ఆ కూల్చివేతలు ఆపండి..

23 Jul, 2016 23:24 IST|Sakshi
సాక్షి, విశాఖపట్నం: భీమిలి మండలం చేపల తిమ్మాపురంలో మత్స్యకారులకు చెందిన ఇళ్ల కూల్చివేతను ఆపేయాలని కేంద్ర ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ కలెక్టర్‌ యువరాజ్‌ను కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక లేఖ రాశారు. 30 ఏళ్ల క్రితం మత్స్యకారులకు కేటాయించిన 15 ఎకరాల స్థలంలో ఇళ్లు, ఇతర కట్టడాలు నిర్మించుకున్నారని పేర్కొన్నారు. కానీ రాజకీయ ఒత్తిళ్లు, ఇతరుల ప్రయోజనాల కోసం ఇటీవల అధికారులు వాటిని దౌర్జన్యంగా కూల్చివేశారన్నారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. దీనిపై ఈ నెల 21న బాధిత మత్స్యకారులు జిల్లా మంత్రిని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారని తెలిపారు. దీంతో మంత్రి స్పందించి ఇకమీదట మిగిలిన ఇళ్ల కూల్చివేత ఆపేయాలని అధికారులను ఆదేశిస్తానని, బాధితులకు కొత్తగా ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే పంచాయతీ అధికారులు మాత్రం మిగిలిన ఇళ్లను కూల్చేస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే ఇళ్ల కూల్చివేత ఆలోచనను విరమించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. మరోవైపు మత్స్యకార నాయకులు, బాధితులు శనివారం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. 
 
మరిన్ని వార్తలు