‘విష్ణు’దౌర్జన్యాలు అరికట్టండి

10 Feb, 2017 22:58 IST|Sakshi
‘విష్ణు’దౌర్జన్యాలు అరికట్టండి
– వైఎస్‌ఆర్‌సీపీ సీఈసీ మెంబర్‌ కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి
కర్నూలు (ఓల్డ్‌సిటీ)/కల్లూరు(రూరల్‌): కర్నూలు మాజీ మండలాధ్యక్షుడు, టీడీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి డి.విష్ణువర్దన్‌రెడ్డి దౌర్జన్యాలు పెచ్చుమీరిపోతున్నాయని, టీడీపీ పాలకులు మేలుకుని వాటిని అరికట్టాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ సీఈసీ మెంబర్‌ కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక కృష్ణకాంత్‌ ప్లాజాలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన పార్టీ మండల నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భర్తలు బతికే చనిపోయినట్లు చిత్రీకరించి ఉల్చాల గ్రామంలో ఎనిమిది మంది లబ్ధిదారుల పేర్లు పెన్షన్ల జాబితాలో చేర్పించడం విడ్డూరమన్నారు.
 
ఆ జాబితాలో ఉన్న వారికి పెన్షన్లు మంజూరు చేయాలనే అంశంపైనే విష్ణు మద్దతుదారులతో గురువారం భారీ ఊరేగింపు నిర్వహించడం సిగ్గుచేటన్నారు. దేవాదాయ శాఖ నుంచి నిధులు రాబట్టుకునే దురుద్దేశంతో సి.బెళగల్‌ మండలం పోలకల్లు గ్రామంలోని చెన్నసోమేశ్వర ఆలయాన్ని పడగొట్టే పథకానికి ప్రణాళిక రూపొందించుకున్నారని ఆరోపించారు. మొదట వీఆర్వోగా పనిచేసిన విష్ణువర్దన్‌రెడ్డి..1985లో 20 ఎకరాల ఆస్తితో రాజకీయ జీవితం ప్రారంభించి నేడు కోట్ల రూపాయలకు అధిపతి అయ్యారని విమర్శించారు. ప్రభుత్వ పథకాలు పొందాలనుకుంటే పర్సెంటేజీలు ఇవ్వాల్సిందేనా అని ప్రశ్నించారు. పొలానికి నీళ్లు కావాలన్నా.. రైతులు రూ.2వేలు ఇచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విష్ణుపై పోలీస్‌ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. అధికారులను బెదిరించడానికే ధర్నాలు చేయిస్తారని తెలిపారు.
 
ఇతనికి డిప్యూటీ సీఎం కె.ఇ.కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, చివరికి ఎమ్మెల్యే మణిగాంధీతో కూడా సత్సంబంధాలు లేవన్నారు. మాతృమూర్తికి అన్నం పెట్టలేని ఇలాంటి వ్యక్తి అధికార పార్టీలో కొనసాగడం విచారకరమన్నారు. అవినీతిలో కర్నూలు మండల టీడీపీ నేతలు జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉన్నారని, తర్వాతి స్థానంలో కోడుమూరు నిలిచిందన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు మండల కన్వీనర్‌ వెంకటేశ్వర్లు, సి.బెళగల్‌ మండల కన్వీనర్‌ ఎర్రన్న, గూడూరు మండల కన్వీనర్‌ సుధాకర్, కర్నూలు మండల కార్యదర్శి సయ్యద్, నాయకులు ఎదురూరు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు