వింత లాజిక్‌లతో రుణాలు.. భారీ మోసాలు

28 Sep, 2016 21:40 IST|Sakshi
సురేష్‌,అంజలి,నరసింహారావు

సాక్షి, సిటీబ్యూరో: రుణాల పేరుతో ఎర వేసి అందినకాడికి దండుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల్ని సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు ఓ ముఠాగా, మరొకరు వేరుగా ఈ స్కామ్‌లకు తెరలేపినట్లు డీసీపీ అవినాష్‌ మహంతి బుధవారం వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా చినచీర్లపల్లికి చెందిన వివాహిత బి.అంజలి, వారాసిగూడకు చెందిన జి.నర్సింహరావు ఓ ముఠాగా ఏర్పడ్డారు. అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలు ఇస్తామంటూ వీరు పత్రికల్లో ప్రకటనలు ఇస్తారు.

రుణాలు తీసుకోవడానికి ఆసక్తిచూపినవారు ప్రకటనల్లో పేర్కొన్న నెంబర్లను సంప్రదించే వారు. ఆ ఫోన్లు రిసీవ్‌ చేసుకునే అంజలి బజాజ్‌ ఫైనాన్స్‌ సంస్థ నుంచి రుణాలు ఇస్తామంటూ నమ్మబలికే వారు. రుణం ఇవ్వడంలో ఓ చిత్రమైన లాజిక్‌ చెప్పేది. నాగోల్‌లో ఉన్న బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ షోరూమ్‌ నుంచి మార్జిన్‌ మనీ చెల్లించడం ద్వారా సులభవాయిదాల పద్ధతిలో వస్తువులు ఖరీదు చేసి తమకు ఇవ్వాలని, వాటిని తాము ఖరీదు చేసి నగదు ఇస్తామని, షోరూమ్‌కు సులభవాయిదాల్లో మొత్తం చెల్లించవచ్చని వల వేసే వారు.

డీఆర్‌డీఎల్‌ ఉద్యోగి ఎ.భుజేష్‌ గౌడ్‌ ఏప్రిల్‌లో అంజలిని సంప్రదించారు. ఈయన అర్హతలు తెలుసుకున్న ఆమె రూ.50 వేల రుణం ఇస్తామనిపేర్కొన్నారు. ఆపై ‘షోరూమ్‌ లాజిక్‌’ చెప్పారు. దీంతో భుజేష్‌ ఆమె చెప్పినట్లు రూ.24 వేల మార్జిన్‌ మనీ చెల్లించి రూ.80 వేల వస్తువులు ఖరీదు చేశారు. వీటిని నర్సింహరావుకు ఇచ్చి పంపారు. కొన్ని రోజులు ఎదురు చూసినా తనకు డబ్బు అందకపోవడంతో పాటు వారి ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో మోసపోయినట్లు గుర్తించారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇరువురు నిందితుల్నీ అరెస్టు చేశారు.

మరోపక్క లాలగూడకు చెందిన ఎస్‌.సురేష్‌కుమార్‌ సైతం రుణాల దగాలకే తెరలేపారు. పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం ద్వారా పలువురిని ఆకర్షించాలని పథకం వేశారు. రుణాల కోసం ప్రకటనల్లో ఉన్న నెంబర్లకు సంప్రదించిన వారికి మాటల వల వేసి, తన బ్యాంకు ఖాతా ఇవ్వడం ద్వారా అందినకాడికి జమ చేయించుకుని మోసాలు చేయడానికి సిద్ధమయ్యారు. ఈయన పత్రికల్లో ఇచ్చిన ప్రకటను చూసిన మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌ వింగ్‌ అప్రమత్తమైంది. సురేష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా... ఎలాంటి అనుమతులు, ఆథరైజేషన్స్‌ లేవని తేలింది. దీంతో ఇతడిని సైతం సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు.


 

మరిన్ని వార్తలు