'అమ్మో'రికా!

20 Jul, 2016 21:25 IST|Sakshi
'అమ్మో'రికా!

►  శ్వేతదేశంలో బలవుతున్న హైదరాబాదీలు
►  అటు ఊహించని ప్రమాదాలు, ఇటు హత్యలు
►  గత నెల 21న శ్రీదత్త ప్రమాదంపై సమాచారం
►  తాజాగా ఆమెరికాలో సంకీర్త్‌ హత్య వార్తతో సిటీలో కలకలం


సాక్షి, సిటీబ్యూరో: అమెరికా కలలు హైదరాబాదీల ఉసురుతీస్తూ తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నాయి. ఆ ‘కలల దేశం’లో ఓ పక్క హత్యలు, మరోపక్క ప్రమాదాలు వెంటాడుతూ అనేక మంది ఉసురుతీస్తున్నాయి. ఈ మృతులంతా ఉన్నత విద్య, ఉద్యోగం కోసమే అక్కడకు వెళ్లారు. తాజాగా మంగళవారం వెలుగులోకి వచ్చిన సంకీర్త్‌ ఉదంతంతో నగరం మరోసారి ఉలిక్కిపడింది.

అమెరికాలోని ఆరిజోనా సిటీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్న వనస్థలిపురానికి చెందిన శ్రీదత్త ఉదంతం వెలుగులోకి వచ్చి నెల రోజలు కూడా కాకుండానే ఇప్పుడు సంకీర్త్‌ హత్య చోటు చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. కాచిగూడలోని కుద్భిగూడకు చెందిన ఇతడు అమెరికాలోని ఆస్టిన్‌లో తన రూమ్‌లోనే నివసిస్తున్న మరో హైదరాబాదీ సాయి సందీప్‌ చేతిలో హత్యకు గురికావడంతో సంకీర్త్‌ కుటుంబం దుఖసాగరంలో మునిగిపోయింది.

ఈ రెండు ‘షాకెండ్స్‌’...
అమెరికాలోని ఆరిజోనాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్న వనస్థలిపురం కమలానగర్‌కు చెందిన శ్రీదత్త నంబూరి గత నెల్లో అక్కడ జరిగిన ప్రమాదంలో మృతిచెందారు. శ్రీదత్త నాలుగేళ్ళ నుంచి అక్కడే నివసించే వారు. అక్కడి టీసీఎస్‌ కంపెనీలో సీవీఎస్‌ హెల్త్‌ నెట్‌వర్క్‌ ఇంజనీరుగా పనిచేశారు. గత నెల్లో వీకెండ్‌ నేపథ్యంలో స్నేహితులతో కలసి ఓ జలపాతం వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి లోతుగా ఉన్న నీటిలో పడి మృతిచెందాడు. ఆస్టిన్‌లో నివసించే సంకీర్త్‌కు వీకెండ్‌ అయిన ఆదివారమే తన రూమ్మేట్‌ సాయి సందీప్‌గౌడ్‌తో చిన్న ఘర్షణ జరిగింది. దీంతో రాత్రి నిద్రపోగా... సోమవారం తెల్లవారుజామున ఆ రూమ్‌లోనే కత్తితో పొడిచి హత్య చేశాడు.
 

‘పెద్దల’ ఆశలన్నీ ఆడియాశలే...
ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం తమ బిడ్డలను విదేశాలకు పంపుతున్న తల్లిదండ్రులు వారిపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఈ విదేశీయానం కోసం ఆర్థికంగానూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రుణాలు తీసుకుని, ఆస్తులు తెగనమ్ముకుని పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం త్యాగాలు చేస్తారు. అయితే అలా విదేశాలకు వెళ్లిన వారు అక్కడ రోడ్డు ప్రమాదాలకో, కక్షలుకార్పణ్యాలకో, క్షణికావేశాలకో బలైతే కన్న వారి బాధలు చెప్పనలవి కాదు. ఇలాంటి కేసుల్లో చాలా వరకు కొలిక్కిరాకుండానే మిగిలిపోతున్నాయి.

ఏదైనా ఉదంతం చోటు చేసుకున్నప్పుడు మాత్రం పలకరింపులు, పరామర్శలతో హడావుడి చేసే నాయకులు ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం ద్వారా ‘సంపన్నదేశం’పై ఒత్తిడి తేవడంలో మాత్రం విఫలం అవుతున్నారు. ఫలితంగా ‘దూరపు కొండల్లో’ ఆశలు ఆవిరవుతున్నాయి. ఇలా బలయిపోయిన వారి మృతదేహాలు సైతం వెంటనే ఇక్కడకు చేరుకోవట్లేదు. బాధిత కుటుంబీకులు ఈ విషయంలోనూ అనేక బాధలుపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
 

మిగిలిన దేశాల్లో విషాదాలివీ...
♦   చందానగర్‌కు చెందిన సుప్రజ (31), ఆరు నెలల కుమారుడితో సహా అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఉదంతం 14న వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
♦   కాచిగూడ నింబోలీ అడ్డాకు చెందిన మహ్మద్‌ షఫీఖ్‌ అహ్మద్‌ సౌదీ అరేబియాలోని అల్‌ జుబియల్‌లో పని చేస్తున్నాడు. ఆయన చనిపోయారంటూ గత నెల 14న కుటుంబీకులకు సమాచారం అందింది.
♦   సైదాబాద్‌కు చెందిన మీర్‌ ఆసిఫ్‌ అలీ సౌదీ అరేబియాలో కెమికల్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అక్కడ తండ్రి మీర్‌ సాదత్‌ అలీతో కలిసి     ఉంటున్నారు. మే 16 ఉదయం విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ చనిపోయారు.
♦ కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డ్‌ కాలనీలో నివసిస్తున్న పూర్ణచంద్రరావు కుమార్తె రమ్యకృష్ణ తన భర్త మహంత్‌తో కలిసి ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. మే 18న అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని చనిపోయార

ఒకటా రెండా...
♦   నగరానికి చెందిన పోలీసు అధికారి కె.రామారావు కుమార్తె ప్రణీత అమెరికాలోని రైట్‌ స్టేట్‌యూనివర్సిటీలో ఎంఎస్‌లో చేస్తూ అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.
♦   సంతోష్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ప్రశాంత్‌ అమెరికాలో దారుణ హత్యకు గురయ్యారు.
♦  కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఆర్‌.సంతోష్‌కుమార్‌ మృత్యువాత పడ్డారు.  
♦    అమెరికాలోని అట్లాంటాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కే చెందిన యువ ఇంజనీర్‌ ధీరజ్‌రెడ్డి మరణించారు.
♦   కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన ముప్పవరపు సత్యనారాయణ కుమార్తె ప్రియదర్శిని అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించారు.
♦   హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అక్షయ్‌ విశాల్‌ లిటిల్‌రాక్‌లో హత్యకు గురయ్యారు.
♦    నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అపర్ణ అమెరికాలోని తన ఫ్లాట్‌లో హత్యకు గురయ్యారు.
♦  సదరన్‌ ఇల్యునాయిస్‌ యూనివర్శిటీ విద్యార్థులు టి.సౌమ్య రెడ్డి, విక్రమ్‌ రెడ్డి చికాగోలో కన్నుమూశారు.
 

మరిన్ని వార్తలు