వేదం..ఆర్తనాదం!

17 Jul, 2016 01:36 IST|Sakshi
వేదం..ఆర్తనాదం!

కిడ్నీలు చెడిపోయి ప్రాణాపాయ స్థితిలో అర్చకుడు
శస్త్రచికిత్స చేసుకోలేక అవస్థలు
దాతల కోసం ఎదురుచూపు
టీటీడీ ప్రాణదాన ట్రస్ట్ ఆదుకొనేనా?
 

‘బతకాలని ఉంది. వృద్ధాప్యంలోని తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాలని ఉంది. గొంతులో ప్రాణమున్నంత వరకు భగవంతుడికి వేద మంత్రాలతో సేవ చేసుకోవాలని ఉంది. కానీ ఏం చేయను. రెండు కిడ్నీలు పాడయ్యాయి. వీటిని బాగుచేసుకునే స్థోమతలేదు. కనీసం మందులూ కొనలేని స్థితి. మనసున్న దాతలు కనికరించండి. ఆర్థిక చేయూతనందించి ప్రాణభిక్ష పెట్టండి’ అంటూ ఈ ఫొటోలోని అర్చకుడు సాయిప్రకాష్ చెమర్చిన కళ్లతో స్విమ్స్‌కు వచ్చిపోయే వారిని దీనంగా అర్థించడం చూపరులను కంటతడి పెట్టిస్తోంది.
 
తిరుపతి మెడికల్: రాజమండ్రికి చెందిన కందాడి, ఇందుమతి దంపతులకు కె.సాయిప్రకాష్ ఆచార్యులు (26) ఏకైక సంతానం. బ్రాహ్మణ కుటుంబం కావడంతో ఉపాధికోసం హైదరాబాద్‌కు వచ్చిన కందాడి తన బిడ్డ సాయిప్రకాష్‌కు 14వ ఏటనే ‘ఉపనయనం’ చేశారు. 18 ఏళ్ల వయసులో వేదంపై మక్కువతో సాయిప్రకాష్ పుట్టపర్తి వేదపాఠశాలలో యజు ర్వేద స్మార్థంలో, తిరుమల ధర్మగిరిలోని వేదపాఠశాలలో ‘రుగ్వేద స్మార్థం’ అంశంలో అర్చకత్వం, పౌరోహిత్యం విద్యను అభ్యసించా డు. కొంతకాలానికి తండ్రి చనిపోయాడు. 2011లో భద్రాచలం సా రపాక గ్రామంలోని శ్రీ సత్యనారాయణ ఆలయ అర్చకుడిగా ఉద్యో గం వచ్చింది. బతుకు గాడిలో పడిందనుకున్న తరుణంలో అనారోగ్యం వెంటాడింది. పరీక్షలు నిర్వహిస్తే రెండు కిడ్నీలు  చెడిపోయాయి.

6 నెలల్లో రూ.9లక్షలతో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ చేసుకుంటే తప్ప ప్రాణాలు దక్కవని వైద్యులు తెలిపారు. గత ఏడాది ఉద్యోగం కూడా పోయింది. తల్లిని తీసుకుని అదే ప్రాంతంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఐదు నెలల పాటు అర్చక విధులు నిర్వర్తించాడు. ప్రస్తుతం తిరుపతి రూరల్ తుమ్మలగుంట చామండేశ్వరి అమ్మవారి ఆలయంలో సేవలు అందిస్తున్నాడు.
 
అన్నప్రసాదంతోనే
దేవుడికి సేవ చేసుకునేందుకైనా ప్రాణభిక్ష పెట్టాలని సాయిప్రకాష్ టీటీడీ ఈవోకు లేఖ రాసినా స్పందన రాలేదని సమాచారం. టీటీడీ అన్నప్రసాదంతోనే కడుపు నింపుకుంటున్న ఈ అర్చకుడిని చూసి తోటి రోగులే అయ్యో పాపం అంటున్నారు.
 
ప్రాణాలు నిలబెట్టవచ్చు
టీటీడీ నిధులతో స్విమ్స్ ఆస్పత్రిలో నిరుపేదల కోసం టీటీడీ ప్రాణదాన పథకాన్ని నిర్వహిస్తోంది. ఇందులో ఎంత పెద్ద ఆపరేషన్లు అయినా ఉచితంగా నిర్వహిస్తున్నారు. సాయిప్రకాష్‌కు మానవతా దృక్పథంతో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ ఉచితంగా నిర్వహించ వచ్చు. లేకుంటే బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ నుంచి అయినా సరే ఆపరేషన్‌కు అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరించి, అర్చకుడి ప్రాణాలను నిలబెట్టవచ్చు.
 
 

మరిన్ని వార్తలు