కెరటం మాటున.. పోరాటం

8 Aug, 2017 23:54 IST|Sakshi
కెరటం మాటున.. పోరాటం
నిత్యం గంగపుత్రుల జీవన పోరాటం
 వేట మానితే కడుపు నిండదు
 నీట మునిగితే సాయం అందదు
పథకాలున్నా సవాలక్ష నిబంధనలు
 మత్స్యకారులకు అందని సాయం
పథకాల్లో తికమకలు
దీన స్థితిలో గంగ పుత్రుల కుటుంబాలు 
 
నరసాపురం:
నీటి మధ్యే వారి జీవనం.. నిత్యం ఎదురొచ్చే అలలతో పోరాటం.. రెక్కాడితే కాని డొక్కాడని మత్స్యకారులు. వేట కెళ్లని రోజు పస్తులుండాల్సిందే. ప్రమాదపుటంచున కష్టంతో కూడుకున్న ఈ వృత్తిలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ప్రకృతి విపత్తులు తుఫాన్‌లు, వరదల రూపంలో కాటేస్తాయి. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా నీటి మధ్య సాగించే బతుకు పోరాటంలో ఏ క్షణాన్నైనా మృత్యువు కబళిస్తుంది. 
    వేట సాగిస్తూ మృతి చెందిన మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారంలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. అసలు ఎంత పరిహారం వస్తుందనే విషయంలో కూడా ఖచ్చితమైన స్పష్టత లేదు. వేట సమయంలో మృతి చెందిన మత్స్యకారులకు ఇచ్చే ఆర్ధికసాయం విషయంలో గత ఐదేళ్లుగా అనేక మార్పులు వచ్చాయి. మొదట్లో రూ 30వేలు, రూ 40వేలు ఇచ్చేవారు. తరువాత రూ. 2 లక్షలు ఇస్తూ వచ్చారు. మళ్లీ రూ. 5 లక్షలు అన్నారు కానీ ఎవరికీ పైసా ఇచ్చిన పాపాన పోలేదు. చనిపోయిన వ్యక్తికి సంబంధించి పోస్టుమార్టమ్‌ నివేదికలు, ఫోరెన్సిక్‌ నివేదికలు, అసలు అతను వేటసాగించే మత్స్యకారుడే అని తేల్చిచెప్పడానికి అనేక ఆధారాలు చూపాలి. జీవించి ఉన్నన్నాళ్లూ నీటిలో బతుకు పోరాటం చేస్తాడు. తీరా అదే క్రమంలో మృత్యువాత పడితే ప్రభుత్వం నుంచి వచ్చే ఆసరా కోసం వారి కుటుంబాలు కూడా ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ పోరాటం చేయాల్సి వస్తోంది. ఇదీ జిల్లాలో వేట సాగించే మత్స్యకారుల దీనస్థితి. ప్రత్యేకంగా వీరి బాగోగులు చూడాల్సిన మత్స్యశాఖ అలంకార ప్రాయంగా మారింది. చెరువులకు లైసెన్స్‌లు ఇప్పిండంలో చూపించే శ్రద్దలో ఒక వంతైనా మత్స్యకారులపై పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. అవినీతి ఊబిలో కూరుకుపోయిన మత్స్యకార సొసైటీలు, మత్స్యకారుల సంక్షేమాన్ని ఎప్పుడో పక్కన పెట్టేశాయి. 
 
పరిహారంలో స్పష్టతా లేదు..
   వేట సాగిస్తూ మృతి చెందిన మత్స్యకారులకు గతంలో పెద్దగా పరిహారం అందేది కాదు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ విషయంలో కాస్త కదలిక వచ్చింది. అప్పటి వరకూ రూ. 20 వేలు, రూ. 30 వేలు ఇచ్చే నష్టపరిహారాన్ని రూ. 1 లక్షకు పెంచారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో రూ. 2లక్షలు చేశారు. రూ. 1 లక్ష కేంద్ర ప్రభుత్వం, మరో రూ. 1 లక్ష రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ప్రస్తుతం కూడా అదే విధానం అమలవుతోంది. ప్రస్తుతానికి అందుతున్నది రూ. 2 లక్షలే. అది కూడా రావడానికి 18 నెలలు పైనే సమయం పడుతోంది. అదీ కొంత మందికే. కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ ఫిషరీష్‌ డెవలెప్‌మెంట్‌ బోర్డు(ఎన్‌ఎఫ్‌డీబీ) ద్వారా రూ. 1 లక్ష పరిహారం ఇస్తుంది. కేంద్రం నుంచి వస్తున్న సాయం మాత్రం ముందుగా బాధితులకు  అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కోసం మత్స్యకార కుటుంబాలు ఎదురుచూడాల్సి వస్తోంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చింది. కానీ ఇది జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. చంద్రన్న బీమా పథకం కింద వేట సమయంలో మృతిచెందే మత్స్యకారులకు ఇచ్చే పరిహారాన్ని చేర్చారు. ఈ విధానం పక్కనున్న కృష్ణా జిల్లా, నెల్లూరు ప్రాంతాల్లో అమలవుతోంది కానీ ఇక్కడ మాత్రం జరగడం లేదు. పైపెచ్చు ఈ పథకంలో ఏడాదికి రూ. 15లు చెల్లించాలి. నిరక్షరాస్యులైన మత్స్యకారులకు దీనిపై సరైన అవగాహన లేదు. మత్స్యశాఖ అధికారులు కూడా అవగాహన పెంచే ప్రయత్నం చేయడంలేదు.
 
పరిహారం కోసం ఎన్నో తిప్పలు..
జిల్లాలో నరసాపురంలో 19 కిలోమీటర్లు మేర తీరప్రాంతం విస్తరించి ఉంది. 20 తీర గ్రామాల్లో పూర్తిగా చేపల వేట జీవనాధారం చేసుకుని జీవించే మత్స్యకారులు ఉన్నారు. నరసాపురం ప్రాంతంలోనే 25వేల కుటుంబాల వారు వేట సాగిస్తారు. సముద్రంలోనే కాకుండా గోదావరి , డ్రెయిన్‌లు, ఉప్పుటేరుల్లో వేట సాగించే సంప్రదాయ మత్స్యకారులు ఉన్నారు. జిల్లాలో మొత్తం వేట సాగించే మత్స్యకారుల సంఖ్య దాదాపు 60వేలు పైనే ఉంటుంది. గత మూడేళ్లలో ఒక్క నరసాపురం ప్రాంతంలోనే వేట సాగిస్తూ మత్యువాత పడినవారి సంఖ్య 16 వరకూ ఉంది. కానీ ఇందులో కేవలం ఆరుగురికి మాత్రమే నష్టపరిహారం అందింది. ఎందుకంటే పరిహారం అందిపుచ్చుకునే విషయంలో బాధితులకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముందు అతనికి గుర్తింపుకార్డు ఉండాలి. జిల్లాలో 260 మత్స్యకార సొసైటీలు ఉన్నాయి. ఇందులో 40వేల మంది వరకూ సభ్యులు ఉన్నారు. జిల్లాలో 60వేల మందిపైనే వేట సాగించే వారు ఉంటే, సొసైటీల్లో సభ్యులుగా ఉన్న వారిసంఖ్య తక్కువగా ఉంది. అలాగే డ్రెయిన్‌లు, ఉప్పుటేరుల్లో వేట సాగించే సంప్రదాయ మత్స్యకారుల్లో చాలామందికి గుర్తింపు కార్డులు లేవు. దీంతో వారికి సాయం అందడంలేదు. అదీకాక ఎవరైనా మత్స్యకారుడు మృతి చెందితే ముందుగా పోలీసు కేసు నమోదు కావాలి. తరువాత నష్టపరిహారం కోసం పోస్టుమార్టమ్, ఫోరెన్సిక్‌ నివేదికలు తదతర 16 రకాల డాక్యుమెంట్స్‌ను సమర్పించాల్సి ఉంటుంది. వేటసాగించే మత్స్యకారుల్లో 90శాతం మంది అక్షరజ్ఞానంలేని వారు. వేలిముద్ర వేయడం తప్ప మరేమీ తెలియదు. దీంతో అధికారుల చుట్టూ తిరిగే కష్టాలు పడలేక, ఆర్ధికసాయం అందుకోలేక అవస్థలు పడుతున్నారు. 
 
