ఆత్మహత్యలు మాని పోరుకు రండి

27 Oct, 2015 22:44 IST|Sakshi

భీమవరం : రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు మాని పోరుబాట పట్టాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ సహాయ కార్యదర్శి విజు కృష్ణన్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘ రాష్ట్ర ప్రథమ మహాసభలు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ జరిపి బహిరంగ సభ నిర్వహించారు. సభలో విజు కృష్ణన్ మాట్లాడుతూ రెండు దశాబ్దాల్లో దేశంలో 3.20 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పాలకులు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మంచిరోజులు వస్తాయని నమ్మబలికి అధికారం సాధించిన మోదీ పాలనలో రైతుల ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయన్నారు.

ఎన్నికలకు ముందు రైతులకు వరాల జల్లులు కురిపించిన బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చాక రైతులు ప్రేమ వ్యవహారాలు, వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అనడం దుర్మార్గమన్నారు. పంటలకు గిట్టుబాటు ధర దక్కక, ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయి.. ప్రకృతి వైపరీత్యాలతో కుదేలవుతున్న కౌలు రైతులు, రైతులకు ప్రభుత్వాల నుంచి సాయం అందక అప్పుల ఊబిలో కూరుకుపోయిఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో చెప్పిన పాలకులు ఇప్పుడు దాని ప్రస్తావనే తేవడం లేదన్నారు. కమిటీ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు 50 శాతం అదనంగా కలిపి రైతులకు ధర ఇవ్వాలని కృష్ణన్ డిమాండ్ చేశారు.

ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగబోయిన రంగారావు మాట్లాడుతూ అనేక వాగ్దానాలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఏరుదాటి తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తోందన్నారు. రుణమాఫీ వల్ల సన్న, చిన్నకారు, పేద, కౌలు రైతులకు ఒరిగిందేమి లేదన్నారు. రూ.7,640 కోట్లను ప్రభుత్వం రుణమాఫీ కోసం కేటాయిస్తే.. రైతులు బ్యాంకులకు చెల్లించిన వడ్డీ రూ.18 వేల కోట్లు ఉందని ఆయన చెప్పారు. దీనిని బట్టి రైతులకు రుణమాఫీ ఎంతవరకు ఉపయోగపడిందో అర్థమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి.బలరాం, సుబ్బారావు మాట్లాడుతూ రాజధాని భూసేకరణ పేరుతో రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా వేలాది ఎకరాల భూముల్ని లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ధ్వజమెత్తారు. సభలో ఏపీ కౌలు రైతుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జుత్తిగ నరసింహమూర్తి, రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.జమలయ్య, ఏఐకేఎస్ జాతీయ నాయకులు హరికృష్ణారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు