విద్యార్థిని మింగిన ‘నాగావళి’

7 Sep, 2017 12:04 IST|Sakshi
విద్యార్థిని మింగిన ‘నాగావళి’

శ్రీకాకుళం సిటీ:
కుమారుడిపై కన్నవారు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. నాగావళి నదిలో ఈతకు దిగిన యువకుడిని మృత్యువు కాటేసింది. తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన జంపాన హరికృష్ణ చౌదరి (23 శ్రీకాకుళం సమీపంలోని పాత్రునివలస వద్ద ఉన్న శ్రీసాయి డెంటల్‌ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇదే కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న జయశంకర్‌తో కలిసి హరికృష్ణ మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో శ్రీకాకుళం నగరాన్ని ఆనుకొని ఆదివారంపేట వద్ద ఉన్న నాగావళి నదిలో ఈతకు వెళ్లాడు. అయితే జయశంకర్‌కు ఈత రాకపోవడంతో నది ఒడ్డునే ఉండిపోయాడు.

హరికృష్ణచౌదరి నదిలోకి దిగి ఈత కొడుతూ స్నానం చేశాడు. అయితే కొద్దిసేపటి తరువాత కనిపించకపోవడంతో నది పక్కన ఉన్న జయశంకర్‌ ఆందోళనకు గురయ్యాడు. అక్కడి నుంచి కళాశాలకు చేరుకొని తోటి విద్యార్థులకు, కళాశాల యాజమాన్యానికి విషయాన్ని తెలియజేశాడు. రెండో పట్టణ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే రాత్రి వేళ కావడంతో ఎవరూ ఏం చేయలేకపోయారు. సీఐ ఎం తిరుపతిరావు, ఎస్‌ఐ ప్రసాద్‌లు బుధవారం ఉదయం ఈతగాళ్ల సాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టగా హరికృష్ణచౌదరి శవమై కనిపించాడు. సమాచారాన్ని గుంటూరు జిల్లాలో ఉంటున్న అతని తల్లిదండ్రులకు పోలీసులు తెలియజేశారు. హరి కృష్ణ మృతితో తోటి విద్యార్థులు తీవ్ర విషా దానికి గురయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించామని, మృతుడి మేనమామ ఎం.వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు