వేధింపులే కారణమా..?

31 Jan, 2017 02:13 IST|Sakshi

సంస్థాన్‌ నారాయణపురం: ఆ విద్యార్థి చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండేవాడు..సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లి అనారోగ్యం బారిన పడ్డాడు. రెండు రోజుల క్రితమే కాలేజీకి వచ్చి పరీక్ష కూడా రాశాడు. తోటి విద్యార్థులు వేధించారో. కాలేజీలో ఇమడలేకనో తెలియదు కానీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. సర్వేల్‌ గురుకుల విద్యార్థి మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు, విద్యార్థులు, గ్రామాస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం దోసపహడ్‌ గ్రామానికి చెందిన సల్వోజు మధునాచారి, సుజాతల కుమారుడు శేఖర్‌(17) సర్వేల్‌ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ విభాగంలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సంక్రాంతి పండగ సెలవులకు వెళ్లి అనారోగ్యం బారిన పడడంతో ఇంటి వద్దనే ఉన్నాడు. గత శనివారం కళాశాలకు ఉదయం వచ్చి పరీక్ష రాశాడు. కళాశాలకు వచ్చినప్పటికీ శేఖర్‌కు ఆడ్మిట్‌ పాస్‌ను అందజేయలేదు. సోమవారం తెల్లవారుజామున శేఖర్‌ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లారెడ్డిగూడెం వ్యవసాయ భూముల వద్దకు వెళ్లాడు. అక్కడే రైతుల గుడిసెల్లో దాచుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమీప రైతులు చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే శేఖర్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

తండ్రికి ఫోన్‌ చేసి..
సోమవారం ఉదయం 5గంటలకు శేఖర్‌ తండ్రికి ఫోన్‌ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. తండ్రి నేను వస్తున్నాను, అంతపని చేయకు అని చెప్పి సర్వేల్‌కు బయలుదేరాడు. ఇదే విషయం తండ్రి కళాశాలకు సమాచారం ఇచ్చాడు. అధ్యాపకులు, తోటి విద్యార్థులు శేఖర్‌ను వెతకడం మొదలు పెట్టారు. అప్పటికే కళాశాల నుంచి శేఖర్‌ నడుచుకుంటూ వెళ్లిపోవడంతో వారికి కనిపించలేదు. 5 నుంచి 8 గంటల వరకు తండ్రికి అప్పుడప్పుడు ఫోన్‌ చేస్తూనే ఉన్నాడు.  రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం అక్కడ విద్యార్థి మరణించి ఉండటాన్ని గమనించి గ్రామాస్తుల, పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీస్‌లు, కళాశాల ప్రిన్సిపాల్‌ రాఘవరావు అక్కడికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ మల్లేశ్వరి కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.

కారణాలపై పోలీసుల అన్వేషణ
శేఖర్‌ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు అన్వేషిస్తున్నారు. తోటి విద్యార్థుల వేధించారా..?, గురుకులంలో ఇమడలేక మనస్తాపం చెందాడా, ఇంకా ఎమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
 
ఇక్కడ చదవలేనని చెప్పాడు
తోటి విద్యార్థుల వేధింపులు ఎక్కువయ్యాయని, నేను ఇక్కడ చదవలేనని చెప్పాడని శేఖర్‌ తల్లితండ్రి మధనాచారి, సూజాత  తెలిపారు. సర్ది చెప్పి పంపించామని, ప్రిన్సిపాల్‌ దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు. అయినా విద్యార్థుల వేధింపులు ఆగలేదని ఆరోపించారు. ఉదయం ఫోన్‌ చేసినప్పుడు తండ్రి నేను వస్తున్నానని, ఇంటికి తీసుకెళ్తానని, మళ్లీ పరీక్షలు రాసేటప్పుడే కళాశాలకు వెళ్లు అని చెప్పానని తెలిపారు.విద్యార్థులు వేధింపులకు గురి చేస్తున్నా ప్రిన్సిపాల్, అధ్యాపకులు పట్టించుకోనందు వల్లే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. తమ కుమారుడు బాగా చదివే వాడని, ఎవరితోనూ గొడవలు, వాగ్వాదానికి దిగిన సందర్భాలు లేవన్నారు.

మృతుడి బంధువుల ఆందోళన  
విద్యార్థుల వేధింపులు, కళాశాల నిర్లక్ష్యం వల్ల  శేఖర్‌(17) మృతి చెందాడని చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సోమవారం రాత్రి మృతుడు బంధువులు అందోళనకు దిగారు. గురుకుల పాఠశాల ఏజీవో టీఎస్‌ ప్రసాద్‌ అక్కడకు చేరుకుని వారికి నచ్చచెప్పాడు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, ఈ విషయంపై ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు.

మరిన్ని వార్తలు