ఆల్మట్టికి కొనసాగుతున్న వరద

17 Jul, 2016 22:49 IST|Sakshi
ఆల్మట్టి ప్రాజెక్టు క్రస్టుగేట్లు మూసివేయడంతో పవర్‌హౌస్‌ ద్వారా వస్తున్న నీరు
– ఎగువప్రాంతం నుంచి తగ్గిన ఇన్‌ఫ్లో
– 23 క్రస్ట్‌గేట్లు మూసివేత
– రేపు సాయంత్రానికి జూరాలకు కృష్ణమ్మ? 
జూరాల: కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు వరదకొనసాగుతోంది. ఆదివారం 1,88,632 క్యూసెక్కుల వరదనీరు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 112.52 టీఎంసీలకు చేరింది. ఎగువనుంచి ఇన్‌ఫ్లో తగ్గడంతో శనివారం తెరిచిన 23 క్రస్టుగేట్లను ఆదివారం ఉదయం 9.30గంటలకు పూర్తిగా మూసివేశారు. ప్రాజెక్టు జలవిద్యుదుత్పత్తి ద్వారా 45వేల క్యూసెక్కులను దిగువప్రాంతానికి వదులుతున్నారు. నారాయణపూర్‌ రిజర్వాయర్‌కు 1,11,784 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64టీఎంసీలు కాగా ప్రస్తుతం 24.34 టీఎంసీలకు చేరింది. ఆదివారం రాత్రిలోగా నారాయణపూర్‌ ప్రాజెక్టు రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటినిల్వకు చేరే అవకాశముంది. సోమవారం ఉదయం ప్రాజెక్టు ప్రధాన కాలువలు, విద్యుదుత్పత్తి, క్రస్టుగేట్ల ద్వారా నీటిని విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. నారాయణపూర్‌ నుంచి విడుదలయ్యే కృష్ణానది వరద 100 కిలోమీటర్ల దిగువన ఉన్న మన రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్‌కు మంగళవారం సాయంత్రంలోగా చేరే అవకాశం ఉందని తెలిపారు.జూరాలలో ప్రస్తుతం 3.58 టీఎంసీల నీళ్లు నిలిపారు. తుంగభద్ర ప్రాజెక్టులో ప్రస్తుతం 37.47 టీఎంసీలు నిల్వ చేశారు. 
మరిన్ని వార్తలు