దేశ రక్షణలో మన సైనికుడు

30 Aug, 2017 23:00 IST|Sakshi
దేశ రక్షణలో మన సైనికుడు

రైతు బిడ్డలు...సైన్యంలో జవానులు
ఆర్మీ వైపు మొగ్గుచూపుతున్న ఆత్మకూరు యువత


‘‘జననీ జన్మభూమిశ్చ...స్వర్గాదపీ గరీయసి...ఏ తల్లి నిను కన్నదో...ఆ తల్లినే భూమి భారతి గొప్పదిరా’’...అంటూ ఓ సినీకవి..మాతృభూమి గురించి రాసిన మాటలు ఆ యువకుల మనసుల్లో నాటుకు పోయాయి. అందుకే ఉన్న ఊరిని కన్న తల్లిదండ్రులను వీడి...దేశసేవలో సరిహద్దులో సమరానికి సిద్ధమయ్యారు. ఒకరిని చూసి మరొకరు...ఒకరి వెంట మరొకరు ఇలా...ఆత్మకూరు యువత దేశ సేవలో తరిస్తుండగా...వారిని కన్నవాళ్లంతా గర్వంతో పొంగిపోతున్నారు.
- ఆత్మకూరు:

దేశ రక్షణ వ్యవస్థలో భారత సైనిక దళం (ఇండియన్‌ ఆర్మీ) ఒకటి. ఈ విభాగం ప్రధాన కర్తవ్యం... భూ భాగాన్ని పరిరక్షించడంతో పాటు దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ దేశ సరిహద్దుల భద్రతను పర్యవేక్షించడం. ఇలా దేశ రక్షణలో పాలుపంచుకునేందుకు ఆత్మకూరు మండలానికి చెందిన పలువురు యువకులు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తుండడంతో మండలంలో సైనికుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే 150 మందికి పైగా యువకులు ఆర్మీలో సేవలందిస్తున్నరాు. కన్న వారి కలలను సహకారం చేస్తూ...దేశ రక్షణలో మేముసైతం అంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

కష్టమైనా...ఇష్టపడి..
భారత సైనిక దళాల్లో పనిచేయడం అంత సులువైన విషయం కాదు. కఠోర శిక్షణ...ప్రతికూల పరిస్థితుల్లో విధుల నిర్వహణ..ఇలా ప్రతిదీ కష్టంతో కూడుకున్నదే. సరిహద్దులో కాపాలా ఉండే సైనికులకు పగలు..రాత్రి తేడా ఉండదు..నిరంతరం నిఘా ఉంచాల్సిందే. కొండలు..మంచు పర్వతాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.  రక్తం గడ్డకట్టే మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలి. అయినప్పటికీ యువత ఇష్టపడి మరీ దేశ రక్షణలో పాలుపంచుకుంటున్నారు. ఒక్కోసారి కుటుంబీకులతో మాట్లాడటం కూడా నెలల తరబడి కుదరదు. ఇక వివాహితులైతే కుటుంబాన్ని వదిలి విధులకు వెళ్లాల్సిన పరిస్థితులుంటాయి. అయినప్పటికీ  దేశ రక్షణ కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటూ ముక్తకంఠంతో చెబుతున్నారు.

ప్రోత్సాహిస్తున్న తల్లిదండ్రులు
సైనికుడి ప్రాణం..గాల్లో దీపంలాంటింది...ఎప్పుడు యుద్ధం వస్తుందో...ఎక్కడ ప్రమాదం పొంచి ఉంటుందో తెలియదు. నిత్యం ప్రాణాలతో చెలగాలం. అందుకే తమ బిడ్డలను ఆర్మీలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రారు. కానీ ఆత్మకూరు మండలలలోని చాలా మంది తల్లిదండ్రులు దేశ భద్రత కోసం తమ బిడ్డలను పునాదిరాళ్లుగా మలుస్తున్నారు. ఆర్మీలో ఉద్యోగం కోసం శిక్షణ కేంద్రాల్లో చేర్పిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు.

దేశరక్షణకు ప్రాణాలైనా ఆర్పిస్తా
నాకు సైన్యంలో ఉద్యోగం వచ్చి నాలుగు సంవత్సరాలవుతోంది. విధి నిర్వహణలో భాగంగా చాలా రాష్ట్రాల్లో పనిచేశాను. ప్రస్తుతం ఢిల్లీలో విధులు నిర్వర్తిస్తున్నాను. ఆర్మీలో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. దేశ రక్షణకు ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధం
-కొండారెడ్డి

గర్వంగా ఉంది
ఇండియన్ ఆర్మీలో పని చేయడం గర్వంగా ఉంది. మా తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ కష్టపడి చదివించారు. వారి కష్టాన్ని చూసి పట్టుదలతో శ్రమించి ఉద్యోగం సంపాదించా. సైనికుడిగా మంచిపేరు తెచ్చుకుని నా తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూడటానికి ఎంత కష్టమైనా భరిస్తా.
- మనోజ్‌ ప్రభాకర్‌రెడ్డి

నా జీవితం దేశరక్షణకే
నాకు 19 సంవత్సరాల వయసులోనే ఆర్మీలో ఉద్యోగం వచ్చింది . బెంగళూర్‌లో శిక్షణ పూర్తి చేసుకున్నా. దేశ రక్షణ కోసం జీవితాంతం పని చేయడానికి సిద్ధం. పుట్టిన ఊరికి, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావడమే నాధ్యేయం .
- కార్తిక్‌

మరిన్ని వార్తలు