హైస్కూల్‌లో బడి‘వాత’..!

30 Aug, 2016 23:34 IST|Sakshi
గార్లొడ్డు పాఠశాల వద్ద ఉపాధ్యాయులతో వాగ్వాదం
  • కారేపల్లి హైస్కూల్‌లో విద్యార్థిని చితకబాదిన పీఈటీ
  • గార్లొడ్డులో దండించిన ఉపాధ్యాయుడిపై డీఈఓకు ఫిర్యాదు

  • కారేపల్లి: అల్లరి చే శాడని ఓ విద్యార్థిని పీఈటీ చితక బాదిన ఘటన మంగళవారం కారేపల్లి హైస్కూల్‌లో చోటు చేసుకుంది. బాధిత విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం..7వ తరగతి చదువుతున్న కానుగంటి సోమేష్‌ అనే విద్యార్థి అల్లరి చేశాడని పీఈటీ పవన్‌ కుమార్‌ బెత్తంతో వీపుపై వాతలు పడేలా చితకబాదాడు. సోమేష్‌ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లి స్వరూపకు చెప్పాడు. వీపుపై ఎర్రగా మూడు వాతలు తేలి ఉండడంతో..ఆమె విద్యార్థిని తీసుకొని విలేకరుల ఎదుట గోడు వెళ్లబోసుకుంది. పాఠాలు నేర్పుతారని బడికి పంపిస్తే..ఇలా వీపు పగులగొడతారా..? అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై పీఈటీ పవన్‌ కుమార్‌ను వివరణ కోరగా..మంగళవారం హైస్కూల్‌ గ్రౌండ్‌లోకి ఓ పాము వచ్చింది. దీంతో విద్యార్థులంతా దాని వెంటపడి గోలగోల చేశారు. ఈ క్రమంలో వీరిని నియంత్రించేందుకు కొంచెం తొందరపడ్డానని తెలిపారు.
    గార్లొడులో గ్రామస్తుల ఆందోళన
    ఏన్కూరు: గార్లొడ్డు ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి విద్యార్థి ధరావత్‌ బాలాజీ లెక్కలు సరిగ్గా చేయడం లేదని ఉపాధ్యాయుడు ప్రభాకర్‌ సోమవారం బెత్తంతో దండించాడు. బాలుడి పిరుదులపై గట్టిగా కొట్టడంతో వాతలు తేలాయి. పాఠశాల ముగిశాక ఏడేస్తూ ఇంటికొచ్చిన సదరు విద్యార్థి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. వారు, గ్రామస్తులు మంగళవారం ఉదయం పాఠశాల వద్దకు వచి..ఆందోళన చేశారు. సదరు ఉపాధ్యాయుడు రాకపోవడంతో డీఈఓ రాజేష్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో ఎంఈఓకు జయరాజ్‌ వచ్చి వివరాలు సేకరించారు.

మరిన్ని వార్తలు