విద్యార్థి వ్యతిరేక విధానాలు మానుకోవాలి

24 Sep, 2016 23:52 IST|Sakshi
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రాము
ఏలూరు సిటీ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై దిశానిర్దేశం చేసే విధంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతున్నామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము తెలిపారు. శనివారం స్థానిక ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యాలయంలో ఆఫీస్‌ బేరర్ల సమావేశం జిల్లా అధ్యక్షుడు కె.క్రాంతిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు రాము మాట్లాడుతూ భీమవరం పట్టణంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నామని తెలిపారు. డిసెంబర్‌ 15, 16, 17 తేదీల్లో నిర్వహించే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. పేద విద్యార్థులకు విద్యానిలయాలుగా ఉన్న సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు రేషనలైజేషన్‌ పేరుతో మూసివేయడం అత్యంత దారుణమైన చర్యని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్‌ ఫీజులు పెంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మాత్రం తగ్గించి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టే విధంగా విద్యార్థి లోకం ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంపన రవికుమార్‌ మాట్లాడుతూ 25 సంవత్సరాల అనంతరం జిల్లాలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తుందన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి వి.మహేష్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.శివరాజు, మహిళా కన్వీనర్‌ పి.తులసి, జిల్లా సహాయ కార్యదర్శి పి.సాయికృష్ణ, టి.దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు