ఆల్మట్టికి నిలిచిన వరద

10 Sep, 2016 22:22 IST|Sakshi
నారాయణపూర్‌ ప్రాజెక్టు వద్ద నిలిచిన నీటివిడుదల
జూరాల : కృష్ణానదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు శనివారం ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 122.83 టీఎంసీల నీటినిల్వ ఉంది. పై నుంచి వచ్చే ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోవడంతో ప్రాజెక్టులో విద్యుదుత్పత్తిని కూడా నిలిపివేశారు. దీంతో ఆల్మట్టి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోలు లేవు. ఆల్మట్టి ప్రాజెక్టుకు దిగువన కర్ణాటకలోనే ఉన్న నారాయణపూర్‌ ప్రాజెక్టుకు పూర్తి నీటినిల్వ 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 26.58 టీఎంసీల నీటినిల్వ ఉంది. పై నుంచి ఇన్‌ఫ్లో కేవలం 1598 క్యూసెక్కులు వస్తుండటంతో ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం మినహా, విద్యుదుత్పత్తి, స్పిల్‌వేల ద్వారా దిగువకు ఔట్‌ఫ్లో పూర్తిగా నిలిపివేశారు. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు దిగువన మన రాష్ట్రంలో ఉన్న జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.05 టీఎంసీల నీటినిల్వ ఉంది. ప్రాజెక్టు రిజర్వాయర్‌ నుంచి నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1500 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతలకు 630 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే  భీమా ఎత్తిపోతల లిఫ్ట్‌–1 ద్వారా 1300 క్యూసెక్కులు, లిఫ్ట్‌–2 ద్వారా 750 క్యూసెక్కులు, జూరాల కుడి, ఎడమ కాలువల ద్వారా 750 క్యూసెక్కులను వినియోగిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు ద్వారా 5180 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోని విద్యుదుత్పత్తి, స్పిల్‌వే ద్వారా ఔట్‌ఫ్లోను పూర్తిగా నిలిపివేశారు.     
 

 

మరిన్ని వార్తలు