ఆ..పనులను ఆపేయండి

20 Mar, 2016 03:26 IST|Sakshi

నీరు-చెట్టు పనులు నిలుపుదలకు కలెక్టరు ఆదేశం
కొత్తనిబంధనలు వచ్చే వరకూ పనులకు బ్రేక్

 శ్రీకాకుళం టౌన్: డబ్బులిచ్చినా పనిచేయలేక పోయారు. ప్రాజెక్టుకైతే భూసేకరణ, ఇతర సమస్యలు చెపుతారు. ఇప్పుడు ఏసమస్యలేని పనులెందుకు చేయలేక పోతున్నారు. ఇందులో ఉన్న ఆంతర్యమేమిటో చెప్పాలంటూ జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది మంజూరైన పనుల్లో ఇంతవరకు ఎంత మేరకు పనులు పూర్తి చేశారు..ఎంత చెల్లింపులు జరిగాయో వివరాలు చెప్పాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో నీరు-చెట్టు పనులపై శనివారం సమీక్షించారు. ఈనెల 21లోగా పనులు చేసి.. ఆ తరువాత నిలిపివేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని వివరించారు. మీ నిర్లక్ష్యం వల్ల రూ.కోట్లు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఎదురైందని మండిపడ్డారు. కొత్తగా ప్రభుత్వం నుంచి వచ్చే మార్గదర్శకాలను అనుసరించి కొత్తగా పనులు మంజూరు చేయడానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. వేసవిలో పనులు చేపట్టక పోతే సాగునీటివనరుల అభివృద్ధి సాధ్యం కాదని గుర్తు చేశారు. ఇప్పటివరకు డివిజన్లవారీగా మంజూరు చేసిన పనులు, వాటికి ఇచ్చిన కేటాయింపులు, ఇప్పటివరకు పూర్తిచేసిన పనులు, వాటికి చెల్లింపులు ఎంతమేరకు జరిగాయన్న వివరాలు తక్షణమే అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో నీరు-చెట్టు పథకం నోడల్ అధికారి, వంశధార ఎస్‌ఈ బి.అప్పలనాయుడు, ఈఈ రవీంద్ర, వంశధార, అఫ్‌షోర్, మడ్డువలస ప్రాజెక్టుల ఈఈలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు