ఆసక్తి చూపని విద్యార్థులు!

6 Jul, 2017 22:32 IST|Sakshi
ఆసక్తి చూపని విద్యార్థులు!

– 214 సీట్లకు 93 మంది హాజరు
– ఇదీ కార్పొరేట్‌ విద్య పథకం దుస్థితి


అనంతపురం ఎడ్యుకేషన్‌ : భర్తీ చేయాల్సిన సీట్లు 232. వచ్చిన దరఖాస్తులు 1960. చివరగా కౌన్సెలింగ్‌ హాజరైన విద్యార్థులు 93 మంది ... ఇదీ కార్పొరేట్‌ విద్య పథకం దుస్థితి. దీన్నిబట్టి చూస్తుంటే ఏడాదికి రూ.35 వేలు ఖర్చు చేసి ఉచితంగా చదివిస్తామంటే కూడా పిల్లలు ఆసక్తి చూపడం లేదనేది స్పష్టమవుతోంది. మరోవైపు ప్రభుత్వ అలసత్వం కారణంగానే ఈ దుస్థితి నెలకొందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పిల్లలకు ఫీజు చెల్లించలేక చదువు మానేసిన కుటుంబాలు జిల్లాలో అనేకం. ఇలాంటి జిల్లాకు వరంగా మారిన కార్పొరేట్‌ విద్య పథకం చతికిల పడింది.

232 సీట్లు భర్తీ చేయాల్సి ఉండగా తొలివిడతా 214 సీట్ల ప్రవేశాలకు గురువారం స్థానిక ఎస్సీ నంబర్‌ 4 వసతి గృహంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఆయా కళాశాలలకు విద్యార్థులను కేటాయిస్తూ ప్రవేశ పత్రాలు అందజేశారు. అయితే 214 సీట్లకు గానూ కేవలం 93 మంది మాత్రమే హాజరయ్యారంటే ఈ పథకం ఉపయోగం అర్థం చేసుకోవచ్చు. ఎస్సీ విద్యార్థులు 103 మందికి 56, మైనార్టీ విద్యార్థులు 15 మందికి 6,  బీసీ విద్యార్థులు 54 మందికి 13, ఈబీసీ విద్యార్థులు 11 మందికి 4, ఎస్టీ విద్యార్థులు 28 మందికి 14 మంది హాజరయ్యారు. ఇక బీసీసీ విద్యార్థులు ముగ్గురికి కూడా ఒక్కరూ హాజరుకాలేదు. సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రోశన్న, బీసీ సంక్షేమశాఖ డీడీ రమాభార్గవి, గిరిజన సంక్షేమశాఖ జిల్లా అధికారి కొండలరావు, సాంఘిక సంక్షేమ జిల్లా అధికారి లక్ష్మానాయక్‌ తదితరులు కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు.  

ఆలస్యమే ప్రధాన కారణం : ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో చదివి పదో తరగతిలో బాగా ప్రతిభ చాటి ఆర్థిక ఇబ్బందిగా ఉన్న కుటుంబాలకు కార్పొరేట్‌ విద్య పథకం చాలా ఉపయోగకరం. అయితే ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల చాలామందికి ఉపయోగం లేకుండాపోయింది. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ. 35 వేలు ఫీజు చెల్లించడంతో పాటు విద్యార్థి ఖర్చుకు రూ. 3 వేలు ప్రభుత్వమే చెల్లిస్తుంది. జూన్‌ 1 నుంచే ఇంటర్‌ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. సరిగ్గా 35 రోజుల తర్వాత ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. దీంతో ఇప్పటికే చాలామంది వారికి అనుకూలమైన కళాశాలల్లో అప్పుసప్పులు చేసి చేరిపోయారు. దీనికితోడు పేరుకు కార్పొరేట్‌ పథకం అని ఉన్నా...జాబితాలో అన్నీ లోకల్‌ కళాశాలల పేర్లే ఉండటం కూడా విద్యార్థులు చేరకపోవడానికి మరో కారణమంటూ విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా