అష్టకష్టాలు

12 Jul, 2016 04:21 IST|Sakshi

జమ్మూ చేరుకున్న అమర్‌నాథ్ యూత్రికులు
యాత్రికుల బస్సులపై ఉగ్రమూకల దాడి
రెండు బస్సుల అద్దాలు ధ్వంసం అరచేతిలో ప్రయూణికుల ప్రాణాలు
గుక్కెడు మంచినీరిచ్చే దిక్కులేదు.. చేతిలో చిల్లిగవ్వ లేక పస్తులు
పరామర్శలకే పరిమితమైన అధికారులు
సైనికుడి సహకారంతో ఢిల్లీకి వచ్చే ప్రయత్నం

 తినడానికి తిండిలేదు.. తాగేందుకు గుక్కెడు నీరిచ్చే దిక్కులేదు.. అవసరానికి చేతిలో చిల్లి గవ్వలేదు.. ఆదుకుంటామన్న అధికారులు అడ్రస్ లేరు. ప్రకాశం జిల్లాకు చెందిన అమర్‌నాథ్ యూత్రికులు అర్ధరాత్రి ప్రయూణాల్లో ఉగ్రమూకలను దాటుకుని ఇళ్లకు చేరేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఆదివారం అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో మూడు బస్సుల్లో జమ్మూకు బయల్దేరిన యూత్రికులు ఎట్టకేలకు సోమవారం సాయంత్రం 6.45 గంటలకు జమ్మూ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. జిల్లాకు చెందిన సైనికుడు సురేష్‌బాబు ఆర్థిక సాయంతో రాత్రి 9 గంటల ప్రాంతంలో జమ్మూ నుంచి ఢిల్లీకి ప్రయాణమయ్యారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాకు చెందిన ఒంగోలు, అమ్మనబ్రోలు, చీరాల, కందుకూరు, సింగరాయకొండ ప్రాంతాలకు చెందిన 118 మంది యాత్రికులున్నారు. 6వ తేదీ సాయంత్రం నుంచి అమర్‌నాథ్ 14 కి.మీ. దూరంలోని బల్తాల్‌లో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు వీరిని ఆదివారం రాత్రి 1 గంటల ప్రాంతంలో సైన్యం వారు వచ్చిన మూడు బస్సుల్లో 118 మంది అమర్‌నాథ్ యాత్రికులను జమ్మూకు వెళ్లేందుకు అనుమతినిచ్చారు. మూడు బస్సుల్లో యాత్రికులు వస్తుండగా తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో దారికి అడ్డంగా వచ్చిన ఉగ్రమూకలు అత్యధిక వెలుగునిచ్చే టార్చ్‌లైట్లు వేసి రోడ్డుకు అడ్డంగా వచ్చిన బస్సును నిలిపివేశారు. అనంతరం బస్సులపై రాళ్లతో దాడి చేశారు. రెండు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సును వేగంగా నడుపుకుంటూ వెళ్లడంతో పెనుప్రమాదమే తప్పింది.ఆ తర్వాత సోమవారం సాయంత్రం 6.45గంటల ప్రాంతంలో మూడు బస్సులు జమ్మూ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాయి.

 డబ్బు కోసం బస్సు ఓనర్ల పేచీ..
కర్ఫ్యూ నేపథ్యంలో యాత్రికులు తీసుకె ళ్లిన బస్సులు నాలుగు రోజుల పాటు అదనంగా ఉండాల్సి రావడంతో  అదనపు మొత్తాన్ని చెల్లించాలని బస్సుల యజమానులు యాత్రికులపై ఒత్తిడి తెచ్చారు. లేకుంటే స్వస్థలాలకు వెళ్లనివ్వబోమంటూ జమ్మూ రైల్వేస్టేషన్ వద్ద పేచి పెట్టారు. దీంతో యాత్రికులు, బస్సుల ఓనర్ల మధ్య గొడవైంది. బస్సులు మాట్లాడిన కాంట్రాక్టర్ ఏం మాట్లాడకుండా చేతులెత్తేశారు. దీంతో యాత్రికులు అటు ఏపీ భవన్ అధికారులకు తెలిపిన వారు స్పందించలేదు.

 సైనికుడి సాయంతో స్వస్థలాలకు..
ఒంగోలుకు చెందిన సైనికుడు సురేష్ జమ్మూలో పని చేస్తున్నాడు. జిల్లాకు చెందిన యాత్రికులకు సురేష్ అండగా నిలిచారు. నాలుగు రోజుల పాటు పలువురు యాత్రికులకు బిస్కెట్లు, మంచినీరు సరఫరా చేసిన సురేష్ ఆర్థిక సాయం సైతం చేసి జిల్లా వారు స్వస్థలాలకు తరలివెళ్లేందుకు తన వంతు సహకారం అందించారు. జమ్మూ రైల్వేస్టేషన్ నుంచి ఢిల్లీకి వచ్చేందుకు 118 మంది యాత్రికులకు రైల్వే టికెట్లకు అవసరమైన మొత్తాన్ని సురేష్ సమకూర్చినట్లు హైదరాబాద్‌కు చెందిన యాత్రికుడు పూర్ణచంద్రరావు సాక్షికి వివరించారు. యాత్రికుడు పొదిలి శ్రీనివాసరావుకు పరిచయం ఉన్న సైనికుడు సురేష్ యాత్రికులకు సహాయ సహకారాలు అందించడంతోనే స్వస్థలాలకు చేరుకునే అవకాశం వచ్చిందని పలువురు యాత్రికులు ‘సాక్షి’కి చెప్పారు.

 స్పందించని అధికారులు..
అమర్‌నాథ్‌లో చిక్కుకున్న జిల్లాకు చెందిన యాత్రికులను స్వస్థలాలకు సురక్షితంగా చేర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అధికారులతో పాటు అటు ఏపీ భవన్ అధికారి శ్రీకాంత్ సైతం చెప్పారు. అయితే ఒకటి, రెండు సార్లు ‘ఆర్ యు సేఫ్’ అంటూ యాత్రికులను ప్రశ్నించడం మినహా ఏపీ భవన్ అధికారి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వారు ఇబ్బం దులు పడుతున్నా స్పందించిన పాపానపోలేదు. ఒంగోలు ఆర్‌డీవో సైతం ‘అంతా క్షేమంగా ఉన్నారా... అంటూ’ యాత్రికులను పలకరించటం మినహా వారిని జిల్లాకు సురక్షితంగా చేర్చే విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ‘మీతో కలెక్టర్ మాట్లాడతారు’ అని ఆర్‌డీవో యాత్రికులకు చెప్పిన ఆ తర్వాత కలెక్టర్ తమతో మాట్లాడలేదని పలువురు సాక్షికి తెలిపారు. తమ వద్ద పైసా డబ్బులు లేవని, కనీసం స్వస్థలాలకు ఎలా చేరుకుంటారన్న విషయం కూడా అధికారులు ఆరా తీయలేదని బాధితులు వాపోయారు.

మరిన్ని వార్తలు