ఓ ఐడియా.. ర్యాంక్‌ సాధించిపెట్టింది

21 Sep, 2016 22:12 IST|Sakshi
విద్యార్థిని సన్మానిస్తున్న రమణాచారి, డీఈఓ తదితరులు(ఫైల్‌)
  • జిల్లా అంతటా ఫైవ్‌ ‘సీ’ని అమలు చేసే యోచనలో డీఈఓ రమేష్‌బాబు
  • మెదక్‌: ఓ ఐడియా జీవితాన్నే మార్చేసిందన్నట్టు ప్రభుత్వ పాఠశాలలో చదివి టెన్త్‌లో 9.8 గ్రేడ్‌ సాధించిన ఓ పేదింటి విద్యార్థి అదేపాఠశాల పూర్వ విద్యార్థి అయిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అభినందనలు అందుకొని నగదుపురస్కారం అందుకున్నాడు.

    అంతేకాకుండా టెన్త్‌లో తాను 9.8 గ్రేడ్‌ సాధించేందుకు ఫైవ్‌ ‘సీ’ కి దూరంగా ఉండటమే కారణమని చెబుతూ.. జిల్లా అంతటా ఆ విధానాన్ని అమలయ్యేలా విద్యాశాఖలో సరికొత్త ఆలోచన రేకెత్తించాడు. అసలు ఫైవ్‌ సీ అంటే ఏమిటని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అడిగిన ప్రశ్నకు ఆ బాలుడు వివరణ తన మాటల్లోనే..

    ‘విద్యార్థులంతా నాలానే ఫైవ్‌ సీని వదిలేయండి. దీంతో ఉన్నత శిఖరాలు చేరుకోవడం ఖాయం. మెదక్‌ ప్రాంతంలో చదివిన మెజార్టీ విద్యార్థులకు ఫైవ్‌ సీ గురించి తెలుసని, ప్రస్తుత డీఈఓ  రమేష్‌బాబు పట్టణంలోని డైట్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తుండగా అనేక పాఠశాలలు తిరుగుతూ, విద్యార్థులకు వాటి గురించి వివరించారు. ఫైవ్‌ సీ అంటే.. ఇంట్లోని కేబుల్‌ టీవీ చూడటం మానాలి, సెల్‌ఫోన్‌ వాడకపోవడం, చాటింగ్‌ చేయకపోవడం, క్రికెట్‌ చూడకపోవడం, బద్దకాన్ని వదిలేయడం’ ఇవే ఫైవ్‌ సీ అని పేర్కొన్నాడు.

    వీటిని వదిలేసిన ఏ విద్యార్థి అయినా తన లక్ష్యన్ని చేరుకోవడం ఖాయమని నాడు ప్రిన్సిపాల్‌గా ఉన్న రమేష్‌బాబు పదేపదే బోధించేవారన్నారు. అతని మాటలు విన్న రమణాచారి అది ముమ్మాటికి నిజమని, ప్రస్తుత హైటెక్‌ యుగంలో వాటికి దూరంగా ఉంటేనే విద్యార్థులు జీవితంలో రాణించగలరన్నారు. ప్రస్తుతం డీఈఓగా ప్రమోషన్‌ పొందిన రమేష్‌బాబు ఈ ఫైవ్‌ సీని జిల్లా అంతటా ప్రచారం చేసే పనిలో పడ్డట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు