ఉక్కు పరిశ్రమ సాధనే లక్ష్యంగా ఉద్యమం

3 Apr, 2017 17:27 IST|Sakshi
ఉక్కు పరిశ్రమ సాధనే లక్ష్యంగా ఉద్యమం

రాజంపేట టౌన్: కడపలో ఉక్కుఫ్యాక్టరీ స్థాపనే లక్ష్యంగా ఉద్యమం సాగిస్తామని రాయలసీమ విద్యార్థి యువజన సంఘం (ఆర్‌ఎస్‌వైఎఫ్‌) జిల్లా కార్యదర్శి ఓబులేసుయాదవ్‌ తెలిపారు. ఆర్‌ఎస్‌వైఎఫ్‌ చేపట్టిన జీపుయాత్ర సోమవారం రాజంపేటకు చేరింది. ఈసందర్భంగా స్థానిక వైఎస్సార్‌ సర్కిల్‌ (పాతబస్టాండు)లో జరిగిన సభలో ఓబులేసుయాదవ్‌ మాట్లాడారు. రాయలసీమను అభివృద్ది చేయాలన్న సంకల్పంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి 2007వ సంవత్సరంలో జమ్మలమడుగు ప్రాంతంలో ఉక్కుపరిశ్రమకు శంఖుస్థాపన చేశారన్నారు.

రాజశేఖర్‌రెడ్డి మృతి చెందిన తరువాత ఉక్కుపరిశ్రమను పట్టించుకునే నాధుడే కరవయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటైతే దాదాపు ఇరవైల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని పార్లమెంటు సాక్షిగా ప్రధాని హామీ ఇచ్చి మూడు సంవత్సరాలైనా పరిశ్రమ ఏర్పాటులో ఎలాంటి ప్రగతి లేదన్నారు. అంతేకాక ఉక్కు పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం యత్నిస్తుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్‌లో రాయలసీమ పరిస్థితి చాలా ఆధ్వానంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజధానిలో విద్య, ఉద్యోగ అవకాశాల కేటాయింపుల్లో ప్రభుత్వం ఒక ప్రాంతానికే ప్రాధాన్యత ఇస్తుందని ఆయన ఆరోపించారు. ఇందువల్ల రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో ఆర్‌ఎస్‌వైఎఫ్‌ నాయకులు డీ.నరసింహ, లక్ష్మీనారాయణ, మహేష్, రవి, వివేక్, ప్రసన్న, రాజు, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు