బుడతడి కిడ్నాప్‌ ‘కథ’

26 Aug, 2016 21:07 IST|Sakshi
కోల్‌సిటీ : ఆటపాటలతో హాయిగా గడపాల్సిన వయసులో కుటుంబానికి దూరమవుతూ హాస్టళ్లలో చిన్నారులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని ఈ సంఘటన కళ్లకు కట్టింది. హాస్టల్‌లో చేరడం ఇష్టంలేని ఓ బుడతడు చెప్పిన పిట్టకథ పోలీసులు, తల్లిదండ్రులను కాసేపు ఆందోళనకు గురిచేసింది. గోదావరిఖనిలో ఐదో తరగతి చదువుతున్న ఓ బాలుడు తనను ఎవరో కిడ్నాప్‌ చేశారని, వారి నుంచి తప్పించుకున్నానని చెప్పి శుక్రవారం హైడ్రామా సృష్టించాడు. స్థానిక ఫైవింక్లయిన్‌ ప్రాంతానికి చెందిన రజాక్‌ అనే విద్యార్థి గోదావరిఖనిలో ఐదో తరగతి చదువుతూ హాస్టల్‌లోనే ఉంటున్నాడు. కానీ ఆ చిన్నారికి హాస్టల్‌కెళ్లి చదువుకోవడం ఇష్టం లేదు. ఇటీవలే బాగా జ్వరం రావడంతో తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు. ఆరోగ్యం బాగయ్యాక తిరిగి హాస్టల్‌కు పంపేందుకు తల్లి ఆటోలో తీసుకొచ్చింది. స్థానిక రమేశ్‌ నగర్‌లో ఆటో దిగీదిగడంతోనే పిల్లాడు మాయమయ్యాడు. తల్లి చేతిని విడిచిపెట్టి పరుగు లంఘించాడు. జవహర్‌నగర్‌లోని ఓ ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నాడు. దీన్ని గమనించిన ఇంటి యజమానులు ఆరా తీయగా.. ఏడుస్తూ ఓ కథ అల్లాడు. తనతో పాటు మరో బాలుడిని మంథనిలో ఎవరో కిడ్నాప్‌ చేశారని, వ్యాన్‌లో గోదావరిఖనికి తీసుకొస్తుండగా.. ఇద్దరం పారిపోయామని చెప్పాడు. దాంతో వారు వెంటనే బాబును వన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించారు. ఎస్సై నాయుడు బాబు కుటుంబ సభ్యులను పిలిపించి వివరాలు సేకరించగా.. హాస్టల్‌కు వెళ్లడం ఇష్టం లేకే కిడ్నాప్‌ కథ చెప్పానన్నాడు. పిల్లాడితో పాటు తల్లికి వన్‌టౌన్‌ సీఐ ఆరె వెంకటేశ్వర్‌ కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. 
 
 
మరిన్ని వార్తలు