రాళ్ల మేకల బేరం

24 Jul, 2016 23:47 IST|Sakshi
రాళ్ల మేకలను పెంచుతున్న షెడ్‌
  • ప్రత్యేక ఇంజెక్షన్లు, ఆహారంతో మేకల కడుపులో రాళ్ల సృష్టి
  • ‘పేట’ అటవీప్రాంతంలో సాగుతున్న దందా


  • మేకను మటన్‌ కోసం కోస్తారని అందరికీ తెలుసు. కానీ..కొందరు వాటి కడుపులో ప్రత్యేకంగా రాళ్లను సృష్టించి..వాటిని అమ్ముకోవడం ద్వారా లక్షల దందా సాగిస్తున్నారు. 300గ్రాములుండే రాయికి..వేలల్లో ధర ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. అశ్వారావుపేట, ములకలపల్లి, దమ్మపేట అటవీప్రాంతంలో కొందరు గుడారాలు ఏర్పాటు చేసుకొని మేకల పెంపకం చేపడుతున్నారు. అక్రమంగా జరిగే ఈ దందాపై దాడులు కరువయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    అశ్వారావుపేట: మేకలను అడవిలోనే మేపి, అక్కడే పెంచి ప్రత్యేక పద్ధతుల్లో వాటి కడుపులో చిన్నపాటి రాళ్లను తయారు చేసి, వాటిని విక్రయించడాన్ని కొందరు ఓ వ్యాపారంగా మలుచుకున్నారు. అడవిలో లభించే చిల్ల గింజలను మేలకు ఆహారంగా వేస్తుంటారు. అయితే..వీటిని కొరకనీయకుండా గొట్టాల ద్వారా నేరుగా కడుపులోకి పంపుతారు. కొన్నింటిని చర్మం గుండా బక్కీ(లోపలి తోలు)కు అతికిస్తారు. ఆ తర్వాత కాల్షియం లక్షణాలుండే విలువైన అడవిమొక్కలను ఆహారంగా అందిస్తారు. లేత చిగుళ్లు, మెత్తని కాండం ఉండే పసిరి మొక్కలయితే రాళ్లు నాణ్యంగా తయారవుతాయని వీరి నమ్మకం. రాళ్లు వేగంగా పెరగడం కోసం కాల్షియం ఇంజెక్షన్లు సైతం చేస్తారు. ఒక్కోసారి ఇంజెక్షన్లు, చిల్లగింజలు, అడవిమొక్కల తీవ్రతకు మేకలు అస్వస్థతకు గురవుతుంటాయి. వీటిని అశ్వారావుపేట, రాజమండ్రి, ఇల్లెందు, కొత్తగూడెం, వరంగల్, హైదరాబాద్‌ మార్కెట్‌లలో సగం ధరలకే విక్రయిస్తారు. వ్యాధిన పడి కొన్ని చనిపోతుంటాయి.

    • రాళ్లపంట..మార్కెటింగ్‌ ఇలా

    రాళ్ల తయారీ ప్రక్రియ పూర్తి కాగానే అడవిలోనే ఆపరేషన్‌లాగా చేసి రాళ్లను బయటికి తీస్తారు. వీటి కడుపులో ఒక్కోరాయి 300 గ్రామల వరకు పరిమాణం ఉండేలా ఏర్పడతాయి. కిలో రాళ్ల ఖరీదు రూ. లక్షల్లోనే ఉంటుందనే ప్రచారం ఉంది. ఇక రంగును బట్టి డిమాండ్‌ ఉంటుందని తెలుస్తోంది. వంద మేకల మందను పెంచాలంటే కనీసం రూ. 20లక్షల వరకు పెట్టుబడి అవుతందట. సీజన్‌ ముగిశాక వంద మందపై కోటికిపైగా ఆదాయం వస్తుందని పుకార్లు ఉన్నాయి. ఆపరేషన్‌ చేసి రాళ్లను తీశాక  మేకకు గాయం నయం అయితే మార్కెట్‌లో విక్రయిస్తారు. లేకుంటే అడవిలేనే వదిలేసి వెళ్లిపోతారు. ఆపరేషన్‌ అనంతరం బతికిన మేకలను తక్కువ ధరకే అమ్మేస్తారు. వీటి మాంసం నాణ్యత బాగుండదని, ఇంజెక్షన్ల ప్రభావంతో తిన్నవారికి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని పలువురంటున్నారు.

    • ఇదో రకం దందా..

    ఇల్లెందు, గుండాల, మహబూబాబాద్‌ ప్రాంతాలకు చెందిన రాళ్ల వ్యాపారులు మేకలను ఇలా పెంచిస్తున్నారు. వర్షాకాలం మొదలయ్యాక అశ్వారావుపేట, దమ్మపేట, ముల్కలపల్లి మండలాలల్లోని అటవీ ప్రాంతంలో కొండలపై రాళ్ల మేకలను పెంచుతున్నారని స్థానికులు చెబుతున్నారు. వాలుగా ఉన్న కొండల్లో పెరిగే బిల్లుడు, తబ్సి, ఊడుగు, కొడిశ, మారేడు, చిల్ల వంటి విలువైన జాతుల మొక్కలను రాళ్ల మేకలకు ఆహారంగా అందిస్తారు. అడువుల్లోని గిరిజన గ్రామాలకు చెందిన వారి మేకలుగా మేత కోసం అడవికి Ðð ళ్లినట్లుగా సృష్టిస్తుంటారు. సాధారణ మేకలు తినే గడ్డి, గరికకు బదులుగా ప్రత్యేకంగా కడుపులో రాళ్లను పెంచే తత్వం ఉన్న చిగురు మొక్కలనే తినిపిస్తారు. అశ్వారావుపే మండలం దురపాడు, గాడ్రాల, మొద్దుల మడల ప్రాంతాల్లో ఈ దందా ఎక్కువ. ఆపరేషన్‌ చేసి రాళ్లు బయటకు తీసే విషయంలో మామిళ్ల వారిగూడెం గ్రామానికి చెందిన ఓ ఆర్‌ఎంపీ కీలక పాత్ర పోషిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈయనకూ వాట ఉంటుందట. రాళ్ల మేకల పెంపకం విషయంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి పాత్ర ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని వ్యవహారాలు ఆయనే చక్కబెడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అటవీ శాఖలో రెండు విభాగాల మధ్య వివాదంతో స్క్వాడ్‌ బృందం గతంలో అశ్వారావుపేట మండలం దురదపాడులో రాళ్ల మేకల పెంపకం స్థావరాలపై దాడి చేసి, కేసు నమోదు చేసింది కూడా. ఆ తర్వాత మళ్లీ దాడులు కరువయ్యాయి.

    • విచారణ నిర్వహిస్తాం

    అడవిలో మేకల పెంపకం దారులపై ఆరా తీస్తాం. సిబ్బందిని పంపి వివరాలు సేకరించి పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తాం. బాధ్యులపై కేసులు నమోదు చేస్తాం.
    – శ్రీనివాసరావు, రేంజర్‌ , దమ్మపేట

మరిన్ని వార్తలు