 తండ్రి పోవడంతో అనాధులుగా మిగిలిన పిల్లలు 
మొగల్తూరు మండలం ముత్యాలపల్లి చింతరేవు గ్రామానికి చెందిన కొల్లాటి పెంటయ్య(50)కు వేట తప్ప మరేమీ తెలియదు. గొంతేరు డ్రెయిన్‌లో వేట సాగించుకుని రాగా.. చేపలను భార్య మారెమ్మ గంపలో పెట్టుకుని ఇళ్లకు తిరిగి అమ్ముకునేది. 2015 జూలై 8వ తేదీ అర్ధరాత్రి గొంతేరు డ్రెయిన్‌లోకి వేటకు వెళ్లిన పెంటయ్య తిరిగిరాలేదు. మరునాడు పడవ పక్కన శవమైతేలాడు. అతని మృతితో భ్యార్యా పిల్లలూ అనాథలయ్యారు. వారికి ఒక్క రూపాయి పరిహారం అందలేదు. ఎందుకంటే పెంటయ్య సొసైటీలో సభ్యుడు కాదు, మత్స్యశాఖ నుంచి ఎలాంటి గుర్తింపుకార్డు లేదు. దీంతో కుటుంబం వీధిన పడింది. భర్త మృతి, పిల్లల బాధ్యతతో మారెమ్మ కష్టం రెట్టింపు అయ్యింది. చేపలు అమ్ముకుని కుటంబాన్ని పోషించుకుంటోంది. చదువులు కూడా లేకుండా అన్నా చెల్లెళ్లు వెంకటేశ్వరరావు, జ్యోతి ఇంటివద్దనే ఉంటున్నారు. 
 
17 ఏళ్లకే కాటికి..
నరసాపురం మండలం ధర్బరేవు గ్రామానికి చెందిన కొల్లు వనమరాజు కుటుంబం 17 ఏళ్ల కొడుకుని దూరం చేసుకుని విలపిస్తోంది. కేవలం మూడు వారాల కిత్రం జరిగిన  ప్రమాదంలో ఆ కుటుంబానికి పైసా సాయం దక్కలేదు. వనమరాజు కుటుంబం మొత్తం వేటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గోదావరిలోను, డ్రెయిన్స్‌లోను వేటసాగిస్తాడు. సముద్రంలో బోట్లపై వనమరాజు వేటకు వెళతాడు. అతని పెద్ద కొడుకు వెంకట్‌ గతనెల 10వ తేదీన దర్బరేవు డ్రెయిన్‌లో వేటసాగిస్తూ ప్రమాదానికి గురై మృతి చెందాడు. వనమరాజుకు కూడా ఇదివరకటిలా ఆరోగ్యం సహకరించడం లేదు. దీంతో ముందుముందు ఎలా బ్రతకాలా? అని ఆవేదన చెందుతున్నాడు. ఇతనికి మరో కొడుకు ఉన్నా అతను కూడా వేటే సాగిస్తున్నాడు. ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేసి ఆదుకుంటే రెండో కొడుకును వేట మానిపించి చదివించుకుంటానని దీనంగా అర్ధిస్తున్నాడు. 
 
 
మత్స్యకారుల కష్టాలు పట్టడంలేదు 
బర్రి శంకరం, వైఎస్సార్‌సీపీ మత్స్యకారసంఘం రాష్ట్రనేత
మత్స్యకారుల కష్టాలు ప్రభుత్వానికి పట్టడంలేదు. మత్స్యశాఖ అలంకారప్రాయంగా మారింది. అసలు జిల్లాలో వేట సాగించే మత్స్యకారులు ఎంతమంది ఉన్నారు. సముద్రంలో వేట సాటించేవారు ఎందరు, సంప్రదాయవేటలో ఉన్న వారు ఎందరు అనే లెక్కలు అసలు మత్స్యశాఖ అధికారుల వద్ద లేనేలేవు. మత్స్యకార సొసైటీలు ఉపయోగం లేకుండా ఉన్నాయి. వేట సమయంలో మృతి చెందిన మత్స్యకారులకు రూ 5 లక్షలు ఆర్ధిక సహాయం ఇవ్వాలి
 
