కర్ర కొనుగోలు ఒప్పందానికి తూట్లు

26 Aug, 2016 23:33 IST|Sakshi
karra
–  రైతులను నిలువునా మోసం చేస్తున్నారు
–  నిరసనగా నేడు చలో కలెక్టరేట్‌ 
– రైతు సంఘాల నాయకులు వెల్లడి
ఒంగోలు టౌన్‌ : ‘సుబాబుల్, జామాయిల్‌ కర్ర కొనుగోలు ఒప్పందానికి పేపర్‌ మిల్లులు తూట్లు పొడుస్తున్నాయి. ఒప్పందం ప్రకారం కర్ర కొనమంటే కొనుగోళ్లనే ఆపివేశారు. రైతులను ఆదుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా ఫలితం కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా అన్ని రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ చలో కలెక్టరేట్‌ నిర్వహిస్తున్నాం’ అని రైతు సంఘాల నేతలు వెల్లడించారు. స్థానిక మల్లయ్య లింగం భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండూరు రంగారావు, ఏపీ సుబాబుల్, జామాయిల్‌ రైతు సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కే వీరారెడ్డి, టీవీ శేషయ్య, వైఎస్‌ఆర్‌ సీపీ రైతు విభాగం జిల్లా కార్యదర్శి ఏ వెంకటరామిరెడ్డి, రైతు సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మండవ శ్రీనివాసరావు, దుగ్గినేని గోపీనాథ్, ఆచార్య రంగా కిసాన్‌ సంస్థ ప్రధాన కార్యదర్శి చుంచు శేషయ్య,  కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు టి.రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి 19వ తేదీ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో పేపర్‌ మిల్లుల ప్రతినిధులు, రైతు నాయకులు, ప్రజాప్రతినిధులు, మార్కెటింగ్‌శాఖ అధికారులు కలిసి సుబాబుల్, జామాయిల్‌ కర్రకు కొనుగోలు ధర నిర్ణయించినట్లు చెప్పారు. సుబాబుల్‌ టన్ను రూ.4,400, జామాయిల్‌ టన్ను రూ.4,600కు కొనుగోలు చేయాలని నిర్ణయించారన్నారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఎంపిక చేసిన వే బ్రిడ్జిల వద్ద రైతుల నుంచి పేపర్‌ మిల్లులు కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ, ఎక్కడా చేయడంలేదని విమర్శించారు. పేపర్‌ కంపెనీలు రైతుల వద్ద ఒప్పందం ప్రకారం కొనుగోలు చేయకుండా మధ్యవర్తులను పెట్టుకుని సుబాబుల్‌ టన్ను రూ.3,700, జామాయిల్‌ టన్ను రూ.2,500కు కొనుగోలు చేస్తున్నాయని పేర్కొన్నారు. 
ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు నష్టం...
ఒప్పంద ధరలు అమలుచేయని కారణంగా రైతులు ఎకరా సుబాబుల్‌కు రూ.30 వేలు, జామాయిల్‌కు రూ.50 వేలు నష్టపోతున్నారని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పేపర్‌ మిల్లులు అంతటితో ఆగకుండా కొంతమంది మంత్రులపై ఒత్తిడి తీసుకువచ్చి మార్కెట్‌ కమిటీలు ఎంపిక చేసిన వే బ్రిడ్జిల వద్ద కర్ర కొనుగోలు చేసేలా చక్రం తిప్పాయన్నారు. పేపర్‌ కంపెనీల మధ్య పోటీ లేకుండాచేసి తక్కువ ధరకు రైతుల నుంచి కర్ర కొనుగోలు చేపిస్తున్నాయన్నారు. రాష్ట్రం మొత్తం ఒకే ధర ఉండే విధంగా ఇప్పటి వరకు ఉన్న ఒప్పందానికి తూట్లు పొడుస్తూ జీఓ నంబర్‌ 143ను విడుదల చేసిందన్నారు. ఈ జీఓ అమలైతే రైతులు మరింత నష్టపోయే ప్రమాదముందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. సుబాబుల్, జామాయిల్‌ కర్ర  కొనుగోలు ఒప్పందాన్ని వెంటనే అమలుచేసి కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఆ మేరకు జరగనున్న చలో కలెక్టరేట్‌ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో ఆదర్శ రైతు సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు