కెనరాబ్యాంక్‌కు ముళ్లకంప!

7 Jun, 2017 23:01 IST|Sakshi
కెనరాబ్యాంక్‌కు ముళ్లకంప!

- రైతుల రుణాలు రీ షెడ్యూల్‌ చేయాలని డిమాండ్‌
- సీపీఎం, రైతు సంఘం నాయకుల ఆందోళన    


రాప్తాడు : రైతుల పంట రుణాలు రీషెడ్యూల్‌ చేసి, అసలు వడ్డీ లేకుండా రుణాలు రెన్యూవల్‌ చేసి, ఖరీఫ్‌ సాగుకు కొత్త రుణాలను ఇవ్వాలనే డిమాండ్‌తో సీపీఎం, ఏపీ రైతు సంఘం నాయకులు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నా అధికారుల్లో స్పందన లేకపోవడంతో బుధవారం పలు గ్రామాల రైతులతో కలిసి కెనరా బ్యాంక్‌కు ముళ్ల కంప కొట్టి ధర్నా చేశారు. ఉదయం 9 గంటలకే బ్యాంకు ముందు ధర్నా చేస్తుండటంతో బ్యాంకు అధికారులు వచ్చి చేసేదేం లేక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఎం రాప్తాడు డివిజన్‌ కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ పదేళ్లుగా తీవ్ర వర్షాభావంతో పంటలు పొలాల్లోనే ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.

ప్రస్తుతం రైతుల దగ్గర చిల్లిగవ్వ కూడా లేదని, కరువును దృష్టిలో ఉంచుకుని రైతుల రుణాలను రీషెడ్యూల్‌ చేసి, అసలు, వడ్డీ లేకుండా రైతుల రుణాలను రెన్యూవల్‌ చేయలన్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ధరణిబాబు సిబ్బందితో వచ్చి సీపీఎం ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఎం రాప్తాడు డివిజన్‌ కార్యదర్శి రామాంజినేయులు, కదిరప్ప, పోతులయ్య, బి.చంద్రశేఖర్‌రెడ్డిని బలవంతంగా అరెస్ట్‌ చేశారు. ఒకదశలో వారిని ఈడ్చుకుంటూ స్టేషన్‌ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డికి గాయమైంది. అనంతరం నాయకుల్ని సొంతపూచీకత్తుపై విడుదల చేశారు.     

దిగొచ్చిన అధికారులు : సీపీఎం, రైతు సంఘం నాయకులు చేసిన ధర్నాకు స్పందించిన కెనరాబ్యాంకు చీఫ్‌ మేనేజర్‌ తిరుపతయ్య స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అక్కడ ఎస్‌ఐ ధరణిబాబు, బ్యాంక్‌ సిబ్బంది, సీపీఎం, రైతు నాయకులతో సంప్రదించారు. రేపటి నుంచి బ్యాంక్‌లో రైతుల రుణాలను అసలు, వడ్డీ లేకుండా రెన్యూవల్‌ చేస్తామని హామీ ఇచ్చారు.  

మరిన్ని వార్తలు