానోపాధ్యాయుడు బిల్లుల కోసం సర్వీస్‌ రికార్డును గతంలోనే డీఈవో కార్యాలయం లో అందజేశారు. ప్రస్తుతం సర్వీస్‌ రికార్డు కావాలని ఇటీవల డీఈవో కార్యాలయానికి వచ్చారు.

సర్వీస్‌ రికార్డు స్టేషనరీకి సంబంధించిన స్థలంలో ఉందని సంబంధిత క్లర్క్‌ అక్కడవెళ్లి పరిశీలించగా స్టేషనరీ కనిపించలేదు. దీనిపై ఆరా తీయగా స్టేషనరీని గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసిన విషయం తేలింది. ఆ స్టేషనరీలో మూడు సర్వీస్‌ రికార్డులు ఉన్నాయని కార్యాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత ప్రధానోపాధ్యాయుడికి ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. దొంగచాటున స్టేషనరీని విక్రయించిన ఇద్దరు ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసినట్లు తెలిసింది.

ఎస్సెస్సీ ఆన్సర్‌ షీట్‌లు సైతం..
నగరంలోని ఎస్‌ఎఫ్‌ఎస్‌ పాఠశాలలో పదో తరగతి జవాబు పత్రాలను భద్రపరిచారు. వీటిని ఇటీవల వాల్యుయేషన్‌ నిర్వహించి అక్కడ ఒక గదిలో ఉంచారు. డీఈవో కార్యాలయానికి చెందిన అటెండర్‌  జవాబుపత్రాలను చిత్తుకాగితాల కింద విక్రయించాడు. సుమారు రూ. లక్ష 50 వేలు స్టేషనరీ విక్రయించడం ద్వారా అటెండర్‌ లబ్ధిపొందినట్లు తెలిసింది. కాగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్టేషనరీని అటెండర్‌ విక్రయించేటప్పుడు ఫొటోలు తీసి జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో డీఈవో ఉద్యోగికి మెమో జారీ చేసి మరో ప్రాంతానికి బదిలీ చేశారు. స్టేషనరీ విక్రయించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవల్సింది పోయి మెమోజారీ జారీ చేయడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఘటన జరిగి నెలలు గడిచినా అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యహవరిస్తున్నారని అంటున్నారు.

>
మరిన్ని వార్తలు