నారాయణ.. నారాయణ

7 Feb, 2017 02:17 IST|Sakshi
నారాయణ.. నారాయణ

 కార్పొరేటుకే కొమ్ము కాసిన మంత్రి
కబ్జా చేసిన స్థలానికి అండ
సిఫార్సు చేస్తే.. స్టీల్‌ప్లాంట్‌ రిజర్వాయర్‌  డిజైన్‌ మార్చేశారు..


రాజు తలుచుకుంటే ఏదైనా సాధ్యమని మరోసారి రాష్ట్ర మంత్రి పి.నారాయణ రుజువు చేశారు. లీజు పేరుతో కబ్జా చేసిన స్థలాన్ని కూడా వెనక్కితీసుకోకుండా అడ్డుపుల్ల వేయగలిగారు. కబ్జా చేసిన స్థలానికి కాపలాగా నిలబడ్డారు. ఓ కార్పొరేటు విద్యాసంస్థకు మేలు చేకూర్చారు. స్టీల్‌ప్లాంట్‌ భవిష్యత్‌ అవసరాలకై నిర్మిస్తున్న కణితి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌–2 (కేబీఆర్‌–2) డిజైన్‌నే కాదు.. ఏకంగా దిశనే మార్చేశారు.

విశాఖపట్నం : స్టీల్‌ప్లాంట్‌కు ప్రస్తుతం 0.5 టీఎంసీల సామర్థ్యంతో కణితి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ఉంది. ఈ రిజర్వాయర్‌ 5 మీటర్ల లోతున 300 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మించారు. ప్లాంట్‌ను విస్తరించిన నేపథ్యంలో ఈ రిజర్వాయర్‌ సామర్థ్యం సరిపోవడం లేదు. 2009లో మహానేత వైఎస్‌ హయాంలోనే ప్లాంట్‌ రిజర్వాయర్‌ను విస్తరించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉన్న రిజర్వాయర్‌ను కనీసం ఒక టీఎంసీ సామరŠాథ్యనికి పెంచాలని నిర్ణయించారు. ఇందుకోసం 275 హెక్టార్లలో నిర్మించాలని ప్రతిపాదించారు. అప్పట్లో రూ.250 కోట్లతో అంచనాలు వేశారు. ఆ తర్వాత ఈ ప్రతిపాదన చాన్నాళ్లు కార్యరూపం దాల్చలేదు.

చివరకు అంచనాలు పెరుగుతూ చివరకు రూ.450 కోట్ల రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ను 2014లో రూపొందించారు. 2015లో తలెత్తిన నీటి సంక్షోభంతో ఈ ప్రతిపాదనకు కదలిక వచ్చింది. 2016లో టెండర్లు పిలిచింది. సివిల్‌ పనులకు రూ.350 కోట్లు, మెకానికల్‌ పనులకు రూ.80 కోట్లతో కోడ్‌ చేసిన ఎల్‌అండ్‌ టీ సంస్థ ఈ టెండర్‌ను కైవసం చేసుకుంది. తొలుత రిజర్వాయర్‌ నిర్మాణం కోసం లక్షలు ఖర్చు చేసి డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌)ను కూడా రూపొందించారు. ఈ డీపీఆర్‌ ప్రకారం 275 హెక్టార్లలో రిజర్వాయర్‌  నిర్మించాలని ప్రతిపాదించారు.  
 
సంక్షోభం నాడు పట్టించుకోకుండా..
చరిత్రలో ముందెన్నడు లేని రీతిలో స్టీల్‌ప్లాంట్‌ గతేడాది తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంది. 2015 డిసెంబర్‌లోనే ఏలేరులో నీటినిల్వలు అడుగంటిపోవడంతో కణితి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో చుక్కనీరులేక ప్లాంట్‌లో సమస్య ఏర్పడింది. ఆ సమయంలో ప్లాంట్‌కు చెందిన స్థలాన్ని క్రీడా మైదానం కోసం ఇవ్వలేదనే సాకుతో సర్కార్‌ ప్లాంట్‌ వైపు కన్నెత్తి చూడలేదు. మంత్రి నారాయణ సమక్షంలోనే సీఎం చంద్రబాబు ఏకంగా ప్లాంట్‌ యాజమాన్యంపై నిప్పులు చెరిగారు. ఆనాడు ప్లాంట్‌కు అనుకూలంగా ఒక్క మాట మాట్లాడని మంత్రి నేడు ఓ కార్పొరేటు విద్యాసంస్థకు చెందిన స్థలం రిజర్వాయర్‌ విస్తరణలో పోతుంటే ముందుండి అడ్డుకున్నారు.
 
