హరిత హోటల్ పనులకు బ్రేక్‌

31 Aug, 2016 19:24 IST|Sakshi
హరిత హోటల్ పనులకు బ్రేక్‌
  • గడువు ముగిసినా పూర్తి కాని నిర్మాణం
  • కాంట్రాక్టర్‌కు బిల్లులు రాక నిలివేత
  • టూరిజంశాఖ అధికారుల పర్యవేక్షణ కరువు
  • కాళేశ్వరం: పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న హరితహోటల్‌ పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. బిల్లుల చెల్లింపులో జాప్యం.. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వెరసి నిర్మాణం ఆలస్యమవుతోంది. ఈ ఏడాది ఆగస్టు 31వరకే పూర్తి కావాల్సి ఉన్నా ఆ దిశగా పనులు కొనసాగడంలేదు. ఇప్పటివరకు 85శాతం పూర్తయ్యాయని, బిల్లులు చెల్లిస్తే పనులు పూర్తిచేస్తామని కాంట్రాక్టర్‌ చెబుతున్నాడు.  
     
    కాళేశ్వరంలో 2012–13లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం హరితహోటల్‌ నిర్మాణం కోసం టూరిజంశాఖ నుంచి నిధులు మంజూరుచేసింది. అప్పటిమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కృషితో రూ.4కోట్ల నిధులు మంజూరయ్యాయి. కాళేశ్వరంలో ప్రభుత్వ స్థలం లేక పలుమార్లు రెవెన్యూ, టూరిజంశాఖ అధికారులు సర్వేలు నిర్వహించి విఫలమయ్యారు. నిధులు తిరిగి వెళ్తున్న క్రమంలో 2014లో మంథని ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ చొరచూపారు. అధికారులతో మాట్లాడి కాళేశ్వరంలోని మూడెకరాల స్థలాన్ని కేటాయించేలా చూశారు. ఆ భూమిని టూరిజంశాఖ అధికారులకు అప్పగించడంతో రావూస్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ హరితహోటల్‌ పనులు మొదలు పెట్టింది.
     
    పనులు మెల్లగా..
    కాంట్రాక్టర్‌ పనులు చేపట్టినప్పటి నుంచి జాప్యంచే స్తున్నాడనే ఆరోపణలున్నాయి. దీనిపై సదరు కాంట్రాక్టర్‌ సంస్థలకు మెమోలు ఇచ్చి బ్లాక్‌లిస్టులో పెట్టినట్లు ఇంజినీరింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు. 2016 ఆగస్టు 31 వరకు హరితహోటల్‌ నిర్మాణం పూర్తికావాల్సి ఉండగా.. బిల్లులు రాకపోవడంతోనే కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 85 శాతం పనులు పూర్తయ్యాయి. బిల్లులు రాకపోవడంతో వారం రోజులుగా పనులు నిలిపినట్లు సమాచారం. ముందస్తుగా బిల్లులు చేస్తే మూడు నెలల ముందుగానే పూర్తి చేసేవాళ్లమని కాంట్రాక్టర్‌ చెబుతున్నాడు. ఇంకా విద్యుత్‌ కనెక్షన్, ఫ్లోరింగ్, టైల్స్, రంగులు వేయడం తదితర పనులు మిగిలిఉన్నాయి. టూరిజంశాఖ అధికారులు మాత్రం హోటల్‌ పనులు పర్యవేక్షించకుండా ఇతరులతో బిల్లులు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాస్థాయి అధికారులు స్పందించి కాంట్రాక్టర్లకు బిల్లులు అందించి  భక్తులకు హరితహోటల్‌ అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
     
    బిల్లుల రాకనే ఇబ్బంది
    –శ్రీనివాస్, రావూస్‌ కన్‌స్ట్రక్షన్‌ కాంట్రాక్టర్‌
    బిల్లుల సకాలంలో అందకనే పనులు నత్తనడక సాగుతున్నాయి. మొదటినుంచి బిల్లుల రావడం లేదు.  కొన్ని బిల్లులు మాత్రమే వచ్చాయి. పూర్తిస్థాయిలో ఇంజినీరింగ్‌ అధికారులు బిల్లులు అందిస్తే మూడు నెలల ముందే హోటల్‌ అందించేవాళ్లం. ఆగస్టు 31 గడువులోగా పూర్తి చేయాలి. టెక్నికల్‌ ప్రాబ్లమ్స్‌ అంటున్నారు. బిల్లులు ఇస్తే నెలలోపు పూర్తి చేస్తాం.
     
     పనులు నిదానంగా..
    –జీవన్‌రెడ్డి, టూరిజంశాఖ ఏఈఈ
    హరితహోటల్‌ పనులు కాంట్రాక్టర్‌ నిదానంగా చేస్తుండు. ఈ విషయంలో వారికి పనులు సక్రమంగా జరగడం లేదని మెమోలు ఇచ్చాం. కొన్ని సాంకేతిక సమస్యలతో బిల్లులు మంజూరు కాలేదు.
     
     
     
మరిన్ని వార్తలు