ఎంత పనిచేశావు నాన్నా..

19 Jul, 2017 02:38 IST|Sakshi
ఎంత పనిచేశావు నాన్నా..

చిన్నారిని బలితీసున్న దారి వివాదం
తొమ్మిది నెలల కుమార్తెనుగొంతు నులిమి చంపిన తండ్రి
తాను కూడా ఆత్మహత్యాయత్నం
విషాదంలో మాధవరం


తండ్రి తనను బైక్‌ మీద ఎక్కించుకొంటుంటే ఎప్పటి లాగే  షికారుకు తీసుకెళ్తున్నాడని సంబర పడిపోయింది ఆ చిన్నారి. బజారుకు తీసుకెళ్లి ఏ చాక్లెట్లో.. బిస్కెట్లో కొనిస్తాడనుకొని ఆశ పడింది. బోసి నవ్వులు నవ్వుకుంది. పాపం.. అభం శుభం తెలియని ఆ పాలబుగ్గల పసిపాపకేం తెలుసు రోజూ తనను గారం చేసే కన్న తం్రడ్రే తన గొంతు నులిమి చంపేస్తాడని..? దాయాదుల మధ్య తలెత్తిన దారి వివాదంతో  మనస్తాపం చెందిన ఓ అభాగ్యుడు తల్లిని హత్తుకొని పడుకొన్న తొమ్మిది నెలల చిన్నారిని పొలానికి తీసుకెళ్లి ప్రాణాలు తీశాడు. తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.

ముక్కుపచ్చలారని బిడ్డను చంపేందుకు ఆ తండ్రికి చేతులెలా వచ్చాయో.. అని స్థానికులు విస్మయం వ్యక్తం చేయగా.. తన చిట్టిచెల్లి ఇక లేదని తెలియని మూడేళ్ల బాలుడు నిర్జీవంగా పడి ఉన్న చిన్నారిని తడుముతూ మురిపెంగా ముద్దాడుతుంటే.. అతడి అమాయకత్వాన్ని చూసి కన్నీటిని ఆపుకోవడం అక్కడున్న ఎవరి తరమూ కాలేదు. గుండెల్ని పిండేసే ఈ విషాద ఘటన దర్శి మండలం మాధవరం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.


తాళ్లూరు:    మండలంలోని మాధవరం గ్రామానికి చెందిన ఇడమకంటి నాగిరెడ్డి, స్వాతి దంపతులకు మూడేళ్ల కుమారుడు అజయ్‌కుమార్‌ (సాయి), తొమ్మిది నెలల వయసు కుమార్తె నందిని ఉన్నారు. కాస్త అమాయకంగా ఉండే  నాగిరెడ్డి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. నాగిరెడ్డికి తనకు బాబాయి వరసయ్యే దాయాదులైన ఇడమకంటి గురువారెడ్డి, పిచ్చిరెడ్డిలతో చాలా రోజులుగా పొలం వద్ద దారి వివాదం నలుగుతోంది. దీనిపై పెద్ద మనుఘల వద్ద పంచాయితీలు జరిగాయి. స్టేషన్‌లో ఫిర్యాదుల వరకు వెళ్లాయి.

రెండు రోజుల క్రితం పొలం వద్ద దారి విషయంలోనే వీరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో దారి విషయం తెలేవరకు తమ ఇంటి ముందుగా ఉన్న దారిలో నడవటానికి వీల్లేదంటూ గురువారెడ్డి, పిచ్చిరెడ్డిలు నాగిరెడ్డి నివాసం చుట్టూ చిల్ల కంపవేసి దారి మూసి వేశారు. దీంతో గ్రామంలో తమకు న్యాయం చేసే వారు లేరంటూ సోమవారం రాత్రి నాగిరెడ్డి తన తల్లిదండ్రులు, భార్య పిల్లలతో కలిసి, గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని గుంటి గంట సత్రానికి వెళ్లారు. విషయం తెలిసిన గ్రామ పెద్దలు, బంధువులు వారి వద్దకు వెళ్లి నచ్చచెప్పి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటి చుట్టూ వేసిన కంప తీసివేశారు. మంగళవారం ఉదయం దాయాదులు మళ్లీ దారి మూసివేయడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చినది. దీంతో నాగిరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

నిద్రిస్తున్న బిడ్డను ఎత్తుకొని..
ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం మంచంపై తల్లి పక్కన పడుకొని నిద్రిస్తున్న కుమార్తె నందినిని ఎత్తుకొని బైక్‌ మీద ఎక్కించుకొని తీసుకెళ్లాడు. పొలానికి వెళ్తున్నానని భార్యకు చెప్పాడు. పాపను రోజూ నాగిరెడ్డి ఇలాగే కాసేపు బజారుకు, పొలానికి బైక్‌పై తీసుకువెళ్తూ ఉంటాడు కదా.. అని తల్లి అభ్యంతరం చెప్పలేదు. ఎంతకీ బిడ్డను తీసుకురాక పోవటంతో స్వాతి తన భర్తకు ఫోన్‌ చేసింది. స్పందన రాలేదు.

తర్వాత మరోకరి సెల్‌ నుంచి ప్రయత్నించింది. తాను పాపను చంపేశానని.. తాను కూడా చనిపోతానని భార్యతో చెప్పినట్లు సమాచారం. దీంతో షాక్‌కు గురయిన స్వాతి బంధువులకు విషయం చెప్పింది. హుటాహుటిన బంధువులు పొలం వద్దకు వెళ్లేసరికి అప్పటికే పాప మృతి చెందింది. నాగిరెడ్డి ఒక వైపు పడి ఉండటం చూసిన వెంటనే ఒంగోలు ప్రవేట్‌ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందిన చిన్నారిని తాతయ్య, నానమ్మలు ఇంటికి తీసుకొచ్చారు. నాగిరెడ్డి పొలంలోని విద్యుత్‌ తీగలు పట్టుకొని ఆత్మహత్యాయత్నం చేయగా.. అంతలో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు తెలిసింది.

చిన్నారి మృతితో విషాదం..
మృతి చెందిన చిన్నారి స్వాతిని తండ్రి పొట్టన పెట్టుకోవటం పట్ల బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముక్కుపచ్చలారని పసిపాపను ఒడిలో పెట్టుకుని స్వాతి గుండెలవిసేలా రోదించింది. అన్న అజయ్‌కుమార్‌  చెల్లిని ముద్దాడుతూ అటూ ఇటూ తిరగటం చూసిన బంధువుల కళ్లు చెమర్చాయి. ఘటన స్థలాన్ని ఎస్‌ఐ మహేష్‌ పరిశీలించారు. దర్శి సీఐ రాఘవేంద్ర పాప మృతదేహాన్ని పరిశీలించి తల్లి స్వాతి, బంధువుల నుంచి వివరాలు సేకరించారు.

>
మరిన్ని వార్తలు