క్రీడాస్థలం పేరిట కలిపేసుకున్నారు..
గతంలో ఇదే ప్రాంతంలో ప్లాంట్‌కు చెందిన స్థలంలో ఆల్ఫా విద్యాసంస్థలకు 20 సెంట్లు కేటాయించారు. దానిని కొన్నాళ్లు నిర్వహించిన ఆ యాజమాన్యం వేరొకరికి అప్పగించింది. అక్కడకు నెమ్మదిగా ప్రవేశించిన కార్పొరేటు విద్యాసంస్థ పాగా వేయడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసింది. దీంతో ఉక్కు యాజమాన్యం  ఆ విద్యాసంస్థకు 1.5 ఎకరాల భూమిని కేటాయించారు. తొలుత 33 ఏళ్లకు లీజుకివ్వగా..ఆ తర్వాత ఆ గడువును రాజకీయ పలుకుబడి ద్వారా 99 ఏళ్లకు పొడిగించుకున్నారు. చుట్టూ వేలాది ఎకరాలు ఖాళీగా ఉండడంతో ఎలాంటి పక్కా నిర్మాణాలు చేయబోమని స్పష్టమైన హామీనిచ్చి కొంత భూభాగాన్ని తమ లీజు స్థలంలో కలిపేసుకున్నారు. ఇది సుమారు 3 ఎకరాలకు పైగా ఉంటుందని అంచనా. తాజాగా రిజర్వాయర్‌ కోసం ప్రతిపాదించిన ప్రాంతంలో కార్పొరేటు విద్యాసంస్థ తమ లీజు స్థలంతో కలిపేసుకున్న క్రీడాస్థలం కూడా ఉంది. ఈ స్థలాన్ని రిజర్వాయర్‌లో కలపాల్సి ఉంది. అయితే కళాశాలకు కేటాయించిన స్థలాన్ని ఖాళీ చేయాలని స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం ఆ విద్యాసంస్థకు నోటీసులు కూడా జారీ చేసింది
 
రిజర్వాయర్‌ పక్కన కళాశాల క్షేమమా?
మంత్రి నారాయణ పలుకుబడితో రిజర్వాయర్‌ డిజైన్‌ మార్చినప్పటికి అక్కడ కళాశాల నిర్వహణ ఎంత వరకు భద్రత అనే అంశంపై చర్చ సాగుతుంది సుమారు 20 మీటర్లు లోతు, 0.5 టీఎంసీ సామర్ధ్యం కలిగిన రిజర్వాయర్‌ పక్కన ఉన్న భవనం ఎంత సురక్షితం అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి, అందులో కళాశాల నిర్వహిస్తే జరగబోయే పరిణామాలకు స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఫలించిన నారాయణ మంత్రాంగం

ఏదో విధంగా ఈ స్థలం చేజారకుండా ఉండేందుకు మంత్రి నారాయణ దృష్టికి తీసుకొచ్చారు. ఆ కార్పొరేటు విద్యాసంస్థకు మేలు చేకూర్చాలన్న తలంపుతో మంత్రి వెంటనే రంగంలోకి దిగారు. కష్టాల్లో ఉన్నాం ఆదుకోండి అంటూ గతేడాది ప్లాంట్‌ యాజమాన్యం పలుమార్లు మొత్తుకున్నా పట్టించుకోని ఆయన అదే ప్లాంట్‌ ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయినా వింటారో లేదోననే అనుమానంతో ప్రభుత్వంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి జాతీయ స్థాయిలో కూడా ఒత్తిడి తెచ్చారు. చేసేది లేక యాజమాన్యం కూడా తలూపింది. ఆగమేఘాల మీద డిజైన్‌ను మార్చేసింది. దీంతో రిజర్వాయర్‌ దిశను మార్చాల్సి వచ్చింది. విద్యాసంస్థ అధీనంలో ఉన్న స్థలం జోలికి పోకుండా నారాయణ మంత్రాంగం ఫలించింది.
 

మరిన్ని వార్తలు