ఎంత తిరిగినా సాయం అందలేదు
తిరుమాని సోమరాజు, మొగల్తూరు
నేను వేట చేసుకుని బతుకుతాను. మా అన్నయ్య వనమయ్య కూడా వేట చేసేవాడు. 2011లో సముద్రంలో వేటకు వెళ్లి అన్నయ్య చనిపోయాడు. రెండు రోజుల వరకూ శవం కూడా కనిపించలేదు. మా అన్నయ్యకు ముగ్గురు కూతుళ్లు. అన్నయ్య చనిపోయే నాటికి ఒక కూతురికే పెళ్లి చేశారు. ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని రూ. 14వేలు వరకూ ఖర్చు చేసి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలింతలేదు. తరువాత ఇద్దరు కూతుళ్ల òపెళ్లిళ్లు నేనే చేశారు. ప్రభుత్వం నుంచి సాయం అందితే ఉపయోగపడేది. ప్రస్తుతం మా వదిన సుభద్రమ్మ ఆ పనీ, ఈ పనీ చేసుకుని బతుకుతోంది. 
 
జాప్యం జరుగుతోంది
 అండ్రాజు చల్లారావు, మత్స్యకార సొసైటీల సంఘం జిల్లా అధ్యక్షుడు
వేట సమయంలో మృతి చెందిన మత్స్యకారులకు సాయం అందే విషయంలో జాప్యం జరుగుతోంది. కేంద్ర సాయం ముందుగా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆలస్యమవుతోంది.  ఈ విషయమై అనేక సార్లు మత్స్యశాఖ అధికారులను కలవడం జరిగింది. ప్రస్తుతం వేట సాగిస్తూ మృతి చెందిన మత్స్యకారులకు కేంద్ర ప్రభుత్వం రూ. 1 లక్ష, రాష్ట్ర ప్రభుత్వం రూ. 1 లక్ష ఇస్తుంది. రూ. 5 లక్షల సహాయం ఇంకా అమలు కావడంలేదు. ప్రభుత్వ పథకాలను మత్ప్యకారులు వినియోగించుకునేలా సొసైటీల ద్వారా అవగాహన తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము.
 
 పశ్చిమలోనే మరీ దారుణం
కె.శ్రీనివాస్, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మచిలీపట్నం
రూ. 5 లక్షలు నష్టపరిహారం కృష్ణా జిల్లాలో అందుతోంది. పశ్చిమలో పరిస్థితి దారుణం. సముద్రంలోనే కాకుండా గోదావరి, డ్రెయిన్స్, ఉప్పుటేరుల్లో ఇక్కడ ఎక్కువమంది వేట సాగిస్తారు. కానీ వారికి ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదు. వేట నిషేధ సమయంలో కూడా ఎలాంటి పథకాలు అందకుండా నష్టపోతున్నారు. జిల్లాలో ముఖ్యంగా మత్స్యశాఖ పనితీరు దారుణంగా ఉంది. 
 
చంద్రన్న బీమా అమల్లో ఉంది
కొత్త రమణకుమార్, మత్స్యశాఖ అధికారి నరసాపురం
చంద్రన్న బీమా పథకం మత్స్యకారులకు అమల్లో ఉంది. ఏడాదికి రూ. 15లు చెల్లించాలి. ఈ పథకంలో రూ. 5 లక్షలు నష్టపరిహారం వస్తుంది. నిబంధనల మేర దరఖాస్తు చేసుకున్న వారందరికీ నష్టపరిహారం అందుతుంది. ఎవరికైనా అందకపోతే మమ్మల్ని సంప్రదిస్తే కారణాలు తెలుపుతాము
మరిన్ని వార్తలు