రెవెన్యూ సేవలు బంద్‌

29 Jul, 2016 21:05 IST|Sakshi
రెవెన్యూ సేవలు బంద్‌
  • ముదురిన మ్యుటేషన్‌ లొల్లి
  • డిజిటల్‌ కీ సరెండర్‌ చేసిన తహసీల్దార్లు
  • సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌
  • ముకరంపుర:  జిల్లాలో రెవెన్యూ సేవలు నిలిచిపోయాయి. ఆ శాఖలో మ్యుటేషన్‌ (ఆస్తి మార్పిడి) లొల్లి ముదురుతోంది. క్షేత్రస్థాయిలో వెబ్‌ల్యాండ్‌లో సాంకేతిక సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రభుత్వం ఇచ్చిన డిజిటల్‌ కీని వినియోగించకూడదని తెలంగాణ తహసీల్దార్లు అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. మ్యుటేషన్లలో జాప్యం విషయమై ‘‘మండల కార్యాలయాల్లో యూజ్‌లెస్‌ ఫెల్లోస్‌ ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మ్యుటేషన్‌ రాకెట్‌ నడుస్తోంది’’ అంటూ సీసీఎల్‌ఏ రేమండ్‌పీటర్‌ చేసిన వాఖ్యలపై తహసీల్దార్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర తహసీల్దార్ల సంఘం పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం తహసీల్దార్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బైరం పద్మయ్య ఆధ్వర్యంలో కలెక్టర్‌ నీతూప్రసాద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జిల్లావ్యాప్తంగా తహసీల్దార్లందరూ శుక్రవారం సంబంధిత ఆర్డీవోలకు డిజిటల్‌ కీ అందజేశారు. ఫలితంగా జిల్లాలో తహసీల్దార్ల డిజిటల్‌ కీతో సంబంధముండే, మీ సేవల ద్వారా జరిగే సేవలన్నీ నిలిచిపోయాయి. ప్రధానంగా అన్ని రకాల సర్టిఫికెట్లు, పహనీ నకల్, మ్యుటేషన్, కౌలురైతు కార్డులు, పాసుబుక్కులు అందే అవకాశం లేకుండా పోయింది. ఇటీవలే జిల్లాలో మ్యుటేషన్‌పై నిర్లక్ష్యం చేసిన 31 మంది తహసీల్దార్లకు కలెక్టర్‌ నీతూప్రసాద్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే గత నాలుగైదు నెలలుగా వెబ్‌ల్యాండ్‌లో సాంకేతిక సమస్యల కారణంగా రైతులకు పహనీలు ఇవ్వడంలో అంతరాయం కలుగుతోందని, దీంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, సబ్‌ రిజిస్ట్రార్‌ నుంచి వచ్చిన దరఖాస్తులను, మీ సేవ నుంచి వచ్చిన మ్యుటేషన్‌ దరఖాస్తులను పరిష్కరించలేకపోతున్నామని తహసీల్దార్లు కలెక్టర్‌కు విన్నవించారు. రైతులకు పాసుపుస్తకాలను మ్యానువల్‌గా ఇవ్వకూడదన్న ఆదేశాలతో వెబ్‌ల్యాండ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యతో పాసుపుస్తకాలను రైతులకు సకాలంలో అందించలేకపోతున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర కార్యవర్గ నిర్ణయం మేరకు డిజిటల్‌ కీలను అందజేస్తున్నామని, సాంకేతిక సమస్యలను త్వరతిగతిన పరిష్కరించాలని కోరారు. 
     కొత్త విధానంలోనూ సమస్యలు..
