ఆంధ్రుల గుండెచప్పుడు ప్రత్యేక హోదా

8 Sep, 2016 23:03 IST|Sakshi
ఆంధ్రుల గుండెచప్పుడు ప్రత్యేక హోదా
 
 ప్రత్యేక హోదా కోరుతూ ఆకాశవాణి కేంద్రం ఎదుట ధర్నా 
 హాజరైన వైఎస్సార్‌ సీపీ, సీపీఐ, సీపీఎం ముఖ్య నాయకులు 
ముగ్గురు మోసగాళ్లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం
 
విజయవాడ (లబ్బీపేట) : ఆంధ్రుల గుండెచప్పుడు ప్రత్యేక హోదా అని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని నరేంద్రమోదీ, ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు.. పదేళ్లు కాదు 15 ఏళ్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రులను నట్టేట ముంచుతున్నారన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్యాకేజీ.. హోదా.. అంటూ పూటకో మాట చెబుతూ చంద్రబాబు గారడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తేల్చడంతో వైఎస్సార్‌ సీపీతోపాటు వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యాన గురువారం స్థానిక మహాత్మాగాంధీ రోడ్డులోని ఆకాశవాణి  కేంద్రం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్ర విభజన సమయం నుంచి డ్రామాలు ఆడుతున్నారన్నారు. ఒకవైపు విభజన చేయాలని లేఖ ఇచ్చి, మరోవైపు సమైక్యాంధ్రా పేరుతో ఉద్యమం చేయించారని విమర్శించారు. ఇప్పుడు హోదా సంజీవిని కాదని మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. చివరకు హోదా లేదు.. ప్యాకేజీ లేదని, ఐదు కోట్ల మంది ఆంధ్రుల నోట్లో మట్టికొట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు. వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షడు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కావాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నా.. ప్రభుత్వం దున్నపోతుపై వర్షం పడిన చందంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకూ తాము పోరాటం చేస్తామన్నారు.
అరుణ్‌ జైట్లీ ప్రకటనలో 
కొత్తదనం లేదు : మధు
అరుణ్‌ జైట్లీ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ప్రకటించిన అంశాల్లో కొత్తదనమేమీ లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ప్రత్యేక హోదాను నిరాకరిస్తున్నట్లు ప్రకటించడమే కొత్త విషయమన్నారు. పోలవరానికి జాతీయ హోదాను ఎప్పడో ప్రకటిస్తే, దాన్ని మళ్లీ ప్రస్తావించారని పేర్కొన్నారు. కడప ఉక్కు కర్మాగారం, విశాఖ రైల్వే జోన్‌ల ప్రస్తావనే లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో సైతం స్పష్టత లేదని, సహాయం చేస్తామని మాత్రమే చెబుతున్నారన్నారు.
 
 
 
 
 
 
మరిన్ని వార్తలు