ప్రైవేట్‌ మార్కెట్లుగా గోదాములు

8 Mar, 2017 03:03 IST|Sakshi
ప్రైవేట్‌ మార్కెట్లుగా గోదాములు

ప్రత్యేక చట్టానికి రూపకల్పన చేసిన కేంద్ర ప్రభుత్వం
వ్యాపారులు, రైతులు, వినియోగదారులు మార్కెట్లు పెట్టుకోవచ్చు
జిల్లాలో అందుబాటులో 20 గోదాములు


వరంగల్‌ రూరల్‌: రైతులు తాము పండించిన పంటలను రిటైల్‌ ధరలకు నేరుగా అమ్ముకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. అందుబాటులో ఉన్న గోదాముల్లో ప్రైవేట్‌ మార్కెట్లను ఏర్పాటు చేసి వ్యాపారులు, రైతులు, వినియోగదారులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ చట్టాన్ని రూపొందిస్తుంది. ప్రైవేట్‌ మార్కెట్ల విధానానికి అంకురార్పణ జరుగనున్న నేపథ్యంలో వ్యవసాయ ప్రాధాన్యం కలిగిన వరంగల్‌ రూరల్‌ జిల్లా రైతుల్లో ఆసక్తి నెలకొంది. వివరాల్లోకి వెళితే పునర్విభజన ప్రక్రియలో కొత్తగా ఏర్పడిన జిల్లాలో 15 మండలాలు ఉన్నాయి. అయితే పూర్తిగా వ్యవసాయ రంగమైన ఈ ప్రాంత రైతులను  ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి సంకల్పించింది. ఇందులో భాగంగా ప్రైవేట్‌ మార్కెట్లకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రాల అభిప్రాయం కోరింది.

రైతులకు ప్రయోజనం..
ప్రైవేట్‌ మార్కెట్లలో అన్ని రకాల వ్యవపాయ ఉత్పత్తులు కాకుండా, ఆయా ప్రాంతాలకు అనుగుణంగా నిర్దారించిన వ్యవసాయ ఉత్పత్తులను రైతులు విక్రయించుకోవాల్సి ఉంటుంది. ముసాయిదా బిల్లుకు సంబంధించి కేంద్రం రాష్ట్రాల సలహాలు, సూచనలు, అభి ప్రాయాలు కోరింది. ఆయా రాష్ట్రాల్లో ఈ చట్టానికి సంబంధించి కొన్ని మార్పులు చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు కొన్ని నిబంధనలు కచ్చితంగా అమలు చేసేలా బిల్లు రూపొందించారు. దళారుల దందాను అధిగమించి రైతులు అధిక లాభం పొందేలా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నారు. ప్రైవేట్‌ మార్కెట్లను కమిషన్‌ ఏజెంట్లతో పాటు రైతులు, వినియోగదారులు సైతం కలిసి ఏర్పాటు చేసుకునేలా అవకాశం కల్పించనున్నారు. దీంతో రైతులు నేరుగా రిటైల్‌ ధరలకు అమ్ముకునేలా చేస్తు న్నారు. గోదాముల్లో యూజర్‌ చార్జీలు వసూలు చేస్తారు. మరో వైపు కూరగాయలు, పండ్లు మాత్రం ఎలాంటి పన్నులు లేకుండా రైతులు ఎక్క డైనా అమ్ముకునేలా అవకాశం కల్పించనున్నారు. గోదాముల్లో ఏర్పాటు చేసే చిన్న మార్కెట్లలో ఎలక్ట్రానిక్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేసేం దుకు నిర్ణ యించారు. రాజకీయ జోక్యం లేకుండా రైతులే కార్యకలాపాలు చేపట్టేలా నిబంధనలు రూపొందించనున్నారు.

జిల్లాలో 20 గోదాములు..
వరంగల్‌ రూరల్‌ జిల్లాలో నెక్కొండ, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట, గూడెప్పాడ్‌ మార్కెట్‌ కమిటీల పరిధిలో మొత్తం 20 గోదాములు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒక గోదాం దెబ్బతినగా, 14 రైతులు, ట్రేడర్లు, మన గ్రోమోర్, సీఎస్‌సీ, ఐకేపీ ఆధీనంలో ఉండగా మరికొన్నింట్లో ఎరువులు, ఒక గోదాము కార్యాలయంగా ఉన్నాయి. మరో 5 గోదాములు ఖాళీగా ఉన్నాయి. మొత్తం అన్ని గోదాములు కలిపి 19,550 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగి ఉన్నాయి.

మరిన్ని వార్తలు