మారిన విద్యాశాఖ క్యాలెండర్‌

11 Aug, 2016 01:11 IST|Sakshi
మారిన విద్యాశాఖ క్యాలెండర్‌
పాఠశాల విద్య స్థాయిలో మెరుగైన ఫలితాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటి వరకు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకూ ఏప్రిల్‌లో వార్షిక పరీక్షలు నిర్వహించి వెంటనే వేసవి సెలవులు ప్రకటించేవారు. అయితే ఈ విధానానికి స్వస్తి పలుకుతోంది. ఇకపై ఆయా తరగతులకు పరీక్షలు మార్చిలోనే నిర్వహించి, అనంతరం వేసవి సెలవులు వరకూ అంతే దాదాపు 40 రోజుల పాటు పై తరగతుల బోధన చేపట్టాలని నిర్ణయించింది.                      – బాలాజీచెరువు(కాకినాడ)
ఇప్పటి వరకు ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు వార్షిక పరీక్షలు ఏప్రిల్‌లో, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి మూడో వారంలో నిర్వహించేవారు. వేసవి తీవ్రత, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణతో తొమ్మిదో తరగతి వరకు ఒంటిపూట బడుల్ని నిర్వహిస్తున్నారు. ఫలితంగా తరగతుల నిర్వహణ, బోధన సవ్యంగా సాగక.. ఆయా తరగతుల విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ పరిస్థితులపై అధ్యయనం చేసిన విద్యాశాఖ ఇకపై ఈ విద్యాసంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకూ మార్చి ఏడు నుంచి 22వ తేదీ వరకూ వార్షిక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. పరీక్షలు ముగిసిన వెంటనే పైతరగతులకు సంబంధించిన బోధన చేయించాలని 2016–17 విద్యా విషయక క్యాలండర్‌లో పేర్కొంది. 6 నుంచి 9వ తరగతి వరకే రాష్ట్ర స్థాయిలో, ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ జిల్లా స్థాయిలో ప్రశ్నాపత్రాలు రూపొందించనుంది.
ఆరోగ్య, వ్యాయామ విద్యకు ప్రాధాన్యం..
∙ప్రాథమిక పాఠశాలల్లో ఆరోగ్య, వ్యాయామ విద్యకు మూడు పీరియడ్లకు బదులు ఆరు పీరియడ్లు కేటాయించారు.
∙విలువల విద్య, జీవన నైపుణ్యాలు, కళలు, సాంస్కృతిక విద్యకు సంబంధించి మూడు పీరియడ్లు, గత సంవత్సరం వరకూ సాధారణ పద్ధతిలో జరిగేవి. వీటిని ఇక నుంచి తప్పని సరిగా నిర్వహించాలని అదేశాలు జారీ చేశారు.
∙సెప్టెంబర్‌ వరకూ జరిగే సిలబస్‌ ఆధారంగా సెప్టెంబర్‌ 21 నుంచి 28వ తేదీ వరకూ త్రైమాసిక పరీక్షలు, (ఎస్‌ఏ–1) నిర్వహించి సెప్టెంబర్‌  30 నుంచి అక్టోబర్‌ 11వ తేదీ వరకూ దసరా సెలవులు ప్రకటించారు.
∙జనవరి మూడో తేదీ నుంచి పదో తేదీ వరకూ అర్ధ వార్షిక ఎస్‌ఏ–2 పరీక్షలు నిర్వహించి, జనవరి 11వ తేదీ నుంచి 19వతేదీ వరకూ సంక్రాంతి సెలవులు ప్రకటించారు.
∙మార్చి ఏడోతేదీ నుంచి 22వ తేదీ వరకూ వార్షిక పరీక్షలు ఎస్‌ఏ–3 జరిపి వేసవి సెలవులు ప్రకటించే వరకూ పై తరగతులకు సంబంధించి సంసిద్ధత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
∙పాఠశాలల పనిగంటల్ని విద్యాహక్కు చట్ట ప్రకారం మార్పు చేసి, ప్రతి పాఠశాలలో వార్సికోత్సవాలు తప్పనిసరిగా నిర్వహించడంతోపాటు ఆ వేడుకల్లో విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలను పాఠశాల ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు తెలియజేయాలి.
∙వివక్ష తగ్గించే చర్యలో భాగంగా బాలికాచేతన కార్యక్రమాల్ని పొందుపరిచారు. 
>
మరిన్ని వార్తలు