    గతంలో గ్రామ పంచాయతీలో రైతులు కొనుగోలు చేసిన భూములను రిజిస్ట్రేషన్‌ అయిన తర్వాత సదరు ఆస్తిహక్కు మార్పిడి కోసం మళ్లీ తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ఈ సమయంలో రిజిస్ట్రేషన్‌ దస్తావేజులను జతపరిచేవారు. వీఆర్‌వోలు ఒక నోటీసు జారీ చేసి ఆ భూమి కొనుగోలుపై ఎవరికీ అభ్యంతరాలు లేవని ధ్రువీకరించిన తర్వాత మ్యుటేషన్‌ చేసేవారు. ఈ విధానంలో లోపాలు, అధికారులు ముప్పుతిప్పలు, మామూళ్ల వ్యవహారం జోరుగా సాగేదన్న విమర్శలున్నాయి. అయితే గత జూన్‌ ఒకటి నుంచి సర్కారు కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. వారసత్వంగా దక్కిన భూములను పదిరోజుల్లో, సేల్, గిఫ్ట్, పార్టిషన్, రాటిఫికేషన్‌తో పాటుగా సాధారణ రిజిస్ట్రేషన్‌ ద్వారా చేసిన భూములకు 15 రోజుల్లోగా మ్యూటేషన్‌ చేసి పాసుపుస్తకాలు జారీ చేయాలన్న విధానాన్ని రూపొందించారు. ఇందుకోసం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం, మండల రెవెన్యూ కార్యాలయం వెబ్‌సైట్లను అనుసంధానించారు. రిజిస్ట్రేషన్‌ అయిన వెంటనే ఆ వివరాలు తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లిపోతాయి. సదరు పత్రాల ఆధారంగా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన 15 రోజుల్లో మ్యూటేషన్‌ చేయాలి. ఈ విషయాన్ని ఆన్‌లైన్‌లో సదరు అధికారులు ధ్రువీకరించాలి. కానీ జిల్లాలో వెబ్‌ల్యాండ్‌లో సాంకేతిక సమస్యల కారణంగా తీవ్ర జాప్యం జరిగింది. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమేనని ఉన్నతాధికారులు పేర్కొంటుండగా, తమ తప్పేమీ లేదని తహసీల్దార్లు చెబుతున్నారు. జిల్లాలోని 31 మండలాల్లో 383 మ్యుటేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తించారు. రెవెన్యూ రికార్డుల కంప్యూటరీకరణ నేపథ్యంలో పాసుపుస్తకాల జారీని ప్రభుత్వం నిలిపివేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలో 55 వేల పట్టాదారు పాసుపుస్తకాలను రెవెన్యూ యంత్రాంగం ముద్రించింది. ఇప్పటివరకు 28 వేల మంది రైతులకు అందజేయగా 2.01 లక్షల ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ కంప్యూటరీకరించడం అధికారులకు సవాల్‌గా మారింది. వెబ్‌ల్యాండ్‌ సాంకేతిక సమస్యలు, ఉన్నతాధికారుల మందలింపులు, తహసీల్దార్ల నిరసనలు ఎలా ఉన్నా... మధ్యలో రైతులు, ప్రజలు నలిగిపోతున్నారని పలువురు పేర్కొంటున్నారు. 
    హుజూరాబాద్‌ సీఐపై చర్య తీసుకోవాలి
    ప్రస్తుతం భీమదేవరపల్లి మండలం వంగరలో పనిచేస్తున్న వీఆర్‌వో వేణును చట్ట విరుద్ధంగా అరెస్ట్‌ చేసిన హుజూరాబాద్‌ సీఐ రమణమూర్తిపై చర్య తీసుకోవాలని తహసీల్దార్ల సంఘం, వీఆర్‌వోల సంఘం సంయుక్తంగా కలెక్టర్‌ను కోరారు. 2012లో హుజూరాబాద్‌ మండలంలో వీఆర్‌వోగా పనిచేసిన కాలంలో ఓ రైతు రిజిస్టర్‌ డాక్యుమెంట్‌ను జమాబందీ అమలుకు దరఖాస్తు చేసుకోగా విచారణలో మోకాపై ఉండి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో మ్యుటేషన్‌ చేయించడం జరిగిందన్నారు. ఈ విషయమై తాజాగా సదరు భూమిని అమ్మిన వ్యక్తి ఫిర్యాదు చేయడంతో రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ నకిలీదని తేలిందన్నారు. తప్పుదారి పట్టించిన వ్యక్తిని అరెస్ట్‌ చేయాల్సిన పోలీసులు ఆర్డీవో, తహసీల్దార్, కలెక్టర్‌ అనుమతి లేకుండా ఆర్‌వోఆర్‌ చట్టాన్ని ఉల్లంఘించి వీఆర్‌వోపై చర్య తీసుకున్నారని పేర్కొన్నారు. తప్పులుంటే ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, పోలీసుల అత్యుత్సాహం తగదన్నారు. కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన వారిలో తహసీల్దార్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బైరం పద్మయ్య, కార్యదర్శి మధుసూదన్, తహసీల్దార్లు ఈశ్వరయ్య, మహేశ్వర్, వెంకట్‌రెడ్డి, రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌.శ్రీనివాస్, శ్రావణ్, వీఆర్‌వోల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుర్రాల రాజేందర్, జిల్లా అధ్యక్షుడు నూకల శంకర్, నాయిని కనకరాజు, వేల్పుల రాజయ్య, చంద్రమోహన్, అన్వర్, రజని, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. 
మరిన్ని వార్తలు